Begin typing your search above and press return to search.

భక్తుల భద్రత కోసం టీటీడీ కీలక నిర్ణయాలు!

తిరుపతి పద్మావతి అతిథి గృహంలో నిర్వహించిన హై లెవెల్ కమిటీ సమావేశం అనంతరం స్పందించిన టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

By:  Tupaki Desk   |   14 Aug 2023 2:45 PM GMT
భక్తుల భద్రత కోసం టీటీడీ కీలక నిర్ణయాలు!
X

నడకదారిలో వెంకన్న సన్నిదికి వెళ్లే భక్తులపై వరుసగా జరుగుతోన్న అడవి జంతువుల దాడుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయాలు తీసుకొంది. ఇందులో భాగంగా... చిరుత సంచారం, దాడులు జరుగుతున్న కారణంగా నడక మార్గంలో వెళ్ళే ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

తిరుపతి పద్మావతి అతిథి గృహంలో నిర్వహించిన హై లెవెల్ కమిటీ సమావేశం అనంతరం స్పందించిన టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే 12 ఏళ్లలోపు చిన్నారులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

ఇదే క్రమంలో నడక మార్గంలో వెళ్లే ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇస్తామని.. అలిపిరి నుంచి ఘాట్ రోడ్డులో వెళ్ళే ద్విచక్ర వాహనదారులకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 వరకూ మాత్రమే అనుమతిస్తామని భూమన తెలిపారు. ఇదే సమయంలో భక్తుల భద్రత దృష్ట్యా ఎంత మందినైనా అటవీ శాఖా సిబ్బందిని‌ నియమించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

ఈ సమయంలో భక్తులకు మరికొన్ని సూచనలు చేశారు భూమన. వాటిలో ప్రధానంగా నడక మార్గం, ఘాట్ రోడ్డులో జంతువులకు తినుబండారాలు ఇవ్వకూడదని తెలిపారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా... నడక మార్గంలో‌ ఉన్న హోటల్స్ ద్వారా వచ్చే వ్యర్ధాలు వేయకూడదని తెలిపారు.

అనంతరం... దాదాపు ఐదు వందల ట్రాప్ కెమెరాలను ఉపయోగిస్తున్నట్లు తెలిపిన ఆయన... అవసరం అయితే డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తామని అన్నారు. అయితే నడక దారిలో ఫోకస్ లైట్స్ ను ఏర్పాటు చేయాలని, ఫెన్సింగ్ ఏర్పాటుపై అటవీ శాఖా అధికారుల నుంచి సలహా అడిగామని తెలిపారు.

భక్తుల ప్రాణరక్షణే ప్రథమ ధ్యేయంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని చైర్మన్ భూమన చెప్పారు. ఇదే సమయంలో వన్యమృగాల సంచారం తగ్గుముఖం‌ పట్టే వరకూ ఇదే నిబంధనలు అమలు చేస్తామని అన్నారు. వన్యప్రాణుల అధ్యయనం కోసం అటవీ శాఖా అధికారులకు టీటీడీ అన్ని విధాలుగా సహకరిస్తామని టీటీడీ నూతన ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు!

కాగా... నెలన్నర కిందట నడక‌ దారిలో కౌశిక్ అనే బాలుడిపైనా, తాజాగా లక్షిత అనే ఆరేళ్ల బలికపైనా చిరుత దాడి చేసిన సంగతి తెలిసిందే.