ఎస్ వోటీ ఏర్పాటు రాజకీయ నిఘా కోసమే.. ప్రభాకర్ రావు సంచలనం!
ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్న ఎస్ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును పోలీసులు విచారిస్తునన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 15 Jun 2025 11:17 AM ISTఫోన్ అక్రమ ట్యాపింగ్ ఉదంతంలో సరికొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్న ఎస్ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును పోలీసులు విచారిస్తునన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన్ను అడిగిన ప్రశ్నల్లో కీలక సమాచారం వెలుగు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీసుల్లో ప్త్యేక విభాగాన్ని ఎస్ వోటీగా పేర్కొనటం తెలిసిందే.
ఆ విభాగాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? అన్న ప్రశ్నకు దీన్ని రాజకీయ నిఘా కోసమేనన్న విషయాన్ని వెల్లడించినట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే కేసీఆర్ అండ్ కో కు కొత్త కష్టాలు ఖాయమన్న మాట వినిపిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎవరి కోసం ఇదంతా చేయాల్సి వచ్చిందన్న అంశంపై దర్యాప్తు చేసి.. దానికి తగిన ఆధారాలు లభిస్తే రాజకీయ సంచలనాలు వెలుగు చూడటం ఖాయమని చెబుతున్నారు.
ప్రభాకర్ రావును ఇప్పటికే రెండు దఫాలుగా విచారించిన సిట్.. శనివారం సుదీర్ఘంగా విచారించింది. ఈ సందర్భంగా కీలక అంశాల్ని రాబట్టినట్లుగా తెలుస్తోంది. అన్నింటికి మించి 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న వారితో సహా ఇతర ప్రముఖుల ఫోన్లపై ఎస్ వోటీ నిఘా ఉంచేలా అనుమతులు ఎలా వచ్చాయన్న అంశంపై సిట్ ఆరా తీయటంతో చాలా అంశాలు వెలుగు చూస్తున్నట్లుగా చెబుతున్నారు.
నిఘా ఉంచాల్సిన ఫోన్ నెంబర్ల జాబితాలు ప్రభాకర్ రావు పేరు మీదనే ఉన్నతాధికారులకు వెళ్లేవి. ఆ ఫోన్ నెంబర్లపై నిగా ఎందుకు? అన్న ప్రశ్నకు.. మావోల పేరును ఉపయోగించినట్లుగా గుర్తించారు. మావోలకు డబ్బులు.. ఔషధాలు.. ఆయుధాలు సరఫరా చేస్తున్నారంటూ ప్రముఖలకు ముద్ర వేసి పంపేవారు. వీటికి ఉన్నతాధికారుల ఓకే చేసి.. సర్వీస్ ప్రొవైడర్లకు పంపేవారు. అలా విన్న ఫోన్ కాల్స్ రికార్డుల్ని హార్డ్ డిస్కుల్లో దాచేవారు.
ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావటంతో వెంటనే హార్డ్ డిస్కుల్ని ధ్వంసం చేయటం తెలిసిందే. ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకు వచ్చేందుకు దోహదం చేసినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. హార్డ్ డిస్కుల్ని ధ్వంసం చేసే క్రమంలో 2023 జూన్ వరకు తాను వినియోగించిన ఫోన్ లోని డేటాను డిలీట్ చేయటాన్ని ప్రణీత్ రావు మర్చిపోయారు. ఇదే ట్యాపింగ్ తీగ లాగేందుకు సాయం చేసిందని చెప్పక తప్పదు.
ఇక.. ఎఫ్ఎస్ఎల్ విశ్లేషణలో ఆ ఫోన్ లో సేవ్ చేసిన రాజకీయ నేతల సంభాషణలు సిట్ చేతికి అందటం.. అందులో బీజేపీలో ఉన్న ఒక మాజీ ఎంపీ.. సిద్దిపేటకు చెందిన ఒకరి సంభాషణలు ఫోన్ లో బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో.. అసలు విషయం బయటకు వచ్చింది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కీలక పరిణామాలు త్వరలోనే చోటు చేసుకుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరేం జరుగుతుందో చూడాలి.
