Begin typing your search above and press return to search.

2 రోజుల్లో ఇద్దరు విద్యార్థులు కాల్పులు.. అంతమందిని పొట్టన పెట్టుకున్నారు

సాన్ లియుర్పా ప్రావిన్స్ లోని సివెరెక్ లోని ఒక వృత్తి విద్యా ఉన్నత పాఠశాలకు చెందిన మాజీ విద్యార్థి గన్ తీసుకొచ్చి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు.

By:  Garuda Media   |   16 April 2026 10:14 AM IST
2 రోజుల్లో ఇద్దరు విద్యార్థులు కాల్పులు.. అంతమందిని పొట్టన పెట్టుకున్నారు
X

అంచనాలకు సైతం అందని రీతిలో చోటు చేసుకున్న దారుణ హింసాత్మక సీరియల్ కాల్పుల దెబ్బకు తుర్కియేతో పాటు.. యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి. రోజు వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు (ఒకరు మాజీ) తాము చదివిన స్కూళ్లల్లో విచక్షణరహితంగా కాల్పులు జరపటం.. పలువురు విద్యార్థుల ప్రాణాలు తీయటం..చివర్లో తమను తాము కాల్చుకొని చనిపోయిన వైనం షాక్ కు గురి చేసేలా మారింది. ఈ ఇద్దరు విద్యార్థులకు ఎలాంటి సంబంధం లేదని.. రెండు ఘటనలు జరిగిన ప్రాంతాలు 300కి.మీ. పైనే ఉన్నట్లుగా గుర్తించారు. ఈ షాకింగ్ ఉదంతంలో మొదటి దారుణ ఉదంతం ఏప్రిల్ 14న జరిగింది.

సాన్ లియుర్పా ప్రావిన్స్ లోని సివెరెక్ లోని ఒక వృత్తి విద్యా ఉన్నత పాఠశాలకు చెందిన మాజీ విద్యార్థి గన్ తీసుకొచ్చి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఉదంతంలో మొత్తం 16 మంది గాయాలపాలయ్యారు. పోలీసులకు చిక్కకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఉదంతం జరిగిన 28 గంటల వ్యవధిలో దక్షిణ తుర్కియేలోని ఖహ్రామన్ మరాస్ ప్రావిన్స్ లోని అయేసర్ కాలిక్ సెకండరీ స్కూల్లో చదువుతున్న ఎనిమిదేళ్ల విద్యార్థి ఏకంగా ఐదు గన్ లు తీసుకొచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.ఈ షాకింగ్ ఉదంతంలో ఒక ఉపాధ్యాయుడితో పాటు మొత్తం తొమ్మిది మంది మరణించాడు. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విద్యార్థి తండ్రి మాజీ పోలీసు అధికారిగా చెబుతున్నారు. అతడి ఇంట్లో నుంచి ఐదు పిస్టళ్లు.. పలు రౌండ్లకు సరిపోయే మ్యాగ్ జైన్లను కాల్పుల కోసం తీసుకొచ్చినట్లుగా గుర్తించారు. ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలు ఎలా వచ్చి ఉంటాయన్నది ప్రశ్నగా మారింది.

ఈ ఉదంతం తుర్కియేలో పెను సంచలనంగా మారింది. రోజు వ్యవధిలో ఇద్దరు నిందితులు విద్యార్థులే కావటం.. ఇద్దరు తాము చదివిన స్కూళ్ల మీదనే దాడి చేయటం.. ఇద్దరు ఆత్మహత్య చేసుకోవటం.. ఈ ఇద్దరు తాము చేయబోయే దారునాలకు సంబంధించినకొన్ని వివరాల్ని సోషల్ మీడియాలో పోస్టు చేయటం గమనార్హం. రెండు రోజుల్లో రెండు ఆత్మహత్యోదంతాలు చోటు చేసుకోవటం తుర్కియే దేశ చరిత్రలో ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

మొదటి విద్యార్థి తండ్రిని విచారించకున్నా.. రెండో విద్యార్థి తండ్రిని పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొదటి విద్యార్థి తన దారుణ మారణకాండ వేళకు కాస్త ముందుగా సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయటం.. తనస్కూల్ ఎదుటగా నిలబడి.. త్వరలో ఆ స్కూల్లో దాడికి సంబంధించిన సంకేతాల్ని ఇవ్వటం గమనార్హం. మొదటి ఉదంతానికి చెందిన విద్యార్థి పాఠశాలకు సరిగా రాకపోవటంతో అతడ్ని స్కూల్ నుంచి తీసేశారు. తన కాల్పుల పరంపరను స్కూల్ గేటు నుంచే మొదలు పెట్టిన వైనంతో షాక్ కు గురయ్యారు. వీరిద్దరూ తుర్కియే జాతీయులగా పోలీసులు గుర్తించారు. ఈ ఉదంతం మరింత చర్చకు అవకాశం ఇవ్వకుండా ఉండేలా ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షల్ని విధించారు. దీంతొ పలు కీలక అంశాలు బయటకు రాని పరిస్థితి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి