Begin typing your search above and press return to search.

మాజీ సీఎస్ ఎల్వీకి ఘాటు రిప్లై.. ఈ సమాధానం ఊహించి ఉండరేమో..

తిరుమలలో శ్రీవారి దర్శన సమయాన్ని రెండు గంటల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో టీటీడీ తీసుకువస్తున్న ఏఐ టెక్నాలజీపై వివాదం నెలకుంటుందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.

By:  Tupaki Desk   |   3 Aug 2025 11:25 PM IST
మాజీ సీఎస్ ఎల్వీకి ఘాటు రిప్లై.. ఈ సమాధానం ఊహించి ఉండరేమో..
X

తిరుమలలో శ్రీవారి దర్శన సమయాన్ని రెండు గంటల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో టీటీడీ తీసుకువస్తున్న ఏఐ టెక్నాలజీపై వివాదం నెలకుంటుందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. తిరుమలలో ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్సులో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ రోజుల్లోనే ఆరేడు గంటల సమయం పడుతుండగా, పండగలు, పర్వదినాల్లో ఈ సమయం 18 నుంచి 24 గంటల వరకు ఉంటుంది. దీంతో చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలోని పాలక మండలి ఏఐ టెక్నాలజీని వాడుకుని దర్శన సమయాన్ని రెండు గంటలకు కుదించాలని భావించింది. ఈ మేరకు టెక్ దిగ్గజాలు అయిన గూగుల్, టీసీఎస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు దిగ్గజ సంస్థలు కూడా ఉచితంగానే సేవలు అందించేందుకు ముందుకు వచ్చాయి.

అయితే ఇంతవరకు ఎవరూ టీటీడీ ప్రయత్నాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. టీటీడీ ఆలోచన కార్యరూపం దాల్చితే భక్తులకు ఇబ్బందులు తొలగిపోతాయని భావించారు. అంతా సవ్యంగా జరుగుతున్నదని టీటీడీ కూడా ఆధునిక సాంకేతిక కోసం వేగంగా అడుగులు వేస్తుండగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం టీటీడీ విధానాన్ని తప్పుబట్టడం చర్చకు దారితీసింది. ఎల్వీ సుబ్రహ్మణ్యం గతంలో టీటీడీ ఈవోగా పనిచేశారు. దీంతో ఆయన అనుభవంతో కొన్ని సూచనలు చేశారు. మూడు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించాలనే టీటీడీ ప్రయత్నాలు వృథా అన్నట్లు ఎల్వీ సుబ్రహ్మణ్యం తేల్చేశారు. ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న ఆయన క్యూలైన్ లో భక్తుల అభిప్రాయాల మేరకు తాను ఇలా చెబుతున్నట్లు వ్యాఖ్యానించారు.

‘‘నేను వచ్చే దారిలో భక్తుల సంభాషణ విన్నాను. తిరుమల శ్రీవారి దర్శనం గంట, మూడు గంటల్లో చేయిస్తామనే ఆలోచన విధానం గురించి వారు చర్చించారు. శ్రీవారి భక్తులకు 3 గంటల్లో దర్శనం చేయిస్తామనడం అసంభవం. అలా ప్రయత్నం చేయడం క్షేమకరం కాదు. ఏఏఐని మానవుడు తన శక్తితో ఎంత గ్రహించినా ఆలయంలో పరిమితులు ఉన్నాయి. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టాలి’’ అని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు.

అయతే మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఫైర్ అయ్యారు. ఏఐ టెక్నాలజీ ద్వారా శ్రీవారి దర్శన సమయాన్ని తగ్గించి సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఏఐ టెక్నాలజీ వాడొద్దని సుబ్రహ్మణ్యం చెప్పడం సబబు కాదన్నారు. శ్రీవారి భక్తుల ఇబ్బందులను గమనించే ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం భక్తుల్లో గందరగోళం సృష్టించేలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని బీఆర్ నాయుడు మండిపడ్డారు. దాతల సహాయంతో ఉచితంగా చేస్తున్న పనిని కూడా తప్పుబట్టడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చైర్మన్ నాయుడు స్పష్టం చేశారు.