Begin typing your search above and press return to search.

టీలను మంచి నీళ్లలా తాగేస్తున్నారు.. ఒక్కొక్కరు ప్రతేడాది ఎన్ని కిలోల టీపొడి వాడుతారో తెలుసా ?

టీ అంటే కేవలం అలసట తీర్చుకోవడానికి మాత్రమే కాదు. కొన్ని దేశాల్లో అది ఒక ఆచారంగా, సంప్రదాయంగా మారిపోయింది. దీనికి టర్కీ (తుర్కియే) బెస్ట్ ఉదాహరణ.

By:  Tupaki Desk   |   21 May 2025 12:37 PM IST
టీలను మంచి నీళ్లలా తాగేస్తున్నారు.. ఒక్కొక్కరు ప్రతేడాది ఎన్ని కిలోల టీపొడి వాడుతారో తెలుసా ?
X

టీ అంటే కేవలం అలసట తీర్చుకోవడానికి మాత్రమే కాదు. కొన్ని దేశాల్లో అది ఒక ఆచారంగా, సంప్రదాయంగా మారిపోయింది. దీనికి టర్కీ (తుర్కియే) బెస్ట్ ఉదాహరణ. అక్కడ టీ కేవలం ఒక డ్రింక్ కాదు, వాళ్ళ సంస్కృతిలో ఒక భాగం. అక్కడ ప్రజలు టీని నిజంగా నీళ్లలా తాగుతారు. టర్కీ గణాంకాల సంస్థ(TurkStat) తాజా నివేదిక ప్రకారం.. సగటు టర్కీ పౌరుడు సంవత్సరానికి 3 కిలోల కంటే ఎక్కువ టీ తాగుతాడు. దీంతో టర్కీ ప్రపంచంలోనే ఒక్కొక్కరు అత్యధికంగా టీ తాగే దేశంగా నిలిచింది. అక్కడ ప్రతిరోజూ నీళ్లు తాగినంత సహజంగా టీ తాగుతారు.

టర్కీ జీవితంలో టీ ఒక భాగం!

టర్కీలో టీని 'చాయ్' అంటారు. ఇది కేవలం వేడి పానీయం కాదు, ప్రతిరోజు ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఇది ఒక ముఖ్యమైన భాగం. అక్కడ ఆఫీసుల్లో మీటింగ్స్ జరిగేటప్పుడు, స్నేహితులు కబుర్లు చెప్పుకునేటప్పుడు, బంధువుల కలయికల్లో, షాపుల్లో కస్టమర్‌లతో మాట్లాడేటప్పుడు - ఇలా ప్రతీ చోటా టీ తప్పనిసరి. ఇక్కడ టీని ప్రత్యేకమైన ట్యులిప్ ఆకారపు గ్లాసుల్లో అందిస్తారు.

2019 నుండి 2023 మధ్య ప్రతి సంవత్సరం సగటున 5.1శాతం మేర టీ వినియోగం పెరిగింది. 2023 చివరి నాటికి, ఒక్కొక్కరు సగటున 4.6 కిలోల టీ తాగారు. కాఫీ వినియోగం కేవలం 0.9 కిలోలు మాత్రమే ఉంది అంటే, టర్కీలో కాఫీ కన్నా టీకే ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. 2023లో రిటైల్ అమ్మకాల్లో 98.2శాతం ఒక్క బ్లాక్ టీదే (దాదాపు 2.4 లక్షల టన్నులు). మిగిలిన 1.0శాతం హెర్బల్/ఫ్రూట్ టీ, 0.7శాతం గ్రీన్ టీ ఉన్నాయి.

బ్లాక్ సీ: టీకి కేరాఫ్ అడ్రస్

టర్కీలో టీకి కేరాఫ్ అడ్రస్ బ్లాక్ సీ (నల్ల సముద్రం) ప్రాంతం, ముఖ్యంగా రిజ్ (Rize) అనే ప్రావిన్స్. ఇక్కడి వాతావరణం, నేల టీ సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి. 5వ శతాబ్దంలో సిల్క్ రూట్ ద్వారా ఈ ప్రాంతానికి టీ వచ్చింది. 6వ శతాబ్దానికి ఇది సాధారణ పానీయంగా మారింది. 20వ శతాబ్దం నాటికి టీ మొత్తం టర్కీ ప్రజలను తన అభిమానులుగా చేసుకుంది. ఈ ప్రాంతంలోని కొన్ని గ్రామాల పేర్లలో కూడా 'చాయ్' అనే పదం ఉంది. ఇక్కడ చాలా తరాలు టీ సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నాయి – చదువులు, వైద్యం, ఇల్లు అన్నీ ఈ ఆదాయం నుంచే సాగుతాయి.

ఆర్థికంగానూ టీదే పైచేయి

టర్కీలో టీ అనేది కేవలం రుచి, అలవాటు మాత్రమే కాదు, ఇది వేల కుటుంబాలకు ఆదాయ వనరు. సాగు నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ వరకు లక్షలాది మంది దీనిపై ఆధారపడి ఉన్నారు. రవాణా, యంత్రాలు, షాపుల వరకు దీనికి పెద్ద నెట్‌వర్క్ ఉంది. ప్రభుత్వం కూడా టీ రైతులకు సబ్సిడీలు, స్థిరమైన ధరలు, సౌకర్యాలను (ఇన్ఫ్రాస్ట్రక్చర్) అందించి మద్దతు ఇస్తుంది. 2023లో టర్కీలో టీ ఉత్పత్తి 1.35 కోట్ల టన్నులకు చేరింది. 2019 నుండి 2023 మధ్య ప్రతి సంవత్సరం సగటున 3.3శాతం చొప్పున ఉత్పత్తి పెరుగుతూ వచ్చింది. మొత్తం 3.43 లక్షల టన్నుల పెరుగుదలను చూపింది. అంతేకాదు, టర్కీ టీ ఎగుమతులు 2019లో 42వేల టన్నుల నుంచి 2023లో 53వేల టన్నులకు పెరిగాయి. ముఖ్యంగా యూరోప్‌లో దీనికి డిమాండ్ వేగంగా పెరిగింది.