హార్వర్డ్ లో కాబోయే రాణి.. ట్రంప్ నిర్ణయంతో నెక్స్ట్ ఇయర్ ఎలా?
హార్వర్డ్ యూనివర్శిటీ అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని నిషేధిస్తూ ట్రంప్ సర్కార్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 May 2025 9:34 AM ISTహార్వర్డ్ యూనివర్శిటీ అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని నిషేధిస్తూ ట్రంప్ సర్కార్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై హార్వర్డ్ కోర్టును ఆశ్రయించగా.. ట్రంప్ నిర్ణయాన్ని న్యాయమూర్తి తాత్కాలికంగా అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాబోయే యువరాణి కూడా ట్రంప్ నిర్ణయంతో ప్రభావితమైన వారి జాబితాలో ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది.
అవును... హార్వర్డ్ వర్సిటీ అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే అనుమతిని రద్దు చేస్తూ ట్రంప్ సర్కార్ తీసుకొన్న షాకింగ్ నిర్ణయంతో కాబోయే రాణిపైనా ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఇందులో భాగంగా.. బెల్జియంకు కాబోయే 23 ఏళ్ల యువరాణి ఎలిజబెత్ ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసింది. ఈ క్రమంలో ట్రంప్ తాజా నిర్ణయం అనంతరం ఆమె ఫ్యూచర్ ప్లాన్స్ పై చర్చ మొదలైంది!
ఈ సందర్భంగా స్పందించిన బెల్జియన్ రాయల్ ప్యాలెస్ ప్రతినిధి లోర్ వాండొర్న్... యువరాణి ఎలిజబెత్ తన మాస్టర్స్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసిందని.. ఈ సమయంలో ట్రంప్ పరిపాలన తీసుకొన్న నిర్ణయం ప్రభావం రాబోయే రోజుల్లో మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని.. తాము ప్రస్తుతం అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నామని.. ఈ విషయాలను పరిష్కరించుకుంటామని అన్నారు.
ప్రస్తుతం ప్రిన్సెస్ ఎలిజబెత్ హార్వర్డ్స్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీ చదువుతోంది! ఇది రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్. ఆమె హార్వర్డ్స్ లో మాస్టర్స్ ప్రోగ్రామ్ కు రాకముందు యూకేలోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో హిస్టరీ, పాలిటిక్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. ఈమె.. కింగ్ ఫిలిప్ - క్వీన్ మాథిల్డే దంపతులకు జన్మించిన నలుగురు పిల్లల్లో జేష్ట్యురాలు!
కాగా... అంతర్జాతీయ విద్యార్థుల చేర్చుకునే సంస్థ హక్కును రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ట్రంప్ పరిపాలన తీసుకొన్న తాజాగా నిర్ణయాన్ని అమెరికా రాజ్యాంగంపై స్పష్టమైన ఉల్లంఘనగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం అభివర్ణించింది.
ఈ నేపథ్యంలో... హార్వర్డ్ విదేశీ విద్యార్థులను చేర్చుకొనే హక్కును రద్దు చేయకుండా న్యాయమూర్తి ట్రంప్ ను అడ్డుకున్నారు. ఈ మేరకు యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అల్లిసర్ బరోస్ ఉత్తర్వును జరీ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హార్వర్డ్ దావా వేసిన కొన్ని గంటల్లోనే జడ్జి అల్లిసన్ బరోస్ ఈ తీర్పును జారీ చేశారు.
