Begin typing your search above and press return to search.

టర్కీ.. తుర్కియేగా ఎందుకు మారింది? దాని వెనక ఉందెవరు?

టర్కీ అన్నంతనే ప్రత్యేకంగా పరిచయం లేని దేశంగా భారతీయుల్లో చాలామందికి సుపరిచితం. కానీ.. ఆ దేశం తన పేరును తుర్కియేగా మార్చుకుంది.

By:  Tupaki Desk   |   10 May 2025 2:37 PM IST
Turkey Change Its Name to Türkiye? The Real Story Behind It
X

టర్కీ అన్నంతనే ప్రత్యేకంగా పరిచయం లేని దేశంగా భారతీయుల్లో చాలామందికి సుపరిచితం. కానీ.. ఆ దేశం తన పేరును తుర్కియేగా మార్చుకుంది. ఎందుకిలా? తాజాగా భారత్ - పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దేశం పాకిస్తాన్ కు పెద్ద ఎత్తున డ్రోన్లను సరఫరా చేయటం.. వాటిని మన దేశం మీద దాయాది ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో టర్కీ అని సంబోధిస్తూనే.. తుర్కియో అంటూ పేర్కొంటున్న వైనం పలువురిని గందరగోళానికి గురి చేస్తోంది. ఇంతకూ టర్కీ పేరును తుర్కియోగా ఎప్పుడు మార్చుకుంది? దీని వెనుక ఏం జరిగింది? ఈ పేరు మార్పు వెనుకున్న లక్ష్యమేంటి? పేరు మార్పు దిశగా కీలకంగా వ్యవహరించింది ఎవరు? లాంటి ప్రశ్నలు వేసుకుంటే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి.

ఈ విషయాల్లోకి వెళ్లే ముందు ఒక ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించి.. విషయంలోకి వెళదాం. ఒక దేశం తన పేరును మార్చుకోవాలన్నప్పుడు ఐక్యరాజ్య సమితి ఆమోదం ఉండాలి. ఒక వ్యక్తి పేరును అధికారికంగా మార్చుకోవాలంటే ఎంత పెద్ద తతంగం ఉంటుందో.. ఒక దేశం పేరు మార్చుకోవాలంటే అంతకు మించిన ఇబ్బందులే ఉంటాయి. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి రివ్యూలో ఆమోదం పొందాలి. అప్పుడు మాత్రమే ఒక దేశ తన పేరును అధికారికంగా మార్చుకోగలుగుతుంది. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమంటే.. ‘టర్కీ’ తన పేరును ‘‘తుర్కియో’’గా మార్చుకునేందుకు ఐక్యరాజ్య సమితో పెద్ద కష్టపడుకుండా.. సింఫుల్ గా పూర్తి చేసుకోవటం ఒక విశేషంగా చెప్పాలి.

ఇంతకూ టర్కీ తన దేశం పేరును తుర్కియోగా ఎందుకు మార్చుకుంది? అన్న వివరాలకు ముందు.. అసలీ దేశం ఎక్కడ ఉంది? దానికి అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందన్న విషయాన్ని సంక్షిప్తంగా తెలుసుకుంటే.. చాలావరకు కన్ఫ్యూజన్ పోతుంది. టర్కీ ప్రత్యేకత ఏమంటే..ఈ దేశం రెండు ఖండాల మధ్య ఉంటుంది. ఆసియా.. ఐరోపా ఖండాలను కలిసి ఉంటుంది. అంటే.. తూర్పు.. పడమరల కలయికగా చెప్పాలి. టర్కీకి 8 దేశాలతో సరిహద్దులు ఉన్నాయి.

