ట్రంప్ పై కాల్పులు.. రంగంలోకి దిగిన ఎలన్ మస్క్
అమెరికా రాజకీయ చరిత్రలో మరో చీకటి రోజుగా మిగిలిపోయే ఘటన వాషింగ్టన్ వేదికగా చోటుచేసుకుంది.
By: A.N.Kumar | 27 April 2026 12:00 AM ISTఅమెరికా రాజకీయ చరిత్రలో మరో చీకటి రోజుగా మిగిలిపోయే ఘటన వాషింగ్టన్ వేదికగా చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన నేతగా పరిగణించబడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ హత్యాయత్నం ఒక్కసారిగా అగ్రరాజ్యాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వాషింగ్టన్‌లోని ప్రతిష్టాత్మక హిల్టన్ హోటల్‌లో వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ జరుగుతుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది.
ఉలిక్కిపడ్డ వాషింగ్టన్
కార్యక్రమం అత్యంత వైభవంగా సాగుతున్న సమయంలో రాత్రి వేళ ఒక 31 ఏళ్ల యువకుడు భారీ ఆయుధాలతో హోటల్ ప్రాంగణంలోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. భద్రతా తనిఖీల వద్ద సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అతడిని ఆపే ప్రయత్నం చేయగా.. నిందితుడు తన వద్ద ఉన్న ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అతని వద్ద ఒక షాట్‌గన్, హ్యాండ్‌గన్‌తో పాటు భారీగా మందుగుండు సామగ్రి ఉంది.
కాల్పుల శబ్దం వినబడగానే హోటల్ లోపల ఒక్కసారిగా కలకలం రేగింది. అక్కడ ఉన్న జర్నలిస్టులు, ఉన్నతాధికారులు.. రాజకీయ ప్రముఖులు ప్రాణభయంతో పరుగులు తీశారు. చాలామంది టేబుళ్ల కింద దాక్కుని తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు.
అప్రమత్తమైన భద్రతా దళాలు
పరిస్థితి తీవ్రతను గమనించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు మెరుపు వేగంతో స్పందించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లను చుట్టుముట్టి వారిని హుటాహుటిన సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ పెనుగులాటలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కు బుల్లెట్ తగిలింది. అయితే అతను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణాలకు తెగించి పోరాడిన భద్రతా సిబ్బంది చివరికి దుండగుడిని లొంగదీసుకుని అదుపులోకి తీసుకున్నారు.
ఎలన్ మాస్క్ తీవ్ర ఆగ్రహం
ఈ ఘటనపై ప్రపంచ కుబేరుడు, ఎక్స్ అధినేత ఎలన్ మాస్క్ ఘాటుగా స్పందించారు. "ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన నాయకులపై ఇలాంటి దాడులు జరగడం నాగరిక సమాజానికి గొడ్డలిపెట్టు. అమెరికాలో రాజకీయ విద్వేషం ప్రమాదకర స్థాయికి చేరుకుంది" అని ఆయన తన సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. హింసకు తావులేని రాజకీయ వాతావరణం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
చరిత్ర పునరావృతం.. ట్రంప్ భావోద్వేగం
కాల్పుల అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. తన ప్రాణాలను కాపాడిన భద్రతా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక కీలక విషయాన్ని గుర్తుచేశారు. సరిగ్గా 45 ఏళ్ల క్రితం.. ఇదే హిల్టన్ హోటల్ బయట అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌పై కూడా కాల్పులు జరిగాయి. "చరిత్ర మళ్లీ పునరావృతం కావడం విచారకరం.. కానీ ధైర్యం మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
దర్యాప్తు ముమ్మరం
ప్రస్తుతం నిందితుడిని ఎఫ్.బి.ఐ.. ఇతర భద్రతా సంస్థలు విచారిస్తున్నాయి. నిందితుడికి ఏదైనా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా? అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హిల్టన్ హోటల్ వద్దకు ఆయుధాలతో ఎలా రాగలిగాడు? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది.
ఈ సంఘటన అమెరికాలో భద్రతా వైఫల్యాలపై.. రాజకీయ ఉద్రిక్తతలపై కొత్త చర్చకు తెరలేపింది. అగ్రరాజ్య అధ్యక్షుడిపైనే దాడికి ప్రయత్నించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అమెరికా అంతటా హై అలర్ట్ ప్రకటించారు.
