Begin typing your search above and press return to search.

శ్రీవెంకటేశ్వరస్వామికి ద్రోహం.. టీటీడీ ఏం చేసిందంటే..?

చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో బాధ్యతలు చేపట్టిన టీటీడీ పాలకమండలి 2024 నవంబర్ 18న టీటీడీలో అన్యమత ఉద్యోగులను కొనసాగించకూడదని కీలక తీర్మానం చేసింది.

By:  Tupaki Desk   |   19 July 2025 1:17 PM IST
శ్రీవెంకటేశ్వరస్వామికి ద్రోహం.. టీటీడీ ఏం చేసిందంటే..?
X

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పనిచేస్తున్న నలుగురు అన్య మతస్తులపై వేటు పడింది. హిందూ ధార్మిక సంస్థలో పనిచేస్తూ ఇతర మతాన్ని ఆచరించడంపై అభ్యంతరాలు రావడంతో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. టీటీడీలో గత కొంత కాలంగా అన్య మతస్తులు పనిచేయడంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇతర మతస్తులపై కఠినంగా వ్యవహరించాలని టీటీడీ గతంలోనే నిర్ణయించింది. తాజాగా నలుగురు ఉద్యోగులపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి సస్పెండ్ చేసింది.

టీటీడీ నుంచి సస్పెండ్ అయిన వారిలో క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఇంజనీర్ బి.ఎలిజర్, బర్డ్ ఆస్పత్రి స్టాఫ్ నర్సు ఎస్.రోసి, గ్రేడ్-1 ఫార్మాసిస్ట్ ఎం.ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న జి.అసుంతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరు క్రైస్తవాన్ని ఆచరిస్తున్నట్లు విచారణలో తేలడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో బాధ్యతలు చేపట్టిన టీటీడీ పాలకమండలి 2024 నవంబర్ 18న టీటీడీలో అన్యమత ఉద్యోగులను కొనసాగించకూడదని కీలక తీర్మానం చేసింది. అన్య మతాలను ఆచరించేవారు ఎవరైనా ఉంటే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలని, లేదంటే ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేసుకోవాలని సూచించింది. అయినప్పటికీ కొందరు ఉద్యోగులు టీటీడీలోనే కొనసాగుతుండటంపై ఫిర్యాదులు వస్తున్నాయి.

ఇటీవల పుత్తూరుకు చెందిన రాజశేఖర్ బాబు అనే ఏఈఓ ప్రతి ఆదివారం స్థానిక చర్చిలో ప్రార్థనలకు హాజరవుతున్నారని, ఇది టీటీడీ నిబంధనలకు విరుద్ధమని ఒక భక్తుడు ఫిర్యాదు చేయడంతో టీటీడీ విజిలెన్స్ విచారణ జరిపి ఆయనను సస్పెండ్ చేసింది. ఇది జరిగిన నాలుగు రోజులకే తాజాగా నలుగురిని సస్పెండ్ చేయడంపై కలకలం చెలరేగింది. ఈ సంఘటనలే కాకుండా గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలు చాలా వెలుగు చేశాయని చెబుతున్నారు. పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ అసుంతను గత ఏప్రిల్ లో అన్య మత ఆచారాల ఆరోపణలపై బదిలీ చేశారు. అదేవిధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా 18 మంది టీటీడీ ఉద్యోగులు హిందూ మతేతర సంప్రదాయాలను అనుసరిస్తున్నారని చర్యలు తీసుకున్నారు.

ఈ ఉదంతాలు టీటీడీలో అన్యమత ఉద్యోగుల ఉనికి, వారి మతపరమైన ఆచారాలు టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే ఆందోళనలను పెంచుతున్నాయని చెబుతున్నారు. టీటీడీ ఉద్యోగులు హిందూ ధార్మిక సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహించాలని, భక్తుల విశ్వాసాన్ని కాపాడాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.