3 గంటల్లో శ్రీవారి దర్శనం.. మాజీ సీఎస్ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు
తిరుమల శ్రీవారి దర్శన సమయాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలనే టీటీడీ ప్రయత్నాలను ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తప్పుబట్టారు.
By: Tupaki Desk | 3 Aug 2025 1:25 PM ISTతిరుమల శ్రీవారి దర్శన సమయాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలనే టీటీడీ ప్రయత్నాలను ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తప్పుబట్టారు. ఆధునిక సాంకేతిక వాడుకుని క్యూలైన్ లోకి వెళ్లి గంటలోగా దర్శనం ముగించేలా టీటీడీ ప్రయత్నిస్తోంది. చైర్మన్ బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. ఏఐ ద్వారా ఫేసియల్ రికగ్నేషన్ ద్వారా దర్శనాల సమయాన్ని తగ్గించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి ఆరేడు గంటల సమయం పడుతోంది. దీన్ని ముందుగా మూడు గంటలకు కుదించి ఆ తర్వాత గంట కాలానికి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే టీటీడీ ప్రయత్నాలపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు నీళ్లు జల్లినట్లైందని అంటున్నారు.
ఆదివారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మాజీ సిఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మూడు గంటల్లో శ్రీవారి దర్శనం చేయించడం అసాధ్యమని తేల్చిచెప్పారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా శ్రీవారి దర్శనాన్ని ఒక గంటలో చేయిస్తామన్న విధానాన్ని విరమించుకోవాలని మాజీ సీఎస్ సూచించారు.
‘‘నేను వచ్చే దారిలో భక్తుల సంభాషణ విన్నాను. తిరుమల శ్రీవారి దర్శనం గంట, మూడు గంటల్లో చేయిస్తామనే ఆలోచన విధానం గురించి వారు చర్చించారు. శ్రీవారి భక్తులకు 3 గంటల్లో దర్శనం చేయిస్తామనడం అసంభవం. అలా ప్రయత్నం చేయడం క్షేమకరం కాదు. ఏఏఐని మానవుడు తన శక్తితో ఎంత గ్రహించినా ఆలయంలో పరిమితులు ఉన్నాయి. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టాలి’’ అని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు.
