చమురు కొండపై ట్రంప్ కన్ను.. ఆ దేశంపై నేరుగా యుద్ధానికి సిద్ధం
వెనెజువెలా... దక్షిణ అమెరికా ఖండంలోని దేశం. లెఫ్ట్ పార్టీ ప్రభావం ఉండే వెనెజువెలా...ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం.
By: Tupaki Desk | 8 Sept 2025 9:46 AM ISTపొరుగునున్న కెనడాను 51వ రాష్ట్రంగా చేసుకుంటాం.. గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకుంటాం... అంటూ విస్తరణ కాంక్షను బయటపెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో దేశంపై యుద్ధానికే దిగుతున్నారు. ప్రపంచంలో ఏడు యుద్ధాలను ఆపానని ఒకసారి, నాలుగు మాత్రమే అని మరోసారి వ్యాఖ్యలు చేసిన ట్రంప్... ఏకంగా పొరుగు ఖండంలోని దేశంపై యుద్ధానికి సిద్ధం అవుతున్నారా? అన్న కథనాలు వస్తున్నాయి. యూరప్ దేశాలపై ఆంక్షలు, భారత్ పై టారిఫ్ లు, రష్యాకు బెదిరింపులు, ఉక్రెయిన్ అధ్యక్షుడితో వాదనలు అన్నీ అయిపోగా ఇక మరో దేశంపై యుద్ధం చేయడమే ట్రంప్ ఖాతాలో మిగిలింది. దానిని కూడా భర్తీచేసేలా ఆయన కదులుతున్నారు.
పొరుగు ఖండంలో... చమురు కొండ
వెనెజువెలా... దక్షిణ అమెరికా ఖండంలోని దేశం. లెఫ్ట్ పార్టీ ప్రభావం ఉండే వెనెజువెలా...ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం. అంతేకాక అమెరికాకు మొదట్నుంచి కంట్లో నలుసు. గతంలో హ్యూగో చావెజ్ అధ్యక్షుడిగా ఉండగా ఆయనను హతమార్చేందుకు అమెరికా చాలా ప్రయత్నాలు చేసింది. వెనెజువెలాను ఆర్థికంగా దెబ్బతీసింది కూడా. ఇప్పుడు ట్రంప్ నేరుగా యుద్ధానికే సిద్ధం అంటున్నారన్న కథనాలు వస్తున్నాయి. దీనికోసం కరీబియన్ సముద్రంలో భారీ యుద్ధ నౌకలు, అత్యాధునిక ఫైటర్ జెట్లు, సబ్ మెరైన్లు మోహరించారు. ఇవన్నీ వెనెజువెలా చుట్టూ ఉన్నాయని, ఏ క్షణమైనా ఆ దేశంలోకి అమెరికా దళాలు చొరబడతాయని అంటున్నారు.
ఆ దేశం అంటే ట్రంప్ నకు మంట
అమెరికాలోకి డ్రగ్స్ వెల్లువెత్తడానికి కారణం వెనెజువెలా ముఠాలు అని ట్రంప్ ఆరోపణ. ఈ ముఠాలతో వెనెజెవెలా అధ్యక్షుడు నికొలస్ మదురోకూ లింక్స్ ఉన్నాయని అంటారు. అసలు ఆయన ఎన్నికనే ట్రంప్ ప్రభుత్వం గుర్తించడం లేదు. మదురోను పట్టిస్తే రూ.430 కోట్లు (50 మిలియన్ డాలర్లు) బహుమానం ప్రకటించారు.
-వెనెజువెలాపై యుద్ధం చేసే ఆలోచనలో ఉన్న ట్రంప్.. అత్యాధునిక ఎఫ్ 35 ఫైటర్ జెట్లు పదింటిని శుక్రవారం రాత్రే ప్యూర్టోరికోలో మోహరించింది. పీ 8 నిఘా విమానాలనూ సిద్ధంగా ఉంచింది. అన్నిచోట్లా కలిపి 6,700 మందిపైగా సైన్యం రెడీగా ఉంది. పైకి డ్రగ్స్ ముఠాల అంతు చూసేందుకు అని చెబుతున్నా... యుద్ధం స్థాయిలో సన్నాహాలు ఉండడం గమనార్హం.
-గత వందేళ్లలో తాము ఎదుర్కొన్న అతిపెద్ద ముప్పు ఇదేనని వెనెజువెలా అధ్యక్షుడు మదురో అంటున్నారు. ఇప్పటికే అమెరికా.. డ్రగ్స్ బోటు అంటూ ఓ పడవను ముంచేయగా 11 మంది చనిపోయారు.
ఆక్రమిస్తామని గతంలోనే హెచ్చరికలు
వెనెజువెలా డ్రగ్స్ ముఠాల అంతం అని ట్రంప్ ఇప్పుడు పైకి చెబుతున్నా.. ఆయన అసలు కన్ను ఆ దేశంలోని అపార చమురుపైనే ఉంది. ప్రపంచ చమురులో 17 శాతం (48 వేల మిలియన్ టన్నులు) వెనెజువెలాలోనే ఉంది. 2017లోనే ట్రంప్.. వెనెజువెలాపై యుద్ధం, దాని దగ్గర ఉన్న చమురు, అమెరికాకు దగ్గరగా ఉన్న సంగతిని గుర్తుచేశారు. ఒకవేళ ఆక్రమించి ఉంటే ఆ చమురు అంతా అమెరికాకు దక్కేదని పేర్కొన్నారు.
