దేహం సందేహం అయ్యాక ... కక్షలుంటాయా ?
మనిషి జీవించి ఉన్నపుడే అందులో జీవుడు నివసించినపుడే దేహానికి బంధం. దేహం మనిషి మొదటి చుట్టం .
By: Satya P | 16 July 2026 9:16 AM ISTమనిషి జీవించి ఉన్నపుడే అందులో జీవుడు నివసించినపుడే దేహానికి బంధం. దేహం మనిషి మొదటి చుట్టం . ప్రాణం అక్కడ కొడిగట్టుకుని పోయాక దేహం సందేహం అయ్యాక జీవుడు చల్లగా అందులో నుంచి జారుకున్నాక అది ఒక శిథిల భవంతి. ఊపిరి ఆగి వేడి చల్లారిన మీదట అది పంచ భూతాలకు సమర్పితం. ఎంత వేగంగా అందులో విలీనం కావాలని ఆ పార్ధివ దేహం ఎదురుచూస్తుంటుంది. దేహంతో చుట్టరికం ఉన్న జీవుడే ఎగిరిపోయాక ఇక ఆ దేహానికి ఏ రకమైన చుట్టరికాలూ లేవు, పగలూ పట్టింపులు అంతకంటే కూడా లేవు. ఆ పార్ధివ దేహానికి అంత్య క్రియల వేళ ఉన్న విలువ ఎందుకు అంటే ఇంతకాలం అది జీవుడికి నివాసం ఇచ్చింది అని. ఆ జీవుడి బంధువులు అందరూ అందుకే ఆ దేహానికి ఒక నమస్కారం చేసి వెళ్తారు. దానినే కడసారి చూపులు అంటారు.
అవన్నీ అవసరమా :
ఇక ఆ దేహాన్నిచివరి సారి చూసేందుకు ఎవరి అనుమతి కావాలి అన్నది ప్రశ్న. ఆలోచిస్తే ఎవరి పర్మిషన్ అవసరం లేదు. అంతే కాదు ఎవరైనా చూడవచ్చు. జీవుడు అనే దేవుడు దశాబ్దాలుగా అక్కడ కొలువు తీరి అంతరించాక ఆ దేహం కూడా బంధాలు తెంచుకుంటుంది. ఎవరిదీ ఆ మీదట అది కాదని కూడా చెబుతుంది. అయితే అంతకాలం తమ వారు జీవించిన దేహం కాబట్టి అంత్య క్రియలను సంప్రదాయం ప్రకారం చేస్తారు ఆ జీవుడి సంబంధీకులు. ఈలోగా వచ్చిన వారు వస్తారు, చూసే వారు చూస్తారు, వారు ఇరుగు పొరుగు వారు కావచ్చు, రక్త సంబంధీకులు కావచ్చు. లేదా దారిన పోయే దానయ్య కావచ్చు. ఏ రకమైన పరిచయం కూడా లేని వారు కావచ్చు. ఎందుకంటే ఆ దేహం కొద్ది గంటలలో పంచ భూతాలలోకి ఎలాగూ కలసిపోతుంది. అది కూడా ప్రకృతిలో భాగం అవుతుంది, కాబట్టి దానికి ప్రత్యేకంగా హక్కు భుక్తాలు ఉండవు. అది అందరి పరం కూడా అవుతుంది.
కాదనడం భావ్యమా :
ఆ విధంగా ఆ భౌతిక కాయాన్ని చూసేందుకు ఎవరు వచ్చినా ఒక నమస్కారం పెట్టుకోవాలని చూసినా అడ్డుకోవడం అంటే భావ్యం కాదనే అంటారు. అది వేదాంతం అయినా లేక సిద్ధాంతం అయినా ఇదే చెబుతోంది. దేహాన్నే విడిచిన జీవికి పగలు ప్రతీకారాలు వెంట పడతాయా, అసలు అవి రానే రావు. అన్నీ ఆ దేహంలో దీపం అనే ప్రాణం వెలిగినపుడే జరిగే సంఘటనలు. వాటి సందర్భాలు పరిస్థితులు ఏవైనా జీవుడు పలాయనం చిత్తగించాక నిర్జీవం అయిన దేహానికి వాటితో ఏమిటి సంబంధం అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అందువల్ల ఒక దండం పెట్టుకోవడానికి ఎవరు వచ్చినా అభ్యంతరాలు ఎందుకు ఉండాలని అంటారు వైరాగ్యభావుకులు.
దేహమే పంచభూతాల ఆధీనం :
దేహమే పంచభూతాల ఆధీనం అయినపుడు దాని అధికారం ప్రకృతి పరం అయినపుడు వేరే ఎవరికో ఆ దేహం మీద అధికారాలు ఉంటాయనుకోవడం ఉత్త భ్రమే కదా. ఎందుకంటే ఈ దేహం శిధిలం అయింది అని జీవుడే అక్కడ నివసించలేక వదిలి బయటకు వచ్చినపుడు ఇంకెవరికి దాని మీద యాజమాన్యం హక్కులు ఉంటాయి. కక్షలు కార్పణ్యాలు ఆ సమయంలో అవసరమా ఇది జీవుడు దేవుడు పరమాత్మ ఆత్మల గురించి క్షుణ్ణంగా అవగాహన ఉన్న వారి అంద్రికీ అవగతం అయ్యే విషయమే. కాని వారు యాగీ చేసినా వారి వద్ద కూడా ఆ భౌతిక కాయం ఉండేది ఎంతసేపు కనుక. అది మాపటికల్లా పంచభూతాలలో ఐక్యం కావాల్సిందే. ఆ మాత్రం దానికి రాద్ధాంతాలు అవసరమా అంటే ఏమో. ఈ భౌతిక లోకంలో ఇంతేనేమో.
