పాకిస్తాన్‌కు అండగా టర్కీలో కుక్కల పంచాయతీ
ఇటీవల భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య టర్కీ పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 May 2025 5:00 PM ISTఇటీవల భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య టర్కీ పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఏకంగా యుద్ధ నౌకలను కూడా కరాచీకి పంపింది. కానీ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తన సొంత దేశంలో ఒక పెద్ద సమస్యతో తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. అదేమిటంటే వేగంగా పెరుగుతున్న వీధి కుక్కల జనాభా. ఈ సమస్య ఇప్పుడు కేవలం సామాజిక సమస్య కాదు, ఒక పెద్ద రాజకీయ సమస్యగా మారింది. పరిస్థితి ఎలా ఉందంటే.. ప్రభుత్వం హడావుడిగా ఒక కఠినమైన చట్టాన్ని అమలు చేయాల్సి వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఆగస్టు 2, 2024 నుంచి అమలులోకి వచ్చిన 'జంతు సంరక్షణ చట్టం నంబర్ 7527' ప్రకారం, స్థానిక పరిపాలనకు వీధుల్లో తిరిగే కుక్కలను పట్టుకుని షెల్టర్‌లలో ఉంచడానికి , అవసరమైతే వాటిని చంపడానికి కూడా అధికారం లభించింది. ఈ చట్టం నుంచి యూథనేషియా వంటి పదాలను తొలగించినప్పటికీ కార్యకర్తలు మాత్రం కుక్కలను దారుణంగా చంపుతున్నారని ఆరోపిస్తున్నారు.
గత కొన్ని నెలల్లో అనేక బాధాకరమైన సంఘటనలు జరిగాయి. కొన్యాలో 2 ఏళ్ల చిన్నారి మృతి, అదానా, ఎర్జురమ్‌లలో వృద్ధ మహిళలపై ప్రాణాంతక దాడులు దేశాన్ని కుదిపేశాయి. భయం ఎంతగా నాటుకుపోయిందంటే అనేక నగరాల్లో పిల్లలు పాఠశాలలకు కూడా వెళ్లడం లేదు. ప్రభుత్వం దీనిని 'ప్రజల భద్రత' సమస్యగా పేర్కొంటూ వెంటనే చట్టాన్ని ఆమోదించింది. కానీ విమర్శకులు మాత్రం ఈ చట్టం పేద ప్రాంతాలపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుందని, అక్కడ ఇప్పటికే వనరుల కొరత ఉందని అంటున్నారు.
ఈ చట్టం టర్కీలో ఒక కొత్త రాజకీయ విభజనకు కూడా కారణమవుతోంది. సంప్రదాయవాద, ప్రభుత్వ అనుకూల పార్టీలు ఈ చట్టానికి మద్దతు తెలుపుతున్నాయి, అయితే ప్రతిపక్ష పార్టీలు దీనిని కుక్కలను చంపడానికి ఇచ్చిన లైసెన్స్‌గా అభివర్ణిస్తున్నాయి.
ప్రజలు ఏమనుకుంటున్నారు?
మెట్రోపోల్ నిర్వహించిన సర్వే ప్రకారం, 78శాతం మంది కుక్కలను షెల్టర్‌లలో ఉంచాలని కోరుకుంటున్నారు, అయితే 17శాతం మంది వాటిని వీధుల్లోనే ఉండనివ్వాలని కోరుకుంటున్నారు. జంతు హక్కుల కార్యకర్తలు ప్రభుత్వం నుంచి స్టెరిలైజేషన్ (వంధ్యత్వం), టీకాలు, మెరుగైన షెల్టర్‌లను డిమాండ్ చేస్తున్నారు. చంపడం పరిష్కారం కాదని, మానవతా దృక్పథంతో, శాస్త్రీయ విధానాన్ని అవలంబించడం అవసరమని వారు అంటున్నారు. పాకిస్తాన్ దుష్ట దాడులను ఎదుర్కోవడానికి భారతదేశం తన సైనిక శక్తిని ప్రదర్శిస్తున్న సమయంలో, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మాత్రం ఒక విభిన్నమైన సమస్యతో పోరాడుతున్నారు.
