Begin typing your search above and press return to search.

కూకట్ పల్లి బరిలో తుమ్మల?

అయితే, తాజాగా కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల బరిలోకి దిగుతారని సరికొత్త ప్రచారానికి కాంగ్రెస్ నేతలు తెర లేపారు.

By:  Tupaki Desk   |   30 Aug 2023 4:24 PM GMT
కూకట్ పల్లి బరిలో తుమ్మల?
X

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొద్ది రోజులుగా సందిగ్ధంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి గులాబీ బాస్ కెసిఆర్ తుమ్మలకు టికెట్ ఇవ్వకపోవడంతో తన రాజకీయ భవిష్యత్తుపై తుమ్మల డైలమాలో పడ్డారు. దీంతో, తన అనుచరులు, కార్యకర్తలతో బల ప్రదర్శన చేసి తన బలం ఇది అని నిరూపించుకున్నారు. ఇక, బీఆర్ఎస్ కు త్వరలో గుడ్ బై చెప్పబోతున్న తుమ్మల...ఏ పార్టీలో చేరాలి, భవిష్యత్ కార్యచరణ ఏంటి అన్న విషయంపై తన అనుచరులతో చర్చలు జరుపుతున్నారు.

ఇక, తుమ్మల కాంగ్రెస్ లోకి రావాలనుకుంటే తలుపులు తెరిచే ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆల్రెడీ ఆహ్వానం పంపారు. ఈ క్రమంలోనే తుమ్మల కాంగ్రెస్ లో చేరడం దాదాపుగా ఖాయం అయిందని పుకార్లు వస్తున్నాయి. అయితే, ఏ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయాలి అన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్ లో తుమ్మల చేరబోయే తేదీ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది.

సెప్టెంబర్ 6వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుపోతున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఖర్గే అందుబాటులో లేకుంటే రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఖమ్మం లేదా పాలేరు నియోజకవర్గాలలో ఒకదాని నుంచి తుమ్మల పోటీ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది.

అయితే, తాజాగా కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల బరిలోకి దిగుతారని సరికొత్త ప్రచారానికి కాంగ్రెస్ నేతలు తెర లేపారు. అక్కడి నుంచి తుమ్మలను పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందట. అయితే, అక్కడి నుంచి పోటీ చేసేందుకు తుమ్మల అంత సుముఖంగా లేనట్టుగా తెలుస్తోంది. తనకు పట్టున్న పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తుమ్మల తేల్చి చెప్పారని తెలుస్తోంది.

దీంతో, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అన్న విషయంపై కాంగ్రెస్ నేతలకు, తుమ్మలకు మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు, తుమ్మల అనుచరులు కూడా తమ నేత పాలేరు నుంచి పోటీ చేస్తారని కరాకండిగా చెప్పేస్తున్నారు. మరి, కూకట్ పల్లి నుంచి తుమ్మల పోటీ చేయని పక్షంలో ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.