1. ఈశాన్యంలో బల్గేరియా

2. పశ్చిమాన గ్రీస్

3. వాయువ్యంలో జార్జియా

4. తూర్పున ఆర్మీనియా

5. అజర్ బైజాన్

6. ఇరాన్

7. ఆగ్నేయంలో ఇరాక్

8. సిరియా

ఈ దేశంలో మానవ నివాసాలు పాలియో లిథిక్ కాలం నుంచి ఉన్నాయి. మరింత వివరంగా చెప్పాలంటే 40వేల ఏళ్ల క్రితమే ఇక్కడ మనుషులు నివసించటం మొదలైంది. ఆ తర్వాత అంశాల్ని పక్కన పెట్టేస్తే.. ఎప్పుడైతే అలెగ్జాండర్ ఈ ప్రాంతాన్ని జయించిన తర్వాత ఇది రోమన్ సామ్రాజ్యంలో భాగమైంది. 1923లో రిపబ్లిక్ ఆఫ్ టర్కీగా స్థాపించారు. మొదటి అధ్యక్షుడు అటాతుక్. టర్కీ అధికారిక భాష టర్కిష్. భారత గ్రంధాల్లో ఈ దేశాన్ని తురుష్క దేశంగా పేర్కొంటారు. టర్కీ అనే పదానికి ఒక పక్షి అన్న అర్థం ఉంది. ప్రాశ్చాత్య దేశాల్లో టర్కీ (TURKEY) అనే పదాన్ని ఫెయిల్యూర్ అయిన వ్యక్తికి వాడుతుంటారు. అదే సమయంలో కొంత కామెడీగా ఈ పదాన్ని వాడుతుంటారు. దీంతో.. టర్కీ పాలకులు తమ దేశాన్ని తక్కువగా చూస్తున్నారన్న భావన ఉంది.

ఇలాంటి భావోద్వేగ అంశాన్ని రగల్చటానికి ముందు వరకు ఎవరూ పట్టించుకోరు. కానీ.. ఒకసారి ఇలాంటి భావాలు ప్రజల్లోకి వెళ్లిన తర్వాత మార్పును కోరుకోవటం ఎక్కడైనా సహజం. టర్కీలోనూ అలానే జరిగింది. టర్కీ దేశ పేరును తుర్కియోగా మార్చటంలో కర్త..కర్మ.. క్రియ మొత్తం ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ గా చెప్పాలి. అతడి పూర్తి పేరు రెజెప్ తయ్యిప్ ఎర్డోగాన్.

ఈ పెద్ద మనిషి టర్కీ దేశాన్ని మరింత గౌరవంగా.. మర్యాదపూర్వకంగా పిలిచేందుకు వీలుగా తుర్కియో పేరును తెర మీదకు తీసుకొచ్చారు. ఒక విధంగా దేశం పేరును మార్చాలనే నినాదంతో ప్రజల్లో జాతీయభావాన్ని పెంచే వ్యూహంతో పాటు.. రాజకీయంగా తనకు ఎదురే లేకుండా చేశారని చెప్పాలి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. టర్కీ పేరును మార్చాలని ఆ దేశ ప్రజల్లో ఎలాంటి డిమాండ్ లేదు. దీన్ని తెర మీదకు తీసుకొచ్చింది.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి చేసి.. తుర్కియోగా పేరు మార్చిన ఘనత ఎర్డోగాన్ కే దక్కుతుంది.

2023లో ఆ దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు టర్కీ పేరు మార్చే అంశాన్ని వ్యూహాత్మకంగా తెర మీదకు తీసుకొచ్చిన అధ్యక్షుడు.. తాను అనుకున్నట్లే ప్రజల్లో భావోద్వేగాల్ని క్రియేట్ చేయటమే కాదు.. వందల ఏళ్లుగా ఉన్న పేరును ఇట్టే మార్చేసిన క్రెడిట్ ను సొంతం చేసుకున్నారు. దేశం పేరును మార్చటమే కాదు.. మరోసారి దేశాధ్యక్షుడిగా అయ్యారు. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని చెప్పాలి. తన దేశం పేరును టర్కీ కాకుండా తుర్కియోగా గుర్తించాలని కోరుతూ 2022లో ఎర్డోగానో అమెరికాకు లేఖ రాసి అభ్యర్థించారు. కొద్ది వారాలకే ఈ అంశం ఐక్యరాజ్యసమితి వద్దకు చేరింది. చాలా తక్కువ వ్యవధిలోనే అంటే.. 2022 జూన్ లో టర్కీ పేరును తుర్కియోగా మార్చేస్తూ ఐక్యరాజ్యసమితి తన ఆమోదాన్ని ప్రకటించింది. అలా టర్కీ కాస్తా తుర్కియోగా మారింది. ఇప్పుడు టర్కీ దేశం పేరు మీద ఉన్న కన్ఫ్యూజన్ కాస్తా ఫుల్ క్లారిటీ వచ్చేసిందా?