తురకపాలెం మరణాలకు మెలియోడోసిస్ వైరస్సే కారణమా? రిపోర్టులు ఏం చెబుతున్నాయి?
గుంటూరు జిల్లా తురకాపాలెంలో 40 మంది మరణానికి కారణమైన అంతుచిక్కని వ్యాధికి కారణంపై స్పష్టత వస్తోందని అంటున్నారు.
By: Tupaki Desk | 13 Sept 2025 4:02 PM ISTగుంటూరు జిల్లా తురకాపాలెంలో 40 మంది మరణానికి కారణమైన అంతుచిక్కని వ్యాధికి కారణంపై స్పష్టత వస్తోందని అంటున్నారు. కొద్దిరోజులుగా ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించడంతోపాటు గ్రామస్తుల నుంచి రక్త నమూనాలు సేకరించిన వైద్యులు సుమారు 40 రకాల పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో దాదాపు మూడు వేల మంది ఉండగా, 4 శాతం మందిలో ‘మెలియోడోసిస్’ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ లక్షణాలతో ఒకరు మరణించారని అంటున్నారు. దీంతో మరణాల మిస్టరీని ఛేదించేలా సమగ్ర అధ్యయనం చేయాలని ప్రభుత్వం వైద్యులను ఆదేశించినట్లు చెబుతున్నారు.
గత ఐదు నెలల వ్యవధిలో పదుల సంఖ్యలో గ్రామస్తులు మరణించడంతో ఆ ఊరు వెళ్లేందుకు కూడా చుట్టుపక్కల గ్రామాల వారు, బంధువులు భయపడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మరణాలకు పలు కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. గ్రామంలోని ఓ ఆర్ఎంపీ వైద్యుడు వద్ద వైద్యం పొందడం, కలుషిత సెలైన్ బాటిళ్లు ఎక్కించడం వల్ల ఆరోగ్యం క్షీణించి గ్రామస్తులు మరణించారన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఏ విషయమైనా రక్త పరీక్షల నివేదికల తర్వాతే నిర్ధారణకు రావాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో వారం రోజుల్లోగా తురకపాలెంలో మరణాలకు దారితీసిన కారణాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. తురకపాలెంలో సీనియర్ వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతూనే ఉండాలని సూచించారు. తురకపాలెంలో 18 ఏళ్లు పైబడిన వారు 2018 మంది ఉన్నారు. వీరిలో 1,501 మంది స్థానికంగా ఉంటే వారికి 42 రకాల రక్త పరీక్షలు నిర్వహించారు. 109 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇక బ్లడ్ కల్చర్ పరీక్ష ద్వారా 4% మందిలో 'మెలియోడోసిస్' ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఒకరు మరణించగా ముగ్గురు కోలుకున్నారని చెబుతున్నారు. ఇక మట్టి నమూనాల పరీక్షల ఫలితాలు వస్తే మరణాలకు కారణాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.
ఇక తురకపాలెం ఘటన అనుభవంతో రాష్ట్రస్థాయిలో ఫీవర్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో ఎ.ఎన్.ఎం, ఆశాలు వర్కర్లు ఏ రోజుకారోజు గ్రామాల్లో పర్యటించి సమాచారం సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక యాప్ లో ప్రజల ఆరోగ్య సమాచారాన్ని నమోదు చేయాలని సూచించింది. ఎక్కడైనా నిర్దిష్ట సంఖ్య కంటే మరణాల నమోదు ఎక్కువగా ఉంటే వెంటనే అలెర్ట్ మెసేజ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి వచ్చేలా వ్యవస్థను పటిష్ట పరుస్తోంది. దీనివల్ల సకాలంలో సత్వర చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు.
