Begin typing your search above and press return to search.

20 ఏళ్ల బంధం తెగింది.. తుగ్లక్ రోడ్ ఇంటిని ఖాళీ చేయనున్న కేసీఆర్

ఇంతకూ తుగ్లక్ రోడ్ లోని ఇంటితో కేసీఆర్ కు ఉన్న అనుబంధం ఏపాటిదన్న విషయంలోకి వెళితే బోలెడన్ని అంశాలు కనిపిస్తాయి

By:  Tupaki Desk   |   5 Dec 2023 4:28 AM GMT
20 ఏళ్ల బంధం తెగింది.. తుగ్లక్ రోడ్ ఇంటిని ఖాళీ చేయనున్న కేసీఆర్
X

ఓటమి అనే మూడు అక్షరాలు మిగిల్చే వేదన అంతా ఇంతా కాదన్నట్లుగా ఉంటుంది. సుదీర్ఘకాలం తిరిగులేని అధిక్యతను ప్రదర్శించే వేళలో వచ్చే బంధాల్ని.. ఓటమితో వదిలిపెట్టాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితే తాజాగా గులాబీ బాస్ ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రిగా పదేళ్లు తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన ఆయన.. తాజా ఎన్నికల్లో కాగ్రెస్ విజయం సాధించటంతో.. ముచ్చటపడి కట్టించుకున్న ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలో 20 ఏళ్లుగా అనుబంధం ఉన్న తుగ్లక్ రోడ్ లోని ఇంటిని సైతం విడిచి పెట్టేయాల్సిన పరిస్థితి వచ్చేసింది.

ఇంతకూ తుగ్లక్ రోడ్ లోని ఇంటితో కేసీఆర్ కు ఉన్న అనుబంధం ఏపాటిదన్న విషయంలోకి వెళితే బోలెడన్ని అంశాలు కనిపిస్తాయి. తాజాగా ఎదురైన ఓటమితో ఆయనకున్న అనుబంధం తెగింది. 2004లో టీఆర్ఎస్ నుంచి కరీంనగర్ ఎంపీగా గెలుపొందటం.. అప్పటి మన్మోహన్ సింగ్ సర్కారులో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టటం తెలిసిందే. కేంద్ర మంత్రి హోదాలో ఆయనకు తుగ్లక్ రోడ్ లోని టైప్ 8 క్వార్టర్ ను కేటాయించారు.

2006లో ఆయన కేంద్ర మంత్రి పదవికి.. ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో ఆయన నెగ్గటంతో మళ్లీ అదే నివాసాన్ని కంటిన్యూ చేవారు. 2009లో జరిగిన ఎన్నికల్లోనూ ఎంపీగా గెలిచిన ఆయనకు అదే క్వార్టర్ ను కేటాయించారు. అప్పుడు మన్మోహన్ సర్కారు 2.0 నడుస్తోంది. 2014 ఎన్నికల్లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం తెలిసిందే. సీఎంలకు కేంద్రం దేశ రాజధానిలో క్వార్టర్లను కేటాయిస్తుంది. ఈ క్రమంలో తుగ్లక్ రోడ్ లోని నివాసాన్ని అలానే ఉంచేశారు. ఆ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా కవిత గెలిచారు. అయినప్పటికీ ఆమె తన తండ్రికి కేటాయించిన క్వార్టర్ లోనే ఉండిపోయారు. తన అధికార నివాసంగా ఎంపిక చేసుకున్నారు.

2018లో జరిగిన ఎన్నికల్లో రెండో సారి ముఖ్యమంత్రిగా ఎంపిక కావటంతో ఆ క్వార్టర్ అలానే ఉండిపోయింది. తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో ఢిల్లీలోని తుగ్లక్ క్వార్టర్ ను ఖాళీ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రీతిలో మొత్తంగా 20 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం అనంతరం ఆ క్వార్టర్ ను ఖాళీ చేయాల్సిన టైం ఆసన్నమైంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన సదరు క్వార్టర్.. తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం వచ్చిన వేళలోనే.. చేజారిపోవటం గమనార్హం. ఎన్నికల ఫలితాల వెల్లడి వేళ.. తమకు రెండు మూడు రోజులు టైం ఇస్తే.. ఖాళీ చేసి వెళ్లిపోతామని అధికారులకు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు సమాచారం అందించాయి.