'ఇరాన్ సుప్రీం లీడర్ ను చంపడం కష్టమేమీ కాదు'.. ట్రంప్ మరో సంచలనం!
ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మంగళవారం చాలా సంచలన పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Jun 2025 9:24 AM ISTఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మంగళవారం చాలా సంచలన పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో పలు పరిణామాలు ట్రంప్ చుట్టూనే తిరుగడం గమనార్హం. కెనడా వేదికగా జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశాన్ని మధ్యలోనే ముగించి ఆగమేఘాల మీద అమెరికాకు వెళ్లాలనుకున్నది మొదలు ట్రంప్ నుంచి వరుస సంచలన స్టేట్ మెంట్లు వినిపిస్తున్నాయి.
అవును... ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరడంతో.. ట్రంప్ తన కెనడా పర్యటనను కుదించుకుని.. జీ7 ట్రిప్ నుంచి ఆగమేఘాలపై అమెరికాకు బయలుదేరారు. ఈ సందర్భంగా... స్పందించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్.. ట్రంప్ వెనుదిరగడం సరైన నిర్ణయమే అని అన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారాలనిని, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని అన్నారు.
అక్కడ నుంచి ట్రంప్ వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా... తాను జీ7 సదస్సును ఎందుకు వీడుతున్నానో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తప్పుగా అర్ధం చేసుకున్నారని చెప్పిన ట్రంప్... తాను వాషింగ్టన్ ఎందుకు వెళ్తున్నానో ఆయనకు తెలియదని.. కాల్పుల విరమణ గురించి కాదని.. అంతకంటే 'పెద్దదే' జరగబోతోందని అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
అనంతరం... 'ట్రూత్' సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్... తాను చెప్పిన అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందని.. ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోయారని.. ఇది ఎంత సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయలేదనే విషయాన్ని ఇప్పటికే పదే పదే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో.. ప్రజలంతా టెహ్రాన్ ను ఖాళీ చేయాలని సూచించారు.
ఇక కెనడా నుంచి అమెరికా బయలుదేరిన ట్రంప్.. ఎయిర్ ఫోర్స్ వన్ లో విలేకరులతో మాట్లాడుతూ... తాను కాల్పుల విరమణ కోసం చూస్తున్నానని చెప్పలేదని.. తాము కాల్పుల విరమణ కంటే మెరుగైన దాని కోసం చూస్తున్నామని.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదానికి "నిజమైన ముగింపు" కోరుతున్నానని.. తన సహనం సన్నగిల్లుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఖమేనీకి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఇందులో భాగంగా.. సోకాల్డ్ సుప్రీం లీడర్ (ఖమేనీ) ఎక్కడ దాక్కున్నాడో తమకు తెలుసని.. అతడిని చంపడం పెద్ద కష్టమేమీ కాదని.. అయితే అది ఇప్పుడు కాదని.. పౌరులపై, లేదా సైనికులపై క్షిపణులు ప్రయోగించాలని తాము కోరుకోవడం లేదని అన్నారు!
ఈ నేపథ్యంలోనే తనలో సహనం నశించిపోతుందని చెబుతూ... "ఎటువంటి షరతులు లేకుండా లొంగిపోవాలని" స్పెషల్ గా రాసుకొచ్చారు ట్రంప్. దీంతో... ఖమేనీకి ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ సంచలనంగా మారింది. ఈ ‘ఇరాన్ - ఇజ్రాయెల్’ మధ్య యుద్ధంలో ఆరో రోజు అమెరికా ఎంట్రీ ఉంటుందా అనే చర్చ మరోసారి బలంగా మొదలైంది.
