భార్యతో చైనాకు.. ట్రంప్ అనూహ్య నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్‌ల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ రెండు దేశాల సంబంధాలలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
By: Tupaki Desk | 6 Jun 2025 9:33 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్‌ల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ రెండు దేశాల సంబంధాలలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. సుమారు 90 నిమిషాల పాటు సాగిన ఈ చర్చలు చాలా సానుకూలంగా ముగిశాయని, పరస్పర పర్యటనల కోసం ఆహ్వానించుకున్నామని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మాధ్యమం ద్వారా వెల్లడించారు.
-పరస్పర పర్యటనల ఆహ్వానం:
"తాను ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌తో కలిసి త్వరలో చైనాలో పర్యటిస్తానని" ట్రంప్ తెలిపారు. అదేవిధంగా జిన్పింగ్‌ను అమెరికా పర్యటనకు ఆహ్వానించినట్టు పేర్కొన్నారు. "ఇది రెండు దేశాల సంబంధాలను మరింత బలపరిచే దిశగా ముందడుగు అవుతుంది" అని ట్రంప్ అభిప్రాయపడ్డారు. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ ఆహ్వానాన్ని ధృవీకరించింది.
-వాణిజ్య సంబంధాలపై ప్రధాన దృష్టి:
ఈ చర్చల్లో వాణిజ్య సంబంధాలు, ద్వైపాక్షిక విధానాలు, భద్రతా అంశాలు వంటి కీలక విషయాలపై చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా అమెరికా విధించిన అధిక సుంకాల విషయంలో చైనా అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆ సుంకాలను తొలగించాలని జిన్పింగ్ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో "ఇరు దేశాల నేతలు అమెరికా, చైనా వాణిజ్య ఒప్పందంలోని కొన్ని సమస్యలపై చర్చించాము" అని స్పష్టం చేశారు.
-ట్రేడ్ వార్ ముగింపు దిశగా:
గత కొన్ని నెలలుగా అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్ చైనా వస్తువులపై 145 శాతం సుంకాలు విధించగా, చైనా ప్రతిగా అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాలు విధించింది. అయితే ఈ ఫోన్ కాల్ ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతను తగ్గించి, జెనీవాలో కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని అమలు చేయడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత నెలలో జెనీవాలో జరిగిన చర్చల్లో ఇరు దేశాలు సుంకాలను తగ్గించుకోవడానికి అంగీకరించాయి. అమెరికా చైనా వస్తువులపై 145 శాతం సుంకాలు 30 శాతానికి తగ్గించగా, చైనా అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాలు 10 శాతానికి తగ్గించింది.
- తదుపరి సమావేశాలు:
త్వరలో ఇరుదేశాల ప్రతినిధుల తదుపరి భేటీ ఉంటుందని ట్రంప్ అన్నారు. యూఎస్ బృందంలో ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్, వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్, యూఎస్ వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ ఉంటారని ట్రంప్ తెలిపారు. జెనీవా ఒప్పందాన్ని అమలు చేసేందుకు వీలైనంత త్వరగా మరో రౌండ్ సమావేశాలను కావాలని ఇద్దరు నేతలు ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది.
-తైవాన్ సమస్య:
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, జిన్ పింగ్ తైవాన్ సమస్యను జాగ్రత్తగా పరిష్కరించాలని ట్రంప్‌ను కోరారు. తద్వారా విభజనవాదులు రెండు దేశాలను ఘర్షణ వైపుకు నెట్టకుండా ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది.
-సంబంధాలపై ట్రంప్ వ్యాఖ్యలు:
డొనాల్డ్ ట్రంప్, జిన్ పింగ్ ఫోన్ కాల్ సంభాషణపై ట్రంప్ సోషల్ మీడియాలో స్పందించారు. జిన్ పింగ్ తో డీల్ చేయడం చాలా కష్టమని, అయినప్పటికీ అతన్ని తాను "ఇష్టపడతానని" ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో తెలిపారు. చైనా ఆర్థిక వ్యవస్థ చాలా బాగా పనిచేయాలని అమెరికా కోరుకుంటుందని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ ఫోన్ కాల్ ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించి, భవిష్యత్ చర్చలకు మార్గం సుగమం చేస్తుందని మార్కెట్ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఏర్పడిన వాణిజ్య యుద్ధాల నేపధ్యంలో ఈ కొత్త చర్చలు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఇప్పుడు ఈ పర్యటనల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయా? అనే ప్రశ్నకు సమాధానం త్వరలోనే లభించనుంది.
