Begin typing your search above and press return to search.

నేటి నుంచి టీజీ.. స్పెషల్ నంబర్ల లొల్లేంటి?

తమదైన మార్కును చూపించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వడివడి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   15 March 2024 4:31 AM GMT
నేటి నుంచి టీజీ.. స్పెషల్ నంబర్ల లొల్లేంటి?
X

తమదైన మార్కును చూపించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వడివడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. అందులో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం వేళ.. తెలంగాణ ఏర్పడితే తెలంగాణ వాహనాల్ని టీజీ పేరుతో రిజిస్ట్రేషన్లు చేయాలంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఆ మాటకు వస్తే విభజన జరిగి.. కేసీఆర్ సర్కారు కొలువు తీరిన వేళలోనూ వాహనాలకు టీజీ అని ఫైనల్ చేయాల్సి ఉండగా.. చివర్లో చోటు చేసుకున్న మార్పులతో టీఎస్ గా మారింది. దీని వెనుక కేసీఆర్ ప్రత్యేక ఆసక్తితోనే ఇలా జరిగినట్లుగా చెబుతున్నారు.

విభజన తర్వాత పదేళ్లకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రేవంత్ నాయకత్వంలో వడి వడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణలోని వాహనాలకు కేటాయించే నెంబర్లలో రాష్ట్రాన్ని గుర్తించేందుకు వీలుగా ఉన్న టీఎస్ స్థానే టీజీతో మొదలు కావాలన్న అంశంపై కేబినెట్ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపటం.. అక్కడి నుంచి సానుకూల పరిస్థితులు ఎదురైన వేళలో.. ఈ రోజు (శుక్రవారం) నుంచి తెలంగాణ వాహనాలను టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయటం షురూ కానుంది.

రవాణా శాఖ అధికారుల సమాచారం ప్రకారం.. కొత్త కోడ్ (టీజీ)తో వాహన రిజిస్ట్రేషన్లు మొదలు కానున్నట్లుగా పేర్కొన్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే సిరీస్ లు మొత్తం 0001తో మొదలు కానున్నాయి. సగటున రాష్ట్రంలో రోజుకు 4వేల వరకు వాహనాలు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. రాష్ట్ర వాహన కోడ్ ను టీఎస్ నుంచి టీజీగా మార్చిన అంశంలో ఇప్పుడో సిత్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జారీ చేసిన నంబర్లను అలా ఉంచేయనున్నారు. పాత వాహనాల నెంబర్లను అలా ఉంచేసి.. కొత్త నంబర్లు జారీ చేస్తారు. దీని వరకు ఓకే కానీ.. ఇంతకు ముందు స్పెషల్ నెంబర్లను వేలానికి ఉంచి వాటిని కన్ఫర్మ్ చేశారు.

మరి.. అలాంటి స్పెషల్ నంబర్ల విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏ రోజుకుఆ రోజుకు ఒక రోజు ముందుగా వెయ్యి నెంబర్లను జారీ చేసి.. అందులోని స్పెషల్ నంబర్లకు ఒక్కో ధరను డిసైడ్ చేసి.. వాటిని వాహనదారులకు కేటాయిస్తుంటారు. అదే రీతిలో గురువారం సైతం స్పెషల్ నంబర్లనుజారీ చేశారు. వాటిలో పలు నంబర్లను ఎంపిక చేసుకోవటం జరిగింది. మరి.. వారికి పాత నంబర్లను కేటాయిస్తారా? లేదంటే కొత్త సీరిస్ లో ఆ నంబర్లను కేటాయిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. దీనిపై ఈ రోజు (శుక్రవారం) నిర్ణయాన్ని తీసుకుంటామని చెబుతున్నారు.