Begin typing your search above and press return to search.

మహాలక్ష్మీ పథకం ఎఫెక్ట్... సరికొత్త నిర్ణయం దిశగా టీఎస్ ఆర్టీసీ!

దీంతో ఆర్టీసీ బస్సుల్లో పురుషులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏ స్థాయిలో ఉన్నాయనేది స్పష్టం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   27 Dec 2023 10:39 AM GMT
మహాలక్ష్మీ పథకం ఎఫెక్ట్...  సరికొత్త నిర్ణయం దిశగా టీఎస్  ఆర్టీసీ!
X

మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో సరికొత్త సమస్యలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలవుతున్న రెండు రాష్ట్రాల్లోనూ ఈ సమస్య ఉండగా.. ప్రస్తుతం తెలంగాణలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ కి ప్రత్యామ్నాయలు వెతికే పనిలో టీఎస్ ఆర్టీసీ ఉందని తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఆర్టీసీ బస్సుల్లో గణనీయంగా పెరుగుతున్న ఓఆర్ అని అంటున్నారు అధికారులు!

అవును... మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగింది. ఇందులో భాగంగా కొన్ని రూట్లలోని బస్సుల్లో ముందునుంచి వెనుక వరుస సీట్ల వరకు మహిళలే కనిపిస్తున్నారు. దీంతో సీటు దొరకలేదని పురుషులు దిగి వెళ్లిపోతున్నట్లు తెలుస్తుంది! దీంతో అవసరమైన రూట్లు, ముఖ్యమైన సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై టీఎస్ ఆర్టీసీ యోచిస్తోందని తెలుస్తుంది.

మహాలక్ష్మీ పథకం రాకముందు ఆర్టీసీ బస్సుల్లో నిత్యం మహిళా ప్రయాణికులు 12-14 లక్షలు ఉండగా... ఇప్పుడు ఆ సంఖ్య 29 లక్షలు దాటుతున్నట్లు తెలుస్తుంది. అంటే... రెట్టింపు కంటే ఎక్కువ అన్నమాట. దీంతో ఆర్టీసీ బస్సుల్లో పురుషులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏ స్థాయిలో ఉన్నాయనేది స్పష్టం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే సమయంలో ఆర్టీసీ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తిని తెలిపే ఓఆర్‌ (ఆక్యుపెన్సీ రేషియో) గతంలో 69 శాతం ఉండగా... ఇప్పుడు సుమారు 89 శాతం నమోదవుతోందని ఘణాంకాలు చెబుతున్నాయి! దీంతో... నిలబడి వెళ్లేందుకు సైతం స్థలం లేక బస్సు ఎక్కలేక విద్యార్థులు ఇబ్బందిపడ్డ ఘటనలూ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చాయని తెలుస్తుంది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారని అంటున్నారు.

ఇందులో భాగంగా... వృద్ధులకు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపుపై కసరత్తు జరుగుతోందని.. ఇదే సమయంలో విద్యార్థుల కోసం కొన్ని మార్గాల్లో సర్వీసులు నడిపే విషయాన్ని ఉన్నతాధికారులు చర్చిస్తున్నారని.. ప్రధానంగా సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక సీట్లలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పరిశీలిస్తున్నారని తెలుస్తుంది.