Begin typing your search above and press return to search.

ఒకసారి తలచుకోవచ్చుగా ట్రంప్ సర్!

తమపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు అమెరికా సహాయసహకారాలు ఉన్నాయని ఇరాన్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇరాన్ పై ఇజ్రాయెల్‌ చేస్తున్న భీకర దాడుల్లో తమ ప్రమేయం ఏమీ లేదని డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   16 Jun 2025 7:00 AM IST
ఒకసారి తలచుకోవచ్చుగా ట్రంప్ సర్!
X

ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం రోజు రోజుకీ తీవ్రమవుతోంది. ఈ విషయంలో ఇజ్రాయెల్ కు అమెరికా పూర్తి సహకారం అందిస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. అయితే.. ఈ యుద్ధంలో తమ ప్రమేయం ఏమీ లేదని అమెరికా చెప్పుకొస్తోంది. ఈ సమయంలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... తమపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు అమెరికా సహాయసహకారాలు ఉన్నాయని ఇరాన్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇరాన్ పై ఇజ్రాయెల్‌ చేస్తున్న భీకర దాడుల్లో తమ ప్రమేయం ఏమీ లేదని డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి స్పష్టం చేశారు. అయినా లెక్కచేయకుండా అమెరికాపై దాడికి తెగబడితే.. అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

ఇందులో భాగంగా... తమపై దాడులకు తెగబడితే మునుపెన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో.. టెహ్రాన్‌ పై విరుచుకుపడతాయని హెచ్చరించారు. ఇరాన్‌ తమపై ఏ రూపంలో దాడి చేసినా తాము పూర్తి శక్తితో వాటిని తిప్పి కొడతామని స్పష్టం చేశారు. ఆ అవుట్ పుట్ ఇరాన్ తట్టుకోలేదన్నట్లుగా ట్రంప్ తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు.

అయితే.. భారత్ - పాక్ మధ్య ఆపరేషన్ సిందూర్ సమయంలో.. కాల్పుల విరమణ అంగీకారం తన మధ్యతవర్తిత్వం వల్లే జరిగిందని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ - ఇరాన్ విషయంలోనూ అదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇందులో భాగంగా.. తాను తలచుకుంటే ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం ఆపడం పెద్ద విషయం కాదని చెప్పుకొచ్చారు.

వాస్తవానికి ఇరాన్‌ - అమెరికా మధ్య అణుఒప్పందం కోసం ఒమన్‌ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటివరకు ఇరుదేశాల మధ్య 5 భేటీలు జరగగా.. ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే.. ప్రస్తుతం ఇజ్రాయెల్‌ తో ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఒమన్‌ లో ఆదివారం జరగాల్సిన ఆరో విడత చర్చలను రద్దు చేసుకున్నారు.

కాగా... ఎవరు అవునన్నా కాదన్నా తమతో ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధం వెనుక అమెరికా ఉందని ఇరాన్ గట్టిగా వాదిస్తోంది. ఇజ్రాయెల్ పై తాము ప్రయోగించిన క్షిపణులను అడ్డుకోవడంలో టెల్ అవీవ్ కు వాషింగ్టన్ సహకరిస్తుందనేది వారి ఆరోపణ. అయితే.. అందుకు మాత్రం ట్రంప్ అంగీకరించడం లేదు.. ఈ యుద్ధంలో తమ ప్రమేయం ఏమాత్రం లేదని చెప్పుకొస్తున్నారు.

మరోవైపు... ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ పూర్తిగా నాశనం అవ్వకముందే తమతో అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఈ మారణ హోమం ఇలాగే కొనసాగితే ఇరాన్‌ లో ఏమీ మిగలదని.. ఒకప్పుడు ఇరానియన్‌ సామ్రాజ్యంగా పేరొందిన దేశాన్ని కాపాడుకోవాలంటే అక్కడి పాలకులు ముందుకు రావాలని బెదిరిస్తూ, సూచిస్తున్నారు.