Begin typing your search above and press return to search.

పాక్ తరుఫున పోరాడిన తుర్కియే సైనికులు.. ఇద్దరు హతం.. తీవ్ర కలకలం

ఇటీవల కాలంలో పాకిస్థాన్, తుర్కియే మధ్య వ్యూహాత్మక రక్షణ సంబంధాలు గణనీయంగా బలపడ్డాయి. భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్థాన్ వందల సంఖ్యలో తుర్కియేకు చెందిన డ్రోన్లను ఉపయోగించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.

By:  Tupaki Desk   |   14 May 2025 4:50 PM IST
పాక్ తరుఫున పోరాడిన తుర్కియే సైనికులు.. ఇద్దరు హతం.. తీవ్ర కలకలం
X

భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కోసం తుర్కియే చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. పాకిస్థాన్‌కు డ్రోన్లు అందించి సాయం చేయడంతో పాటు తమ సైనిక సిబ్బందిని కూడా పంపినట్లు వస్తున్న కథనాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో మరణించిన వారిలో ఇద్దరు తుర్కియే సైనికులు ఉన్నట్లు సమాచారం వెలుగులోకి రావడం ఈ ఆరోపణలకు మరింత బలాన్నిస్తోంది.

ఇటీవల కాలంలో పాకిస్థాన్, తుర్కియే మధ్య వ్యూహాత్మక రక్షణ సంబంధాలు గణనీయంగా బలపడ్డాయి. భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్థాన్ వందల సంఖ్యలో తుర్కియేకు చెందిన డ్రోన్లను ఉపయోగించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ డ్రోన్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి సాయం చేయడానికి తుర్కియే తన సైనిక నిపుణులను ఇస్లామాబాద్‌కు పంపిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ భారత్‌పై దాదాపు 300 నుంచి 400 డ్రోన్లతో భారీ ఎత్తున దాడి చేసింది. భారత బలగాలు ఈ డ్రోన్లను కూల్చివేశాయి. కూల్చివేసిన డ్రోన్ల శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించగా, అవి తుర్కియేకు చెందిన 'అసిస్ గార్డ్ సోనగర్' డ్రోన్లుగా గుర్తించినట్లు సమాచారం. బాయ్రక్టార్ టీబీ2 , వైఐహెచ్‌ఏ (YIHA) డ్రోన్లను కూడా ఉపయోగించినట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తొలి నుంచీ భారత్ పట్ల వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారు. అనేక అంతర్జాతీయ వేదికలపై ఆయన బహిరంగంగానే భారత్‌పై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కాశ్మీర్ అంశంలో ఆయన పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచారు. ఇటీవలే జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రపంచ దేశాలు ఉగ్రవాదుల చర్యలను ఖండించినప్పటికీ, ఎర్డోగాన్ మాత్రం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కలవడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన పాకిస్థాన్‌కు వత్తాసు పలికారని, పహల్గాం దాడిని ఖండించకపోగా, మృతుల కుటుంబాలకు సానుభూతి కూడా వ్యక్తం చేయలేదని వార్తలు వస్తున్నాయి.

పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ముస్లిం దేశాలలో తుర్కియే , అజర్‌బైజాన్ మాత్రమే పాకిస్థాన్‌కు మద్దతుగా ప్రకటనలు చేశాయని సమాచారం. ఇతర ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, , కువైట్ ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని భారత్, పాకిస్థాన్‌లను కోరినట్లు నివేదికలున్నాయి. తుర్కియే భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు సైనికపరంగా కూడా సాయం అందిస్తోందన్న ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.