Begin typing your search above and press return to search.

తెలంగాణా ఎన్నికల ఫలితాలు ఏపీలో ప్రభావం చూపించలేవు... లాజిక్ ఇదే...!

తెలంగాణాలో ఎన్నికల ఫలితాలు ఏపీ మీద ఎంతమేరకు ప్రభావం చూపిస్తాయన్న దాని మీద ఇపుడు పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 2:45 AM GMT
తెలంగాణా ఎన్నికల ఫలితాలు ఏపీలో ప్రభావం చూపించలేవు... లాజిక్ ఇదే...!
X

తెలంగాణాలో ఎన్నికల ఫలితాలు ఏపీ మీద ఎంతమేరకు ప్రభావం చూపిస్తాయన్న దాని మీద ఇపుడు పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది. ఎందుకంటే పదేళ్ల క్రితం రెండూ ఉమ్మడి ఏపీలోనే ఉన్నాయి. అటూ ఇటూ కూడ ఓటర్ల భావోద్వేగాలు దాదాపుగా ఒక్కలాగానే ఉంటాయి. ఇక చూస్తే అక్కడా ఇక్కడా పార్టీలూ నాయకులు కూడా దాదాపుగా ఒక్కటే. టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ వామపక్షాలు తెలంగాణాలో ఉన్నాయి. ఏపీలోనూ ఉన్నాయి. బీఆర్ఎస్ గా మారాక ఏపీలో అడుగు పెట్టేందుకు కూడా కేసీయార్ మార్గం సుగమం చేసుకున్నారు.

మరి తెలంగాణాలో వచ్చిన ఫలితాలు ఏపీ మీద ప్రభావం చూపించి అక్కడ ఫలితాలను మార్చే సీన్ ఉంటుందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఎందుకంటే కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణా మీద చాలా గట్టిగానే పడింది. అంతవరకూ స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ ఒక్క సారిగా లేచి కూర్చుంది. ఆ ఊపు అక్కడితో ఆగలేదు. ఏకంగా అధికారంలోకి వచ్చే దాకా కొనసాగింది.

మరి కన్నడ రాష్ట్ర ఫలితమే తెలంగాణా మీద పడితే సాటి తెలుగు రాష్ట్రం ప్రభావం ఏపీ మీద ఎందుకు పడదు. ఇది ఒక కీలకమైన ప్రశ్న. బలంగా ఉన్న విపక్షం ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునే చాన్స్ ఉంది అని అంటున్నారు. కర్నాటకలో అధికార పార్టీ ఓడితే ప్రతిపక్ష కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణాలోనూ అలాగే జరిగింది. మరి ఏపీలో అధికార వైసీపీ ఓడి బలంగా ఉన్న టీడీపీ గెలుస్తుంది ఆ పార్టీ నేతలు అంచనా కడుతున్నారు.

మరి ఏపీలో టీడీపీకి పరిస్థితి అనుకూలంగా ఉంటుందా అంటే చాలా విషయాలు ఇక్కడ చూడాలని అంటున్నారు. ఏపీలో అధికారం కోసం పోటీ పడే పార్టీలు వైసీపీ టీడీపీ రెండూ ప్రాంతీయ పార్టీలే అని అంటున్నారు. ఇక తెలంగాణా ఎన్నికల్లో చూస్తే టీడీపీ పోటీ చేయనే లేదు. వైసీపీ అయితే ఉనికిలో లేదు. ఈ రెండు పార్టీలకు అక్కడ రాజకీయాలలో చూస్తే ఓట్లు లేవు. సీట్లూ లేవు అని అంటున్నారు.

కర్నాటకలో చూస్తే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా కధ మొత్తం నడచింది. అదే తెలంగాణాకు వచ్చేసరికి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా రాజకీయం సాగింది. కానీ ఏపీలో చూస్తే తెలంగాణాలో ప్రభావం చూపించిన పార్టీలు ఇక్కడ లేవు. ఇక్కడ ఉన్నవి వైసీపీ టీడీపీ మాత్రమే. ఈ రెండు పార్టీల మధ్యనే పోరు గట్టిగా ఉంటూ వస్తోంది.

ఇక కర్నాటకలో తొడగొట్టిన బీజేపీ తెలంగాణాలో మూడవ ప్లేస్ లో ఉంది. తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి ఏపీలో ఉనికి పెద్దగా లేదు. పైగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండింటికీ కలిపి కేవలం ఒక్క శాతం మాత్రమే ఓట్లు ఉన్నాయన్నది వాస్తవం అంటున్నారు. దాంతో తెలంగాణా రిజల్ట్ ఏపీలో ఎందుకు రిపీట్ అవుతుంది అన్నది లాజిక్ తో కూడిన ప్రశ్న. దీనికి అయితే ఎవరి వద్దా జవాబు మాత్రం లేదు.

ఎందుకంటే ఒక్కటే విషయం చెబుతున్నారు. అధికార పార్టీ మీద వ్యతిరేకతతో ఓడించి ప్రతిపక్ష పార్టీలకు పట్టం కడుతున్నారు. అలాంటపుడు 2018కి ఒక్కసారి వెళ్తే ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మరోసారి గెలిచింది. కానీ ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నాడు ఓడిపోయింది. ఆ విధంగా ఉల్టా సీదా అయింది. అంటే తెలంగాణా ఫలితాలు ఏపీలో రిఫ్లెక్ట్ కావు అన్నది అయిదేళ్ళ క్రితమే తేలిపోయింది.

ఏపీ రాజకీయం వేరుగా ఉంటుంది. ఇక్కడ జగన్ కావాలా చంద్రబాబు కావాలా అన్న దాని బట్టే ఓటింగ్ ఉంటుంది. ఈ ఇద్దరిలో ఎవరిని మెచ్చి జనాలు ఓటేస్తే వారిదే అధికారం అవుతుంది. ఇక తెలంగాణాలో బీఆర్ఎస్ ఓడింది అని అంటున్నారు. అయితే ఆ పార్టీకి రెండు దఫాలు చాన్స్ తెలంగాణా ప్రజలు ఇచ్చారు అని గుర్తు చేస్తున్నారు ఆ లెక్కన వైసీపీకి ఇది రెండవ చాన్స్ అవుతుంది అని అన్న వారూ ఉన్నారు.

మొత్తానికి ఏ విధంగానూ తెలంగాణా రాజకీయానికీ ఏపీ రాజకీయానికి పొంతన కుదరదు అని అంటున్నారు. జాతీయ పార్టీలు రెండూ ఏపీలో నామమాత్రంగా ఉంటాయి. అలాగే బీఆర్ఎస్ గురించి ఎవరికీ తెలియదు అని అంటున్నారు. ఇక్కడ మరో ప్రశ్న కూడా కొందరు ముందుకు తెస్తున్నారు.

ఉమ్మడి ఏపీని విడగొట్టి తెలంగాణా ఇచ్చినా కూడా పదేళ్లకు కానీ జనాలు కాంగ్రెస్ ని కరుణించలేదని, మరి ఏపీని అడ్డగోలుగా విభజనించిన కాంగ్రెస్ కి ఏపీలో ఎందుకు ఓట్లు పెరుగుతాయని కూడా ప్రశ్నిస్తున్నారు. అలా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా ఒరిగేది ఉండదని అంటున్న వారూ ఉన్నారు. సో తేల్చుకోవాల్సింది జగన్ చంద్రబాబే. అందుకే ఏపీ రిజల్ట్ పూర్తిగా డిఫరెంట్ గా వస్తుంది అని అంటున్నారు.