భూకంపం వచ్చినా బ్రేకింగ్ న్యూస్ ఆపను.. టర్కీ యాంకర్ తెగువకు సెల్యూట్!
రెండు రోజుల కిందట టర్కీలోని ఇస్తాంబుల్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
By: Tupaki Desk | 25 April 2025 10:35 AMరెండు రోజుల కిందట టర్కీలోని ఇస్తాంబుల్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ సమయంలో సీఎన్ఎన్ నెట్ వర్క్ న్యూస్ ఛానెల్‌లో లైవ్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఒక గెస్టుతో మాట్లాడుతున్న న్యూస్ యాంకర్ మెల్టెమ్ బోజ్‌బెయోగ్లు, స్టూడియో ఒక్కసారిగా కుదుపులకు లోనవడంతో ఏం జరుగుతుందో అర్థం కాక క్షణకాలం ఆందోళనకు గురైంది. స్టూడియోలోని లైట్లు ఊగిపోతుండగా, కెమెరాలు కదులుతుండగా ఆమె వెంటనే తన తల్లికి ఫోన్ చేయమని ప్రోగ్రాం ప్రొడ్యూసర్ ను కోరింది.
బుధవారం స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 12:49 గంటలకు టర్కీలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్‌ను 6.2 తీవ్రతతో భూకంపం తాకింది. దేశంలో వరుసగా భూకంపాలు సంభవిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. టర్కీ ఎమర్జెన్సీ సేవల విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భూకంపం 6.92 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఇటీవలి సంవత్సరాల్లో ఇస్తాంబుల్‌ను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదేనని అధికారులు తెలిపారు.
CNN ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుండగా ఈ భూకంపం సంభవించింది. యాంకర్ మెల్టెమ్ బోజ్‌బెయోగ్లు ఒక అతిథితో మాట్లాడుతుండగా స్టూడియో వణకడం మొదలైంది. ఆ సమయంలో న్యూస్ చానల్ యాంకర్ ప్రదర్శించిన హావభావాలు ట్రెండ్ అవుతున్నాయి. లైవ్లోనే భూకంపం వచ్చినప్పుడు ఆమె అక్కడినుంచి పరుగులు తీయకుండా న్యూస్ రూమ్ లోనే ఆమె డిబేట్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇటీవలి సంవత్సరాలలో ఇస్తాంబుల్‌ను తాకిన అత్యంత శక్తివంతమైన ఈ భూకంపం కేవలం 15 సెకన్లలోపు ఆగిపోయింది. భవనాల నుంచి దూకడానికి ప్రయత్నించి 151 మంది గాయాలతో ఆసుపత్రి పాలయ్యారని నివేదికలు పేర్కొన్నాయి. అయితే, ప్రాణనష్టం లేదా పెద్దగా ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని టర్కీ ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనకు గురై వీధుల్లో గుమిగూడారు.