కాల్పుల విరమణ వేళ హర్మూజ్ లాభం ఎవరికి?
ఇరాన్ - అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధానికి కాస్త విరామం ఇస్తూ కాల్పుల విరమణ జరగటం తెలిసిందే.
By: Garuda Media | 13 April 2026 4:31 PM ISTఇరాన్ - అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధానికి కాస్త విరామం ఇస్తూ కాల్పుల విరమణ జరగటం తెలిసిందే. ఇందులో భాగంగా పాక్ లోని ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరగటం.. చివరకు అవి కాస్తా ఫెయిల్ కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హర్మూజ్ మీద నియంత్రణను ఇరాన్ వదలని పక్షంలో మళ్లీ దాడులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
తాజా పరిణామాలతో మళ్లీ యుద్ధ భయాలు రెట్టింపు అయ్యాయి. ఇందుకు తగ్గట్లే సెన్సెక్స్ దారుణంగా పడిపోవటం తెలిసిందే. కాల్పుల విరమణ వేళ.. హర్మూజ్ జలసంధి వద్ద దాదాపు 800పైగా నౌకలు ఉండటం తెలిసిందే. వీటిల్లో ఎన్ని నౌకలు జలసంధిని విజయవంతంగా దాటాయి? అందులో భారత్ కు చెందిన నౌకలు ఎన్ని? కాల్పుల విరమణ.. ఏ దేశానికి ఎక్కువ మేలు చేసింది? లాంటి అంశాల్ని చూసినప్పుడు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ప్రస్తుతం అక్కడ 800కంటే ఎక్కువ నౌకలు చిక్కుకొని ఉన్నాయి.
వీటిల్లో 426 ఆయిల్ ట్యాంకర్లు.. 34 ఎల్పీజీ క్యారియరర్లు.. 19 ఎల్ ఎన్ జీ వెసెల్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏప్రిల్ 13 నుంచి ఇరాన్ ఓడరేవులపై పూర్తి బ్లాక్ డే విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటికే పరిమితంగా సాగుతున్న రాకపోకలన్ని దాదాపు నిలిచిపోయే ప్రమాదం ఉంది. కాల్పుల విరమణ (ఏప్రిల్ 8) నుంచి ఏప్రిల్ 12 వరకు రాకపోకలు సాధారణ స్థాయి కంటే చాలా తక్కువగానే సాగాయి. పలు రిపోర్టులను కూర్చి చూస్తే.. ఏప్రిల్ 8 నుంచి ఆదివారం (ఏప్రిల్ 12) వరకు కేవలం 19-30 నౌకలు మాత్రమే జలసంధిని దాటినట్లుగా చెప్పాలి.
కాల్పుల విరమణ తర్వాత ఈ జలసంధిని దాటిన మొదటి భారతీయ నౌక జగ్ విక్రమ్ రికార్డును క్రియేట్ చేసింది. కాల్పుల విమరణతో లభించిన అవకాశం భారత్ సద్వినియోగం చేసుకుందని చెప్పాలి. విరమణ వేళ..జలసంధిని దాటిన ఎక్కువ నౌకలు భారత్ వే కావటం గమనార్హం. భారత్ తర్వాత చైనాకు చెందిన నౌకలు (3-9) మధ్య జలసంధిని దాటాయి. ఆ తర్వాతి స్థానంలో రష్యా నౌకలు ఉన్నాయి. అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు కూడా మైన్ క్లియరింగ్ లో భాగంగా జలసంధిని దాటాయి. పాక్ కు చెందిన ఒక ట్యాంకర్ సురక్షితంగా జలసంధిని దాటింది. గ్రీస్ దేశానికి చెందిన నౌక కూడా జలసంధిని దాటింది. సాధారణ రోజుల్లో ఈ జలసంధిని రోజుకు 138 నౌకలు దాటుతుంటే.. ఇప్పుడు 5-7 నౌకలు మాత్రమే దాటే పరిస్థితి.
ఇదంతా చూసినప్పుడు కాల్పుల విరమణ భారత్ కు మేలు చేసిందని చెప్పాలి. దీంతో ముడిచమురు.. గ్యాస్ నౌకలు భారత్ కు చేరటం ద్వారా.. ఇప్పటికి ఉన్న ఒత్తిడిని కొంత మేర తగ్గించే వీలుంది. గృహావసరాలకు వాడే సిలిండర్లు, వాహనాల గ్యాస్ సరఫరాలో కొరత కొంతమేర తగ్గే అవకాశం ఉంది. గ్యాస్ కొరత కారణంగా ఎరువుల కర్మాగారాలకు నిలిచిపోయిన గ్యాస్ సరఫరా ఇప్పుడు 95 శాతం వరకు పునరుద్ధరించే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం హర్మూజ్ జలసంధి వద్ద భారత్కు చెందిన 37 నౌకలు చిక్కుకొని ఉన్నాయి. అవి కూడా వస్తే.. మన పరిస్థితి మరింత మెరుగు అవుతుందని చెప్పాలి.
