Begin typing your search above and press return to search.

లైవ్ అప్ డేట్స్ ... జూబ్లీహిల్స్‌ లో కాంగ్రెస్‌ కు బిగ్ విక్టరీ!

ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ, అటు బీహార్ లోనూ ఎన్నికల ఫలితాల సందడి మొదలైంది.

By:  Raja Ch   |   14 Nov 2025 9:28 AM IST

ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ, అటు బీహార్ లోనూ ఎన్నికల ఫలితాల సందడి మొదలైంది. ఇందులో భాగంగా... యూసుఫ్‌ గూడ కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. ఈ నేపథ్యంలో లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితం వచ్చేస్తుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు బీహార్ లోనూ కౌంటింగ్ మొదలైంది. ఈ రెండు ఎన్నికల ఫలితాలకు సంబంధించిన లైవ్ అప్ డేట్స్ కోసం తుపాకీ.కామ్ ఫాలో అవ్వండి.

Live Updates

  • 14 Nov 2025 11:12 AM IST

    జూబ్లీ కౌంటింగ్ వేళ విషాదం.. గుండెపోటుతో అభ్యర్థి మృతి

    విషాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల బరిలో ఉన్న ఎన్సీపీ (నేషనల్ కాంగ్రెస్ పార్టీ) అభ్యర్థి ఒకరు మరణించిన వైనం చోటు చేసుకుంది. జూబ్లీ ఉపపోరులో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు 40 ఏళ్ల మహమ్మద్ అన్వర్. ఎర్రగడ్డలో నివాసం ఉంటున్న ఆయన శుక్రవారం జరిగే కౌంటింగ్ ప్రక్రియ గురించి తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు.

    ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఒత్తిడిని ఎదుర్కొంటున్న అతడు.. గురువారం రాత్రి వేళలో తీవ్రమైన ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయారు. దీంతో.. కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. అన్వర్ ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జూబ్లీ ఉపపోరులో కీలకమైన ఫలితాలు వెల్లడయ్యే రోజుకు కొన్ని గంటల ముందుగా చోటు చేసుకున్న ఈ ఉదంతం విషాదాన్ని నింపింది. అన్వర్ మరణం గురించి తెలుసుకున్న రాజకీయ వర్గాలు ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

  • 14 Nov 2025 10:52 AM IST

    ఐదో రౌండ్ లోనూ హస్తం హవా.. ఆధిక్యం ఎంతంటే..!

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలో నిలుస్తున్నారు. ఇదే సమయంలో ఐదో రౌండ్ కౌంటింగ్ పూర్తయే సరికి 12.651 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి దూసుకుపోతున్నారు. ఇంకా మరో ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది! ట్రెండ్స్ ఇలానే కొనసాగితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం ఖాయమనే చెప్పాలి!

  • 14 Nov 2025 10:47 AM IST

    నెరవేరుతోన్న అమిత్ షా జోస్యం!... పంచ పాండవులకే బీహార్ పట్టం!

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) 160కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి 77 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

    దీంతో... అమిత్ షా జోస్యం నిజమవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా... ఎన్డీయే 160 సీట్లు గెలుచుకుంటుందని.. మూడింట రెండు వంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని షా చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. బీహార్ ప్రజలు ఎన్డీయే, బీజేపీతో ఉన్నారని తాను భావిస్తున్నానని.. దీన్ని ఐదుగురు పాండవుల పోరాటం అని తాను పిలుస్తానని.. ఎందుకంటే ఐదు రాజ్యాంగ పార్టీలు (జేడీయూ, బీజేపీ, ఎల్.జే.పీ, హెచ్.ఏ.ఎం, ఆర్.ఎల్.ఎం) ఎటువంటి వివాదం లేకుండా ఐక్యంగా ఉన్నాయని తెలిపారు.

  • 14 Nov 2025 10:34 AM IST

    బీహార్ తర్వాత ఎన్డీయే లక్ష్యం ఈ రాష్ట్రమేనంట!

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది! శుక్రవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ తన ఆధిపత్యాన్ని కనబరుస్తూనే ఉంది. ఈ క్రమంలో.. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తమ తదుపరి లక్ష్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ఇందులో భాగంగా... బీహార్‌ లో అరాచక ప్రభుత్వం ఏర్పాటు కాదని నిర్ణయించుకుందని.. బీహార్ యువత తెలివైనవారని.. ఇది అభివృద్ధి విజయమని.. ఇక తమ నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని అన్నారు. బీహార్.. గందరగోళం, అవినీతి, దోపిడీ ప్రభుత్వాన్ని అంగీకరించదనేది మొదటి రోజు నుండే స్పష్టంగా ఉందని సింగ్ అన్నారు.

  • 14 Nov 2025 10:21 AM IST

    జూబ్లీహిల్స్ నాలుగో రౌండ్ ఫలితాలివే!

