సముద్రం ముంచెత్తుతోంది.. ఖాళీ అవుతోంది ఓ దేశం
తమ భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది అనే ఆందోళనతో తువాలు ప్రజలు ఇప్పటికే వలస బాట పట్టారు.
By: Tupaki Desk | 5 July 2025 6:00 AM ISTభారతీయులకైతే ఊహించలేని విషాదకథ ఇది. మన దేశంలో ఒక ఊరు మునిగిపోతే చాలు కళ్ళలో కన్నీరు వచ్చేస్తుంది. కానీ తువాలు ప్రజల సంగతి చెప్పే సరికి గుండె మనకూ బరువే అవుతుంది. ఎందుకంటే, వారు పుట్టిన మట్టిని, పెరిగిన గడ్డను, ఆప్యాయత నిండిన బంధాలను వదిలి అనివార్యంగా వలస బాట పడుతున్నారు. అంతటితో కాదు.. తాము పుట్టిన దేశం అనే గుర్తింపు కోల్పోతున్న ఘోర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
- తువాలు అంటే...
తువాలు పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న దేశం. సముద్ర మట్టానికి కేవలం ఐదు మీటర్ల ఎత్తులో ఉండే ఈ దేశం, పర్యాటక ఆదాయంపైనే ఆధారపడుతూ జీవనం సాగిస్తోంది. అనేక చిన్న చిన్న దీవుల సమాహారమే తువాలు. ఇక్కడ సముద్ర జీవజాలం, సహజ వనరులు చాలా విస్తారంగా ఉన్నాయి. ఎన్నో అరుదైన జంతుజాలం ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ అందాల దీవులు సముద్ర మట్టాల పెరుగుదలతో ముంపుకు గురవుతున్నాయి.
- శాస్త్రవేత్తల హెచ్చరికలు నిజమవుతున్నాయా?
నాసా వంటి అంతర్జాతీయ సంస్థలు గతంలోనే హెచ్చరించాయి. ఈ శతాబ్దం మధ్య నాటికి తువాలు దేశం పూర్తిగా మునిగిపోతుందని. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్. భూమి మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంచు కరిగిపోతోంది. సముద్ర మట్టాలు ఏటేటా పెరుగుతున్నాయి. తువాలుపై ఈ ప్రభావం తీవ్రమైంది. ఇప్పటికే కొన్ని దీవులు నీట మునిగిపోయాయి. మిగతావి కూడా గల్లంతవుతాయని అంచనా.
- వలసలు ప్రారంభమయ్యాయి
తమ భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది అనే ఆందోళనతో తువాలు ప్రజలు ఇప్పటికే వలస బాట పట్టారు. ఆస్ట్రేలియాతో కుదిరిన "క్లైమేట్ ఒప్పందం" ఆధారంగా, వారికి ప్రత్యేకంగా క్లైమేట్ వీసాలు మంజూరవుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 10,643 మంది వీసాలకు అప్లై చేశారు. మొదటి విడతలో లాటరీ విధానంతో 280 మందిని మాత్రమే ఎంపికచేయనున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. ఇది బాధాకరమైన పరిస్థితి.. వీసా దొరుకుతుందా? లేదంటే తమ భూమిలోని నీరు ఎప్పుడెప్పుడు ముంచేస్తుందా అనే భయంతో ప్రజలు మిగిలిపోతున్నారు.
“పుట్టిన నేల మునిగిపోతోంది. ఇక మా స్వస్థలం ఓ తీపి గుర్తుగా మిగలబోతోంది. అక్కడి నీటిని తాగాం, వాసనను పీల్చాం, బంధాలను ఏర్పరచుకున్నాం. కానీ ఇప్పుడు మా జాతి గుర్తింపు కూడా మాయమవుతోంది. గుండె నిండా బాధతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాం.” అని ప్రజలు వాపోతున్నారు.
తువాలుకు ఇవే చివరి రోజులు కావచ్చు. కానీ ఇది మనకు బోధపడాల్సిన గుణపాఠం. పర్యావరణాన్ని కాపాడకపోతే... ఒక్కో రోజు మనందరి పరిస్థితి కూడా ఇలాగే ఉండొచ్చు. సముద్రాలు ఒక్క ముంపుతోనే ఆగవు. తువాలుతో మొదలైన ఈ విషాద గాధ, మరెన్ని దేశాలను ముంచెత్తుతుందో కాలమే నిర్ణయించాలి. ఈరోజు తువాలు.. రేపు మన దేశంలో ఒడిశా తీరమా? కోస్తా ఆంధ్రమా? చెబితే నమ్మరు కానీ... మార్పు తక్షణమే అవసరం. పర్యావరణ పరిరక్షణ మన భవిష్యత్తు రక్షణ. దాన్ని గుర్తించాలి.