Begin typing your search above and press return to search.

ఎలాన్ మస్క్ ను రిక్వెస్ట్ చేస్తున్న వైట్ హౌస్

మస్క్ వ్యాఖ్యలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మస్క్ వ్యాపారాలకు (స్పేస్‌ఎక్స్, టెస్లా వంటివి) సంబంధించిన ప్రభుత్వ ఒప్పందాలను రద్దు చేస్తానని హెచ్చరించారు.

By:  Tupaki Desk   |   6 Jun 2025 4:35 PM IST
ఎలాన్ మస్క్ ను రిక్వెస్ట్ చేస్తున్న వైట్ హౌస్
X

అమెరికా రాజకీయాలు ఇప్పుడు అగ్రనేతల వ్యక్తిగత వివాదాలతో హాట్ హాట్‌గా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణల స్థాయికి చేరింది. 'అమెరికా బిగ్ బ్యూటిఫుల్ బిల్' నేపథ్యంలో చెలరేగిన ఈ వివాదం అధ్యక్షుడు ట్రంప్‌కు మరింత నష్టం కలిగించే అవకాశం ఉందని వైట్ హౌస్ భావిస్తోంది. అందుకే, ఈ గొడవకు తెరదించడానికి వైట్ హౌస్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈ క్రమంలో ఈరోజు ఎలాన్ మస్క్‌తో వైట్ హౌస్ ప్రతినిధులు ఒక ఫోన్ కాల్ షెడ్యూల్ చేసినట్లు పాలిటికో వార్తా సంస్థ కథనం ప్రచురించింది.

ట్రంప్‌పై మస్క్ చేసిన సంచలన ఆరోపణలే ఈ వివాదానికి ప్రధాన కారణం. గతంలో మస్క్ ట్రంప్‌కు మద్దతు ఇచ్చేవారు. అయితే, ఇటీవల వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 2024 అమెరికా ఎన్నికల్లో తన మద్దతు లేకుండా ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నాయకులు ఓడిపోయేవారని మస్క్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, అధ్యక్షుడు సె*క్స్ స్కాండల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్‌స్టీన్తో సంబంధాలు పెట్టుకున్నారని మస్క్ తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుండి తొలగించాలని కూడా అన్నారు.

మస్క్ వ్యాఖ్యలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మస్క్ వ్యాపారాలకు (స్పేస్‌ఎక్స్, టెస్లా వంటివి) సంబంధించిన ప్రభుత్వ ఒప్పందాలను రద్దు చేస్తానని హెచ్చరించారు. దీనికి బదులుగా, మస్క్ తన 'ఎక్స్' ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేస్తూ, "మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందాలను రద్దు చేయడం గురించి అధ్యక్షుడు ఒక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో, స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకల సేవలను ఉపసంహరించుకుంటుంది" అని రాశారు. అయితే, ఆ తర్వాత ఆయన ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గారు. ఈ పరిణామాలు కేవలం వ్యక్తిగత గొడవగానే కాకుండా, దేశ రాజకీయాలపై, ప్రభుత్వ ప్రాజెక్టులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్రంప్, మస్క్ మధ్య వ్యక్తిగత ఆరోపణలు ముఖ్యంగా సె*క్స్ స్కాండల్ ఆరోపణలు వంటివి అధ్యక్ష పదవి ప్రతిష్టకు భంగం కలిగించే అవకాశం ఉందని వైట్ హౌస్ ఆందోళన చెందుతోంది. ఈ వివాదం మరింత పెద్దదైతే, రాబోయే ఎన్నికలపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైట్ హౌస్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, ఈ వివాదాన్ని వెంటనే పరిష్కరించడానికి వైట్ హౌస్ చొరవ తీసుకుంది. ఫోన్ కాల్ ద్వారా మస్క్‌తో మాట్లాడి, పరిస్థితిని చక్కదిద్దాలని చూస్తోంది.