Begin typing your search above and press return to search.

టీటీడీ అలర్ట్.. శ్రీవారి దర్శనాలపై కీలక నిర్ణయం

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శుభవార్త చెప్పారు.

By:  Tupaki Desk   |   30 July 2025 3:13 PM IST
టీటీడీ అలర్ట్.. శ్రీవారి దర్శనాలపై కీలక నిర్ణయం
X

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శుభవార్త చెప్పారు. శ్రీవారి దర్శనం కోసం జారీ చేసే శ్రీవాణి టికెట్ల కోటాను అదనంగా పెంచారు. దర్శనాలకు డిమాండ్ పెరుగుతుండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా దర్శన సమయాలతోపాటు భక్తులకు గదులు కేటాయింపుపైనా టీటీడీ పలు సూచనలు చేసింది. భక్తుల సూచనల మేరకు శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను పెంచుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

తిరుమలలో శ్రీవారి దర్శనానికి అనేక సదుపాయాలు ఉన్నాయి. ఇందులో శ్రీవాణి టికెట్ దర్శనం ఒకటి. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలంటే భక్తులు రూ. 10 వేలు శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళంగా సమర్పించాలి. దీనితోపాటు, బ్రేక్ దర్శనం టికెట్ కోసం అదనంగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, మొత్తం టికెట్ ధర రూ. 10,500 చెల్లించి శ్రీవారిని దర్శించుకోవచ్చు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ప్రస్తుతం వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుంది. సాధారణంగా ఈ దర్శనం ఉదయం సమయంలో నిర్వహిస్తారు. కానీ తాజాగా సాయంత్రం కూడా భక్తులను దర్శనానికి అనుమతించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. భక్తుల వసతి గదులపై ఒత్తిడి తగ్గించడానికి, శ్రీవాణి దర్శన సమయాన్ని సాయంత్రాని మార్చినట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం శ్రీవాణి ట్రస్టు ద్వారా రోజుకు 15 వందల టికెట్లను విక్రయిస్తున్నారు. అయితే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ కోటాను రెండు వేలుకు పెంచాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోజూ కరెంటు బుకింగు కోటా కింద తిరుమలలో 2 వేల టికెట్లను ఇప్పటి నుంచి కేటాయిస్తారు. అదేవిధంగా రేణిగుంట విమానాశ్రయంలో మరో 400 శ్రీవాణి కోటా టికెట్లు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా శ్రీవాణి టికెట్ల జారీ సమయంలో కూడా మార్పులు చేసింది టీటీడీ. ఇకపై టికెట్ పొందిన నాటి సాయంత్రమే భక్తుడు వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లేలా టీటీడీ మార్పులు చేసింది.