తుని చిన్నారి కేసు మిస్టరీ.. పెంపుడు కుక్క కూడా మృతి! ఇప్పుడెలా?
ఎంతమంది వెతికినా చిన్నారి ఆచూకీ లేకపోవడంతో చిన్నారి అదృశ్యం కేసులో ఈ కుక్కే కీలక ఆధారాలు ఇస్తుందని భావించిన పోలీసులు.. దానికి ఒక 'జీపీఎస్ ట్రాకర్' అమర్చారు.
By: Tupaki Political Desk | 14 Jun 2026 1:26 AM ISTకాకినాడ జిల్లా తునిలో కలకలం రేపిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చిన్నారి ఆచూకీ కోసం ఈ కుక్క ద్వారానే క్లూస్ సాధించవచ్చని ఆశించిన పోలీసులు, కుటుంబ సభ్యులకు ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించడమే కాకుండా కేసును మరింత మిస్టరీగా మార్చేసింది. చిన్నారి మిస్ అయిన వారం రోజులకు కుక్క మరణించడంపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగింది?
ఈ నెల 6న తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి హఠాత్తుగా అదృశ్యమైంది. ఆ సమయంలో ఆమె వెంటే వెళ్లిన పెంపుడు కుక్క కూడా పాపతో పాటే కనిపించకుండా పోయింది. దీంతో ఎవరో చిన్నారిని కిడ్నాప్ చేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, చిన్నారి అదృశ్యమైన మూడు రోజుల తర్వాత పెంపుడు కుక్క ఒంటరిగా తిరిగి ఇంటికి చేరుకుంది. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆ కుక్క ప్రవర్తన చాలా విచిత్రంగా మారడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు దానిపై ప్రత్యేక నిఘా పెట్టారు. మరోవైపు చిన్నారి ఆచూకీ కోసం దాదాపు 500 మంది పోలీసులు గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు.
జీపీఎస్ ట్రాకర్ అమర్చిన పోలీసులు
ఎంతమంది వెతికినా చిన్నారి ఆచూకీ లేకపోవడంతో చిన్నారి అదృశ్యం కేసులో ఈ కుక్కే కీలక ఆధారాలు ఇస్తుందని భావించిన పోలీసులు.. దానికి ఒక 'జీపీఎస్ ట్రాకర్' అమర్చారు. కుక్క ఎక్కడికైనా వెళ్తే, ఆ కదలికల ద్వారా చిన్నారిని దాచిపెట్టిన ప్రాంతాన్ని కనిపెట్టవచ్చని అధికారులు స్కెచ్ వేశారు. శుక్రవారం కుక్క కదలికలను అధికారులు ప్రత్యేకంగా పరిశీలించారు. సుమారు 8 కిలోమీటర్ల మేర తిరిగిన కుక్క ఇంటికి మళ్లీ వచ్చింది. అయితే ఆహారం లేకపోవడంతో శనివారం ఇంటి ఆవరణలోనే మరణించింది. గత రెండు రోజులుగా ఆ కుక్క ఆరోగ్యం క్షీణించిందని, వెటర్నరీ అధికారులను పిలిపించి చికిత్స కూడా అందించారని చెబుతున్నారు. శుక్రవారం రాత్రి వైద్యులు ఇంజెక్షన్ ఇవ్వగా, శనివారం ఉదయం ఆ కుక్క అనారోగ్యంతో ప్రాణాలు విడిచింది.
పెరుగుతున్న అనుమానాలు
కేసును ఓ కొలిక్కి తెస్తుందనుకున్న పెంపుడు కుక్క ఇలా హఠాత్తుగా మరణించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారిని అపహరించిన వారే కుక్కపై విషప్రయోగం చేశారా? లేక మూడు రోజుల పాటు బయట ఉన్న సమయంలో దానికి ఏదైనా జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుక్క మృతితో కేసు దర్యాప్తులో ఒక కీలకమైన ఆధారాన్ని కోల్పోయినట్లయిందని అంటున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం స్థానికులు, కుటుంబ సభ్యులను విచారించడంతో పాటు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు.
