Begin typing your search above and press return to search.

ఒకప్పుడు పాక్.. ఇప్పుడు భారత్ లో ఈ గ్రామం గురించి తలుసుకుంటే షాక్ అవుతారు..

భారత్ అనగానే మనకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన ప్రకృతి వైభవం గుర్తుకు వస్తుంది.

By:  Tupaki Desk   |   15 Feb 2026 8:00 PM IST
ఒకప్పుడు పాక్.. ఇప్పుడు భారత్ లో ఈ గ్రామం గురించి తలుసుకుంటే షాక్ అవుతారు..
X

భారత్ అనగానే మనకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన ప్రకృతి వైభవం గుర్తుకు వస్తుంది. మంచు కొండలు, లోయలు, నదులు, ఎడారులు ప్రతి మలుపులో ఒక కొత్త కథ. అలాంటి కథలతో నిండిన ఒక చిన్న గ్రామమే ‘తుర్టుక్’. ఒకప్పుడు పాకిస్థాన్ పరిధిలో ఉన్న ఈ గ్రామం.. ఇప్పుడు భారత సరిహద్దుల్లో ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా మారింది. సరిహద్దు ప్రాంతం అనగానే భయం, గస్తీ, బంకర్లు గుర్తుకు వస్తాయి. కానీ ఇక్కడకు వస్తే మనసు ప్రశాంతంగా మారిపోతుంది.

యుద్ధం నుంచి యాత్రికుల దాకా..

1971 ఇండో-పాక్ యుద్ధం తర్వాత ఈ గ్రామం భారత్‌లో కలిసింది. ఆ యుద్ధం ఒక భౌగోళిక మార్పే కాదు.. ఇక్కడి ప్రజల జీవితాల్లోనూ ఒక పెద్ద మలుపు. ఎన్నాళ్లుగానో నియంత్రణ రేఖకు అతి సమీపంలో ఉండడంతో ఈ ప్రాంతం ప్రపంచానికి దూరంగా ఉండిపోయింది. 2010 వరకు పర్యాటకులకు ఇక్కడికి ప్రవేశం ఉండేది కాదు. భద్రతా కారణాల దృష్ట్యా ఇది ఒక ‘నో గో జోన్’ లాంటిదే. కానీ కాలం మారింది. ఇప్పుడు అదే తుర్టుక్, సరిహద్దు గ్రామం నుంచి ‘ట్రావెల్ లిస్టులో తప్పక ఉండాల్సిన ప్రదేశం’గా మారిపోయింది.

నుబ్రా లోయలో సంస్కృతిక ద్వీపం

లడఖ్‌లోని నుబ్రా లోయలో, ష్యోక్ నది ఒడ్డున ఉన్న ఈ గ్రామం సహజసిద్ధ సౌందర్యానికి నిదర్శనం. మంచుతో కప్పుకున్న పర్వతాల మధ్య పచ్చదనంతో కనిపించే ఈ గ్రామం, బాల్టి జాతి సంస్కృతికి కేంద్రబిందువుగా నిలుస్తోంది. ఇక్కడి ప్రజల భాష, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ అన్నీ లడఖ్‌లోని మిగిలిన ప్రాంతాల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. హిందీ, బాల్టి, లడఖీ భాషలు ఇక్కడ కలిసిమెలిసి వినిపిస్తాయి. మసీదుల మినారెట్లు, పాతకాలపు రాతి ఇళ్లు, ఆప్రికాట్ తోటలు.. ఇవన్నీ కలిసి తుర్టుక్‌కు ప్రత్యేకమైన స్వరూపం ఇస్తాయి.

పర్యటన అంటే కేవలం సైట్ సీయింగ్ కాదు..

తుర్టుక్‌కు చేరుకోవడం కూడా ఒక అనుభవమే. లేహ్ నుంచి దాదాపు 205 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి ప్రయాణం 6–8 గంటలు పడుతుంది. మార్గం మధ్యంలో ప్రపంచంలోనే ఎత్తయిన మోటరబుల్ రోడ్లలో ఒకటైన ఖార్దుంగ్ లా పాస్ దాటాలి. ఆ మంచు రోడ్ల మీదుగా ప్రయాణం.. ఒక సాహసయాత్రలా అనిపిస్తుంది. ప్రతి మలుపులో ఒక పోస్టుకార్డు లాంటి దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్లాలంటే ‘ఇన్నర్ లైన్ పర్మిట్’ అవసరం. సరిహద్దు ప్రాంతం కాబట్టి ఈ నియమం ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ ఒకసారి పర్మిట్ తీసుకొని ఈ గ్రామంలో అడుగుపెడితే, మీరు పూర్తిగా వేరే ప్రపంచంలోకి వెళ్లిన భావన కలుగుతుంది.

హోమ్ స్టేలు.. హృదయపూర్వక ఆతిథ్యం

తుర్టుక్‌లో హోటళ్ల కంటే హోమ్ స్టేలు ఎక్కువ. స్థానిక కుటుంబాల వద్దే ఉండే అవకాశం లభిస్తుంది. వేడి నీళ్లు, స్థానిక వంటకాలు, సాదాసీదా గదులు.. కానీ అపారమైన ఆతిథ్యం. ఇక్కడి ఆప్రికాట్ జామ్, బాల్టి రొట్టెలు, మాంసాహార వంటకాలు ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ నెట్‌వర్క్, ఇంటర్నెట్ సదుపాయాలు చాలా పరిమితం. కానీ అదే ఈ గ్రామం అందం. మొబైల్ నుంచి దూరమై.. ప్రకృతికి దగ్గరవ్వడం ఇక్కడి అసలు ఆనందం.

ఎందుకింత క్యూ?

ఒకప్పుడు యుద్ధం వల్ల మ్యాప్ మారిన గ్రామం.. ఇప్పుడు పర్యాటక మ్యాప్‌లో ప్రధాన స్థానం సంపాదించుకుంది. చరిత్ర, సంస్కృతి, ప్రకృతి ఈ మూడు ఒకేచోట కలిసిన అరుదైన ప్రదేశం తుర్టుక్ ప్రత్యేకత. సరిహద్దు ప్రాంతంలో ఉన్నప్పటికీ, భయంకన్నా ఆశ్చర్యం ఎక్కువగా కలిగించే గ్రామం ఇది. తుర్టుక్ ఇప్పుడు కేవలం ఒక గ్రామం కాదు.. ఇది భారత భౌగోళిక చరిత్రకు సాక్ష్యం, ప్రకృతి ప్రేమికులకు ఆశ్రయం, సంస్కృతి వైవిధ్యానికి నిదర్శనం. ఒకప్పుడు పాక్‌లో భాగమై.. ఇప్పుడు భారత్‌లో గర్వంగా నిలుస్తున్న ఈ గ్రామం.. సరిహద్దులకంటే మానవ సంబంధాలే గొప్పవని చెబుతోంది.