సుంకాల మధ్య పిడుగు.. అమెరికాలో 5.5 కోట్ల వీసాల పరిశీలన
అమెరికా అంటే అవకాశాల స్వర్గం.. భూమ్మీద ఏ ప్రాంతానికి చెందినవారైనా అమెరికాలో స్థిరపడాలని కోరుకుంటారు. కావాల్సినంత స్వేచ్ఛ, అక్కడి జీవన విధానం అలా ఉంటుంది మరి.
By: Tupaki Desk | 22 Aug 2025 11:36 AM ISTపిచ్చోడి చేతికి రాయి.. ట్రంప్ చేతికి అధికారం.. రెండూ ఒకటే అనాలేమో... క్షణానికో నిర్ణయం.. నిమిషానికో ఆదేశం.. రోజుకో సంచలనం... ఇదీ గత 8 నెలల్లో ట్రంప్ అమెరికాతో పాటు ప్రపంచాన్ని కలవరపరుస్తున్న వైనం. ఇప్పటికే భారత్ పై 50 శాతం సుంకాలు విధించి కోట్లాదిమంది కడుపుకొట్టారు ట్రంప్. ఇంకా చాలా దేశాలపై ఇష్టారీతిన సుంకాలు పెంచేశారు ఇప్పుడు మరో భారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిప్రకారం ఆయన చేపట్టబోయే చర్యలు ఎలా ఉంటాయో అని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వలస రాజ్యంలో వీసా రుసరుస
అమెరికా అంటే అవకాశాల స్వర్గం.. భూమ్మీద ఏ ప్రాంతానికి చెందినవారైనా అమెరికాలో స్థిరపడాలని కోరుకుంటారు. కావాల్సినంత స్వేచ్ఛ, అక్కడి జీవన విధానం అలా ఉంటుంది మరి. అందుకే దేశదేశాల నుంచి చదువులు, ఉద్యోగం, ఉపాధి కోసం అమెరికా గడప తొక్కుతుంటారు. దీనికితగ్గట్లే నిబంధనలు ఉంటాయి. అందుకే, అమెరికా వీసా దొరకడం కష్టం అని చెబుతారు. ఇలాంటి వీసాల విషయంలో ట్రంప్ ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా 5.5 కోట్ల విదేశీయుల వీసాల పరిశీలనకు పూనుకున్నారు.
మనవాళ్లపై ప్రభావం ఎంత?
5.5 కోట్ల మంది విదేశీయుల వీసా కాగితాలను క్షుణ్నంగా తనిఖీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. ఎవరైనా వీసా నిబంధనలను ఉల్లంఘించారా? అనేది తేల్చనుంది. ఈ ఉద్దేశం ప్రకారం చూస్తే.. అమెరికాలో నేరాలు పాల్పడినా, ఉగ్ర సంస్థలకు మద్దతిచ్చినా, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న, వీసా గడువు ముగిశాక కూడా అమెరికాలో నివసిస్తున్నా, ప్రజల భద్రతకు భంగం కలిగించినా వారిని వారి దేశాలకు తిప్పి పంపించేయనున్నారు.
అక్రమ వలసదారుల నుంచి వీసాల వరకు
ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వేలాదిమందిని అమెరికా నుంచి గెంటేశారు. ప్రత్యేక విమానాల్లో వారి వారి దేశాలకు పంపించారు. అయినప్పటికీ ఏడెనిమిది నెలల్లోనే మరోసారి వీసాల పరిశీలన ప్రక్రియకు పూనుకున్నారు. మొత్తానికి ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకోకుంటే అది ట్రంప్ ప్రభుత్వం ఎందుకు అవుతుంది? అనే విధంగా వ్యవహరిస్తున్నారు.
