Begin typing your search above and press return to search.

ట్రంప్ భారీ ప్రాజెక్టు షురూ.. భారీ విజయ తోరణం

తాజాగా ప్లాన్ చేస్తున్న కొత్త నిర్మాణం పూర్తి అయితే 99 అడుగుల ఎత్తులో ఉన్న లింకన్ మెమోరియల్ దీని కన్నా చిన్నదిగా కనిపిస్తుంది.

By:  Garuda Media   |   12 April 2026 12:00 PM IST
ట్రంప్ భారీ ప్రాజెక్టు షురూ.. భారీ విజయ తోరణం
X

మరో భారీ ప్రాజెక్టుకు తెర తీశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో భారీ విజయతోరణాన్ని.. అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. అమెరికాకు స్వాతత్య్రం పొంది 250 ఏళ్లు అవుతున్న సందర్భంలో ఈ భారీ నిర్మాణాన్ని చేపట్టారు. దీనికి సంబంధించి తాజాగా డిజైన్లనను విడుదల చేశారు.

ఈ తోరణంపై న్యూయార్క్ లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చేతిలో ఉన్నట్లుగా కాగడా.. కిరీటంతో పాటు 250 అడుగల ఎత్తైన రెక్కల విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ విగ్రహానికి ఇరువైపులా రెండు గద్దలు.. నాలుగు సింహాల విగ్రహాలు ఉంటాయి. అన్ని విగ్రహాలకు బంగారు పూతతో సిద్ధం చేస్తారు. ఈ తోరణం తూర్పు భాగంలో లింకన్ మెమోరియల్.. పశ్చిమ భాగంలో ఆర్లింగ్టన్ జాతీయ శ్మశాన వాటిక ఉన్నాయి.

తాజాగా ప్లాన్ చేస్తున్న కొత్త నిర్మాణం పూర్తి అయితే 99 అడుగుల ఎత్తులో ఉన్న లింకన్ మెమోరియల్ దీని కన్నా చిన్నదిగా కనిపిస్తుంది. ఈ భారీ విజయ తోరణం ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన.. అందమైనదిగా నిలుస్తుందని పేర్కొంటూ ట్రంప్.. ఒక పోస్టు పెట్టారు. అంతేకాదు.. వాషింగ్టన్ డీసీ కి ఇదో అధ్బుతమైన అదనపు ఆకర్షణగా మారుతుందని పేర్కొన్నారు. ఈ భారీ కట్టడానికి సంబంధించిన వివరాల్ని అమెరికా ప్రభుత్వానికి చెందిన యూఎస్ కమిషన్ ఆన్ ఫైన్ ఆర్ట్స్ విడుదల చేసింది.

నియో క్లాసికల్ శైలిలో రూపొందించే ఈ తోరణంపై బంగారు వర్ణంలో వన్ నేషన్ అండర్ గాడ్ అని.. లిబర్టీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ అనే వ్యాక్యాలు చెక్కుతారని చెబుతున్నారు. 1776లో అమెరికా స్వాతంత్య్ర ప్రకటనపై సంతకం చేసిన జ్ఞాపకార్థం, ఈ ఏడాది జులై నాలుగు నాటికి ఈ తోరణాన్ని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ఎలా సిద్ధం చేస్తారన్న ప్రశ్నకు ట్రంప్ ప్రభుత్వం అత్యాధునిక ఇంజనీరింగ్ పద్దతుల్ని అనుసరించాలని భావిసస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. ప్రత్యేక అనుమతులకు ఫాస్ట్ ట్రాక్ ప్రక్రియను ఫాలో కానున్నట్లు చెబుతున్నారు.

ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని.. ట్రంప్ తన మద్దతుదారుల నుంచి సేకరించిన ప్రైవేటు నిధులతో పాటు.. ప్రభుత్వ నిధులతో దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ట్రంప్ సర్కారు అనుకున్నట్లు ఈ భారీ కట్టడాన్ని ఈ ఏడాది జులై 4 నాటికి పూర్తి చేయటం అసాధ్యమని చెబుతన్నారు. ఇప్పటికే పలువురు కోర్టును ఆశ్రయించటం గమనార్హం.ఈ భారీ విజయ తోరణానికి రూ.840 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా. తొలుత దీన్ని పూర్తిగా ప్రైవేటు నిధులతో నిర్మిస్తామని చెప్పినా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రూ.126కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ద్వారా విడుదల అవుతుందని చెబుతున్నారు.