Begin typing your search above and press return to search.

తుమ్మల ఆరు నూరైనా అక్కడి నుంచే పోటీ!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సీటు లభించని సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 Aug 2023 8:07 AM GMT
తుమ్మల ఆరు నూరైనా అక్కడి నుంచే పోటీ!
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సీటు లభించని సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు తెలంగాణలో కమ్మ సామాజికవర్గాన్ని ప్రభావితం చేయగల తుమ్మలకు సీటు ఇవ్వకపోవడంతో ఆయన ఇటీవల తన అనుచరులు, శ్రేయోభిలాషులతో సమావేశం నిర్వహించారు. దీనికి వేలాది మంది హాజరయ్యారు.

తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తుమ్మల ప్రకటించడం సంచలనంగా మారింది. గతంలో తుమ్మల ప్రాతినిధ్యం వహించిన ఖమ్మం, పాలేరు రెండు నియోజకవర్గాలకు బీఆర్‌ఎస్‌ పువ్వాడ అజయ్, కందాల ఉపేందర్‌ రెడ్డిలను అభ్యర్థులను ప్రకటించింది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 6న తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరతారని టాక్‌ నడుస్తోంది. అయితే తుమ్మల ఆశించినట్టు పాలేరు నుంచి కాకుండా కమ్మ సామాజికవర్గం ఎక్కువ ఉన్న హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌ పల్లి నుంచి పోటీ చేయించాలనే ఉద్దేశంలో కాంగ్రెస్‌ ఉన్నట్టు సమాచారం.

కూకట్‌ పల్లిలో ఆంధ్రా ప్రజలు ఎక్కువ. అందులోనూ గుంటూరు, కృష్ణా జిల్లాలే వారే అధికం. తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆంధ్రాకు చెందిన వ్యక్తే. చాలా ఏళ్ల క్రితమే ఖమ్మం జిల్లాకు వలస వెళ్లారు. ఈ నేపథ్యంలో కూకట్‌ పల్లి నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు, శ్రేయోభిలాషులతోపాటు ఆయన కోరిక కూడా ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచే పోటీ చేయాలనే. తనను పక్కనపెట్టిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కు తన స్థాయి ఏమిటో చూపాలంటే పాలేరు నుంచి పోటీ చేయడమే బాగుంటుందని తుమ్మల భావిస్తున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆరు నూరైనా పాలేరు నుంచి పోటీ చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారు. అలాగే ఆయన అనుచరులు, శ్రేయోభిలాషులు సైతం పాలేరు నుంచే పోటీ చేయాలని తుమ్మలకు సూచిస్తున్నారు. దీంతో పాలేరు సీటు ఇస్తామంటేనే కాంగ్రెస్‌ లో చేరడానికి సిద్ధమని ఆయన షరతు పెట్టనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేసే పక్షంలో ఆమె సైతం పాలేరు సీటును కోరుతున్నారని అంటున్నారు. అయితే షర్మిల సేవలను ఏపీలో వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావుకు పాలేరు నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్‌ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండనట్టే.

గతంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందారు. 2009లో టీడీపీ తరఫున ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌ కుమార్‌ చేతిలో ఓడిపోయారు. 2016లో టీఆర్‌ఎస్‌ లో చేరి పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలో తుమ్మల విజయం సాధించారు. మళ్లీ 2018 ఎన్నికల్లో పాలేరు నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున ఓడిపోయారు.

గతంలో టీడీపీ ప్రభుత్వాల హయాంలో తుమ్మల నాగేశ్వరరావు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా, రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా 2015లో కేసీఆర్‌ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కాకుండానే తుమ్మలను రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా తన కేబినెట్‌ లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు.

కాగా 2018 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి తుమ్మలకు ఎలాంటి పదవులు లభించలేదు. బీఆర్‌ఎస్‌ లో ఆయనను పట్టించుకునేవారే కరువయ్యారు. ఇటీవల కేసీఆర్‌ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులోనూ తుమ్మల పేరు లేదు.

ఇప్పటికే తుమ్మల చేరికకు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు రేణుకా చౌదరి, భట్టి విక్రమార్క వంటి మద్దతు తెలుపుతున్నారు. ఆయన పార్టీలో చేరతామంటే స్వాగతిస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాలేరు నుంచి తుమ్మల పోటీకి సిద్ధంగా ఉన్నారు.