Begin typing your search above and press return to search.

మూడో ప్రపంచ యుద్ధమే.. ట్రంప్ కు రష్యా మాజీ అధ్యక్షుడి హెచ్చరిక

ఈ విషయంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. పుతిన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

By:  Tupaki Desk   |   28 May 2025 7:06 PM IST
మూడో ప్రపంచ యుద్ధమే.. ట్రంప్ కు రష్యా మాజీ అధ్యక్షుడి హెచ్చరిక
X

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నిప్పుతో ఆడుకుంటున్నారని, తాను అధ్యక్షుడి స్థానంలో లేకుంటే రష్యాకు చాలా చెడు జరిగి ఉండేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వ్‌దేవ్‌ తీవ్ర స్థాయిలో స్పందించారు. చెడు ఏదైనా జరుగుతుందంటే అది కేవలం మూడో ప్రపంచ యుద్ధమే అని తాను నమ్ముతున్నట్లు దిమిత్రి పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్రంప్‌ అర్థం చేసుకుంటారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. పుతిన్‌పై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను రష్యా తీవ్రంగా పరిగణిస్తోందని మెద్వ్‌దేవ్‌ స్పష్టం చేశారు.

-రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: ఉద్రిక్తతలు ఉధృతం

రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు జరుగుతున్నప్పటికీ, మాస్కో కీవ్‌పై భారీ వైమానిక దాడులకు పాల్పడుతోంది. కేవలం మూడు రోజుల్లోనే రష్యా తమ దేశంపై 900లకు పైగా డ్రోన్ దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఈ దాడులను చూస్తుంటే పుతిన్‌కు యుద్ధాన్ని ఆపే ఉద్దేశం ఉన్నట్లు లేదని ఆయన అన్నారు. కీవ్‌పై మరిన్ని క్షిపణులు ప్రయోగించడానికి మాస్కో సన్నద్ధమవుతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయని వాపోయారు. ఇకనైనా దాడులకు పాల్పడకుండా రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా, యూరప్‌లు ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించాలని జెలెన్‌స్కీ ప్రపంచ దేశాలను కోరారు.

-ట్రంప్ హెచ్చరికలు: పుతిన్ నిప్పుతో ఆడుకుంటున్నారు

ఈ విషయంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. పుతిన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. "ఇక్కడ నేను లేకుంటే రష్యాకు చాలా చెడు జరిగి ఉండేది. చాలా నష్టం జరిగి ఉండేది. ఈ విషయాన్ని పుతిన్ తెలుసుకోవడం లేదు. ఆయన నిప్పుతో ఆడుకుంటున్నారు. ఇలాగే చేస్తే రష్యా తీవ్ర చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని మాస్కోను హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.