Begin typing your search above and press return to search.

ఆర్టీసీ బస్సును చోరీ చేయటమే కాదు.. ప్రయాణికుల్ని ఎక్కించుకున్న దొంగ

అదెలా చేశాడంటే.. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన స్వామి తన బస్సును సిద్దిపేట - హైదరాబాద్ కు ఆర్టీసీలో అద్దెకు నడిపిస్తున్నాడు

By:  Tupaki Desk   |   12 Sep 2023 4:25 AM GMT
ఆర్టీసీ బస్సును చోరీ చేయటమే కాదు.. ప్రయాణికుల్ని ఎక్కించుకున్న దొంగ
X

రోటీన్ కు భిన్నంగా వ్యవహరించిన వెరైటీ దొంగ వ్యవహారం సంచలనంగా మారింది. సాధారణంగా దొంగలు ఏం చేస్తారు? తాము టార్గెట్ చేసిన వస్తువుల్ని చోరీ చేస్తారు. అనంతరం అక్కడి నుంచి జంప్ అవుతారు. అందరిలా చేస్తే.. ఈ దొంగ వ్యవహారం సింగిల్ కాలమ్ వార్త అయ్యేది. లేదంటే డబుల్ కాలమ్ వార్తగా ఉండేది. కానీ.. ఇతగాడి రూటు సపరేటు. ఆర్టీసీ బస్సును టార్గెట్ చేసిన ఇతడు.. అనుకున్నట్లే అంత బస్సును ఇట్టే దొంగలించేశాడు.

అదెలా చేశాడంటే.. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన స్వామి తన బస్సును సిద్దిపేట - హైదరాబాద్ కు ఆర్టీసీలో అద్దెకు నడిపిస్తున్నాడు. దాని డ్రైవర్ ఆదివారం రాత్రి సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిద్దిపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద పార్కింగ్ చేసి.. దానికి కీ వేయటం మర్చిపోయి వెళ్లిపోయారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన బందెల రాజు బస్సును దొంగలించాడు. దాన్ని తీసుకొని వేములవాడ వెళ్లాడు.

సోమవారం ఉదయం పలువురు ప్రయాణికుల్ని సిద్దిపేటకు తీసుకెళతనానని ఎక్కించుకున్నాడు. వారికి టికెట్ తర్వాత ఇస్తానని డబ్బులు తీసుకున్నారు. ఆర్టీసీ బస్సు కావటం.. ఈ మధ్యన కొన్ని బస్సుల్లో డ్రైవర్ కమ్ కండక్టర్ ఉండటంతో అతడి తీరును అనుమానించలేదు. బస్సు తంగళ్లపల్లి మండలం సారంపల్లి - నేరెళ్ల మార్గంలోకి వెళ్లేసరికి.. అందులోని డీజిల్ అయిపోయింది. దీంతో..డీజిల్ అయిపోయింది.. తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు.

ఎంతసేపటికి డ్రైవర్ తిరిగి రాకపోవటంతో తాము మోసపోయినట్లుగా ప్రయాణికులు గుర్తించి.. ఎవరికి వారు వారి గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు.. బస్సు రోడ్డు పక్కన ఉండటాన్ని గమనించి తమ కంట్రోలర్ కు ఫోన్ చేశారు. ఆయన యజవాని స్వామికి సమాచారం ఇవ్వటంతో ఆయన బస్సును స్వాధీనం చేసుకున్నారు. చోరీ ఉదంతంపై సిద్దిపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగ రాజును పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.