ధన్ ఖడ్ అధికారిక నివాసం సీజ్.. ఈ వైరల్ వార్తలో నిజమెంత?
అదిగో తోక అంటే ఇదిగో పులి అన్న రోజులు పోయి చాలా కాలమే అయ్యింది. ఇప్పుడు నడుస్తున్నదంతా డిజిటల్ యుగం.
By: Tupaki Desk | 24 July 2025 9:39 AM ISTఅదిగో తోక అంటే ఇదిగో పులి అన్న రోజులు పోయి చాలా కాలమే అయ్యింది. ఇప్పుడు నడుస్తున్నదంతా డిజిటల్ యుగం. అందునా సోషల్ మీడియా తాను అనుకున్నది అనుకున్నట్లుగా ఫేక్ వార్తల్ని సైతం ఫెయిర్ వార్తలుగా మార్చి.. తప్పుడు ప్రచారంతో అందరిని కన్ఫ్యూజ్ చేయటమే కాదు.. చివరకు ‘శీల’ పరీక్షలో కానీ నిజమేంటో తేలాల్సిన పరిస్థితుల్ని సృష్టిస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. ఏది నిజం? ఏది అబద్ధమన్నది ఎవరికి వారు తెలుసుకోవటం కోసం శ్రమించాల్సి వస్తోంది.
అబద్ధం వ్యాపించే వేగం.. నిజం విస్తరించటం కష్టమే అవుతుంది. ఫ్యాక్ట్ చెక్ లో అబద్ధమని తేలిన తర్వాత కూడా.. సదరు అసత్య వార్త వేగంగా జనం మదిలోకి వెళ్లిపోవటంతో.. అది అబద్దమన్నది నమ్మటానికి కాస్తంత సమయం తీసుకుంటున్న దుస్థితి. అనూహ్య రీతిలో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్ ఖడ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన రాజీనామాపై సాగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆయన్నుబలవంతం పెట్టి మరీ పదవికి రాజీనామా చేశారంటూ ఆయన రాజీనామాపై పలు కథనాలు తెర మీదకు వచ్చిన పరిస్థితి.
ఇలాంటి వేళ.. ఆయన అధికారిక నివాసాన్ని సీల్ చేశారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతోంది. అంతేకాదు.. ఆయన అధికారిక నివాసాన్ని తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఇదంతా బోగస్ మాటలని.. సదరు ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియాలో తాజాగా పోస్టు పెట్టింది. అయితే.. తన అధికారిక నివాసం నుంచి త్వరగా బయటకు వెళ్లే ఆలోచనలో ధన్ ఖడ్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా తన వస్తువుల్ని మంగళవారం నుంచే ప్యాక్ చేసుకోవటం షురూ చేసినట్లుగా చెబుతున్నారు.
ఆయనకు మాజీ ఉపరాష్ట్రపతి హోదాలో ఢిల్లీలో టైప్ 8 లేదంటే మరో ప్రాంతంలో బంగ్లా ఇచ్చే వీలుందని చెబుతున్నారు. కేంద్ర మంత్రులు..జాతీయ పార్టీ అధ్యక్షులకు ఈ తరహాబంగ్లాను కేటాయిస్తుంటారు. ఇకపోతే ఇప్పుడు ఆయన ఉండే అధికారిక నివాసం (వీపీ ఎన్ క్లేవ్) సెంట్రల్ విస్టా డెవలప్ మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సంగతి తెలిసిందే. గడిచిన పదిహేను నెలలుగా ఉప రాష్ట్రపతి హోదాలో ధన్ ఖడ్ అక్కడే ఉంటున్నారు. మొత్తంగా తనకుండే గడువు కంటే ముందే.. రోజుల వ్యవధిలోనే అధికారిక నివాసాన్ని ఖాళీ చేసే యోచనలో ఆయన ఉన్నట్లుగా చెప్పక తప్పదు.
