Begin typing your search above and press return to search.

టీటీడీ కి భారీగా విరాళాలు.. నిబంధనల మార్పుతో క్యూకట్టిన భక్తులు

తిరుమల శ్రీవారి ఆలయంలో సామాన్య భక్తులకు మరింత ఎక్కువ దర్శన సమయాన్ని కేటాయించే లక్ష్యంతో టీటీడీ దాతల సదుపాయాల విధానంలో సమూల మార్పులు చేపట్టింది.

By:  Tupaki Political Desk   |   15 July 2026 4:00 PM IST
టీటీడీ కి భారీగా విరాళాలు.. నిబంధనల మార్పుతో క్యూకట్టిన భక్తులు
X

తిరుమల శ్రీవారి ఆలయంలో సామాన్య భక్తులకు మరింత ఎక్కువ దర్శన సమయాన్ని కేటాయించే లక్ష్యంతో టీటీడీ దాతల సదుపాయాల విధానంలో సమూల మార్పులు చేపట్టింది. ఈ కొత్త నిబంధనలు జులై 14 అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చాయి. మంగళవారం సమావేశమైన టీటీడీ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాతలకు కొత్త దర్శన సమయాలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని టీటీడీ పాలకవర్గం ప్రకటించింది. దీంతో దాతలు మంగళవారం పోటెత్తారు. పాత నిబంధనల ప్రకారం ప్రయోజనాలు పొందేందుకు భారీగా విరాళాలు చెల్లించారు. ఈ క్రమంలో, టీటీడీకి ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.96.97 కోట్ల విరాళాలు అందాయని అధికారులు వెల్లడించారు.

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం, విరాళాల నిర్వహణలో పారదర్శకతతో పాటు ఏకరీతిని తీసుకురావడానికి నూతన పాలసీని రూపొందించారు. ఇప్పటివరకు ఏడాదికి మూడు సార్లు లభించే బ్రేక్ దర్శన సౌకర్యాన్ని ఇకపై ఒకసారికి పరిమితం చేయడంతో, నిబంధనలు మారకముందే విరాళాలు అందించేందుకు దాతలు క్యూ కట్టారు. ఒక్క రోజులోనే ఆన్‌లైన్ ద్వారా 2,354 మంది దాతలు రూ.87.34 కోట్లు చెల్లించారు. ఇదే సమయంలో ఆఫ్‌లైన్ లో 106 మంది దాతలు రూ.9.63 కోట్ల చొప్పున విరాళాలు సమర్పించారు. అయితే, ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే విరాళాలు అందించిన దాతలకు పాత సదుపాయాలే కొనసాగుతాయని టీటీడీ స్పష్టం చేసింది.

నూతన విధానం ప్రకారం, వ్యక్తిగత దాతలకు వారు ఇచ్చే విరాళాన్ని బట్టి ప్రత్యేక ప్రవేశ దర్శనం, సుపథం, వీఐపీ బ్రేక్ దర్శనాలలో మార్పులు చేశారు. ఉదాహరణకు, రూ. లక్ష విరాళం ఇచ్చేవారికి ఏడాదికి ఒకసారి ప్రత్యేక ప్రవేశ దర్శనం లభిస్తుండగా, రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చేవారికి ఒకసారి సుపథం, ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. విరాళం మొత్తం రూ. కోటికి చేరుకుంటే, దాతలకు ఏడాదికి నాలుగుసార్లు సుపథం, మూడుసార్లు వీఐపీ బ్రేక్ దర్శనంతో పాటు ఒకసారి సుప్రభాత సేవ, మూడుసార్లు కల్యాణోత్సవాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

కంపెనీలు, ట్రస్టులు, ఫర్మ్‌ల విభాగంలో కూడా ఇదే విధమైన క్రమబద్ధీకరణ జరిగింది. రూ. 2 కోట్లు అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చే సంస్థలకు ఏటా నాలుగు సార్లు సుపథం, ఐదుసార్లు వీఐపీ బ్రేక్, నాలుగుసార్లు సుప్రభాత సేవ, ఐదు కల్యాణోత్సవాలకు హాజరయ్యే అవకాశం కల్పించారు. ఈ విధానం వల్ల భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడమే కాకుండా, శ్రీవారి సేవల్లో పారదర్శకత పెరుగుతుందని టీటీడీ భావిస్తోంది.

దాతల విధానంతో పాటు, టీటీడీ బోర్డు సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఏడాదికి శ్రీవారి డైరీలు 10 లక్షలు, 12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, 6 పేజీల క్యాలెండర్లు 75 వేల ముద్రణకు బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే, ఎస్వీ మ్యూజియం సందర్శకుల్లో 12 ఏళ్లు పైబడిన వారికి రూ. 50 ప్రవేశ రుసుం విధించడంతో పాటు, మ్యూజియం నిర్వహణ బాధ్యతలను టాటా సంస్థకు అప్పగించే అంశంపై కూడా టీటీడీ దృష్టి సారించింది.