జూన్ 30 - 'వరల్డ్ ఆస్ట్రాయిడ్ డే'.. ఎందుకో తెలుసా?
అవును... 1908లో సరిగ్గా ఇదే రోజున రష్యాలోని సైబీరియాలో భారీ గ్రహశకలం భూమిని తాకింది.
By: Tupaki Desk | 30 Jun 2025 7:23 AMఅంతరిక్షం నుంచి ఒక గ్రహశకలం భూమివైపు దూసుకొస్తుంది.. అది భూమిని తాకితే కొన్ని దేశాలు నాశనమైపోతాయి.. ఊహించనిస్థాయిలో ప్రాణనష్టం జరుగుతుంది.. ఇదే యుగాంతం కావొచ్చు అంటూ అప్పుడప్పుడూ మీడియాలో కథనాలొస్తుంటాయి! ఆ మరుసటి రోజు.. ఆ గ్రహశకలం తన దిశను మార్చుకుందనో.. లేక, గాల్లోనే పేలిపోయిందనో వింటుంటాం! అయితే 1908 - జూన్ 30న మాత్రం అలా జరగలేదు.
అవును... 1908లో సరిగ్గా ఇదే రోజున రష్యాలోని సైబీరియాలో భారీ గ్రహశకలం భూమిని తాకింది. ఆ సమయంలో.. సుమారు 185 హిరోషిమా అణుబాంబులకు సమానమైన శక్తి విడుదలైనట్లు అంచనా వేస్తున్నారు. ఫలితంగా.. సుమారు 2,000 చదరపు కిలోమీటర్ల అడవి తుడిచిపెట్టుకుపోయింది. అందుకే జూన్ 30ని ప్రపంచ గ్రహ శకల దినోత్సవం (వరల్డ్ ఆస్ట్రాయిడ్ డే)గా నిర్వహిస్తున్నారు.
దీంతో.. ఈ సంఘటన జరిగిన దాదాపు 19 సంవత్సరాల తర్వాత మొదటి శాస్త్రీయ యాత్ర 1927 వరకు ఆ ప్రాంతానికి చేరుకోలేదు. ఆలస్యం అయినప్పటికీ.. ఆ యాత్ర ఆస్టరాయిడ్ ప్రభావానికి సంబంధించిన విస్తృతమైన ఆధారాలను కనుగొంది. ఈ క్రమంలో... ప్రజలకు ఆస్టరాయిడ్ ప్రమాదాలు, ప్రభావం గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రపంచ ఆస్ట్రాయిడ్ డేని నిర్వహిస్తున్నారు.
దీనికి సంబంధించిన తీర్మానాన్ని 2016 డిసెంబర్ లో ఐరాస జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. ఈ క్రమంలో... ఇది అంతరిక్ష శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఈ అవగాహన ఆస్టరాయిడ్ గుర్తింపు, ట్రాకింగ్, విక్షేపం కోసం వ్యూహాలను అభివృద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది. కాగా... ఈ ఏడాది ప్రపంచం ఆస్టరాయిడ్ దినోత్సవం 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది.
2029 అంతర్జాతీయ గ్రహశకల అవగాహన సంవత్సరం!:
99942 అపోఫిస్ అనే గ్రహశకలం భూమికి దగ్గరగా రానుండటంతో.. ఐక్యరాజ్యసమితి 2029ని అంతర్జాతీయ గ్రహశకల అవగాహన, గ్రహ రక్షణ సంవత్సరంగా ప్రకటించింది. ఈ క్రమంలో.. ఆ ఏడాది ఏప్రిల్ 13న అపోఫిస్ భూమి ఉపరితలం నుండి 32,000 కిలోమీటర్ల దూరంలో సురక్షితంగా వెళుతుంది. ఇది కొన్ని భూస్థిర ఉపగ్రహాల కంటే దగ్గరగా ఉంటుంది.
సుమారు 340 మీటర్ల వ్యాసం కలిగి.. దాదాపు మూడు ఫుట్ బాల్ మైదానాల పరిమాణంలో ఉండే ఈ గ్రహశకలం.. ప్రస్తుతం ప్రతి 323 రోజులకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అయితే... 2029లో దాని కక్ష్య మారుతుంది. ఆ సమయంలో... యూరప్, ఆఫ్రికా, పశ్చిమ ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో ఇది కంటికి కనిపిస్తుందని చెబుతున్నారు.