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొదటి రౌండ్ నుంచీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో నాలుగో రౌండ్ లోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నాలుగో రౌండ్ ముగిసే సరికి బీఆరెస్స్ అభ్యర్థి రెండో స్థానంలోనూ, బీజేపీ అభ్యర్థి మూడోస్థానంలోనూ కొనసాగుతుండగా... నోటా నాలుగోస్థానంలో కొనసాగుతోందని తెలుస్తోంది!

    ఈ క్రమంలో రెండో రౌండ్ పూర్తయ్యే సరికి నవీన్ యాదవ్ కు 17,874 ఓట్లు రాగా.. బీఆరెస్స్ అభ్యర్థి మాంగంటి సునీత కు 14,879 ఓట్లు వచ్చాయి. 2995 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 3,475 ఓట్లు వచ్చాయి.

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాజా పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. ఇందులో భాగంగా... జూబ్లీహిల్స్‌ లో గెలుపు కాంగ్రెస్‌ దే అని.. ప్రజలు కాంగ్రెస్‌ కే పట్టం కట్టబోతున్నారని అన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ కు ఈ ఎన్నికలో మంచి మెజార్టీ రావాల్సి ఉండేది కానీ.. ఓటింగ్ శాతం తగ్గడం ఫలితాలపై ప్రభావం చూపిస్తుందని అన్నారు!

  • 14 Nov 2025 10:05 AM IST

    నితీశ్ కుమార్ 1 అన్నె మార్గ్ లోనే ఉంటారా?

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తన సత్తా చాటుతోంది. ఇందులో భాగంగా.. 150 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఈక్రమంలో... నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ 76 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ 64 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఇక ఆర్జేడీ పార్టీ అభ్యర్థులు 59 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    లాలూ-రబ్రీ శకం తర్వాత 20 సంవత్సరాల సుదీర్ఘ పాలన అనంతరం తిరిగి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘఠ్ బంధన్‌ కు ఇది గణనీయమైన ఎదురుదెబ్బ.

    ఈ పరిణామాల నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ 1 అన్నే మార్గ్ వదిలి వెళ్లాల్సిన అవసరం లేదనే చర్చ బలంగా మొదలైంది. కాగా... పాట్నాలోని 1, అన్నే మార్గ్ బీహార్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం.

  • 14 Nov 2025 9:50 AM IST

    బీహార్ ఎన్నికల్లో పీకే పార్టీ ప్రభావం ఇదే!

    ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 'జన్ సురాజ్' పార్టీ ఎన్నికల అరంగేట్రంలోనే విఫలమవుతుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. బీహార్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన అనంతరం పీకే పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. బీహార్‌ లోని 243 సీట్లలో 239 చోట్ల జన్ సురాజ్ పోటీ చేసిన సంగతి తెలిసిందే.

    మరోవైపు మహాగఠ్ బంధన్ కూటమి ఓట్లను చీల్చడంలో జన్ సురాజ్ సక్సెస్ అయినట్లే కనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగడానికి పీకే పార్టీ ప్రభావం పనిచేసిందని అంటున్నారు. ఇదే సమయంలో.. మహాగఠ్‌ బంధన్‌ కూటమిలో ప్రధాన ఆర్జేడీ పార్టీ 60 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • 14 Nov 2025 9:34 AM IST

    అప్పుడే మొదలుపెట్టేసిన ఎన్డీయే కూటమి!:

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలవ్వగా... ఉదయం నుంచే ఆధిక్యంలో ఎన్డీయే తన ఆధిపత్యాన్ని చూపిస్తోంది. ఇందులో భాగా... సుమారు 145 స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా.. అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు.

    మరోవైపు విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ జేడీయూ పోస్ట్ పెట్టింది. ఇందులో భాగంగా... మరోసారి నీతీశ్ ప్రభుత్వం రాబోతోందని, అందుకు బీహార్‌ సిద్ధంగా ఉందంటూ రాసుకొచ్చింది.

    ఇదే సమయంలో గెలుపుపై ఆర్జేడీ సైతం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా... తామే గెలవనున్నామని, మార్పు రానుందని.. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్ విలేకరులతో అన్నారు.

    కాగా... అధికార ఎన్డీయే కూటమే బీహార్ లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసిన సంగతి తెలిసిందే.

  • 14 Nov 2025 9:29 AM IST

    బీహార్ లోనూ మొదలైన కౌంటింగ్!:

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకే మొదలైంది. 38 జిల్లాల్లోని 46 కౌంటింగ్‌ కేంద్రాల్లో లెక్కింపు కొనసాగుతోంది.


  • 14 Nov 2025 9:29 AM IST

    మొదటి రెండు రౌండ్లలోను కాంగ్రెస్ ఆధిక్యం!:

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొదటి రెండు రౌండ్స్ లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఆధిక్యం లభించింది. ఇందులో భాగంగా... బీఆరెస్స్ అభ్యర్థి మాగంటి సునీతకు తొలి రౌండ్ లో 8,864 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.. సునీత కంటే 62 ఓట్ల ఆధిక్యం (8,926)లో కొనసాగుతున్నారు. ఇదే క్రమంలో రెండో రౌండ్ లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ 1,094 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.