ట్రంప్ అటు, వాన్స్ ఇటు... అమెరికాకు విదేశీ ప్రతిభ ఎటు?
అమెరికాలో హెచ్-1బీ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Nov 2025 4:00 AM ISTఅమెరికాలో హెచ్-1బీ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఈ ఏడాది సెప్టెంబర్ లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతమంది నాన్ ఇమ్మిగ్రెంట్ కార్మికుల ప్రవేశంపై పరిమితి విధించాలని భావించారు. ఈ నేపథ్యంలో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... సెప్టెంబర్ 21 - 2025 తర్వాత దాఖలు చేసిన కొన్ని హెచ్-1బీ దరఖాస్తులకు అదనంగా లక్ష డాలర్లు చెల్లించాలని తెలిపారు!
అయితే... అమెరికాలో చదువుకొని, ఉద్యోగాల కోసం హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకొనే విదేశీ విద్యార్థులు లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరం లేదని.. బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు మాత్రం ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వం, వలస సేవల సర్వీస్ (యూఎస్ సీఐఎస్) స్పష్టం చేసింది. ఆ సంగతి అలా ఉంటే... విదేశీ ప్రతిభ విషయంలో అటు ట్రంప్, ఇటు వాన్స్ రెండు భిన్నమైన వాయిస్ లు వినిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అవును... వలస ఉద్యోగులకు సంబంధించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటనలు పూర్తి విభిన్నంగా ఉన్నాయనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగా... ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్... అమెరికాలో నిర్దిష్ట ప్రతిభ ఉన్న కార్మికులు లేరని.. ఆ కొరతను తీర్చడానికి విదేశీ ప్రతిభను తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు! అయితే.. వాన్స్ వెర్షన్ మరోలా ఉంది.
ఇందులో భాగంగా... ఓ పాడ్ కాస్ట్ సంభాషణలో మాట్లాడిన వాన్స్... డెమోక్రాట్ మోడల్ ప్రకారం తక్కువ వేతనాలు తీసుకునే ఎక్కువ మంది విదేశీ ఉద్యోగులు అమెరికాలో ఉన్నారని.. ఇది దేశంలోని ఉద్యోగాలు, వేతనాల శ్రేయస్సుకు హాని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా... అమెరికన్ కార్మికులను శక్తివంతం చేయడానికి దృష్టి పెట్టాలని.. తద్వారా అధిక వేతనాలు పొందుతారు, దేశం మెరుగుపడుతుందని అన్నారు.
అటు ప్రెసిడెంట్, ఇటు వైస్ ప్రెసిడెంట్ నుంచి వచ్చిన ఈ రెండు విభిన్న ప్రకటనలపై ఇప్పుడు కీలక చర్చ మొదలయ్యింది. ఈ సమయంలో... తక్కువ వేతనాల కోసం విదేశీ కార్మికులను తీసుకురావడం ద్వారా దేశీయ ఉద్యోగాలు దెబ్బతింటాయని కొంతమంది అభిప్రాయపడుతుంటే.. ట్రంప్ సూచించినట్లుగా కొన్ని ప్రత్యేక నైపుణ్యాల్లో ఉన్న అంతరాన్ని భర్తీ చేయడానికి, తయారీ రంగంలో శిక్షణ ఇవ్వడానికి హెచ్-1బీ వీసాదారులు అవసరం అని మరికొంతమంది వాదిస్తున్నారు.
హెచ్-1బీ వీసా రద్దుకు బిల్లు!:
మరోవైపు.. ముఖ్యంగా భారతీయులకు వరంగా చెప్పే హెచ్-1బీ వీసా పథకాన్ని పూర్తిగా రద్దు చేసేందుకు అమెరికా ప్రజా ప్రతినిధి ఒకరు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా... దశాబ్ధాలుగా హెచ్-1బీ ప్రోగ్రాంలో అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయని.. ఈ ప్రోగ్రాం అమెరికన్ల అవకాశాలను విదేశీయులు ఎగరేసుకుపోవడానికి ఉపయోగపడుతుందని.. అందుకే పూర్తిగా ఈ వీసాను రద్దు చేసేందుకు బిల్లు ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు మర్జోరీ టెలర్ గ్రీన్ ఇటీవల ‘ఎక్స్’ లో స్పందించిన సంగతి తెలిసిందే!
