Begin typing your search above and press return to search.

ఓ ట్రంపూ.... నీ రాజ్యదాహం చల్లారదా?

ఇంతకూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడా...ప్రపంచాధ్యక్షుడా....అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   12 Jan 2026 9:00 PM IST
ఓ ట్రంపూ.... నీ రాజ్యదాహం చల్లారదా?
X

ఇంతకూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడా...ప్రపంచాధ్యక్షుడా....అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తన తెంపరితనం, మొండితనంతో ప్రపంచ దేశాలపై కొరడాఝళిపించాలన్న ట్రంప్ అత్యుత్సాహం పలువురికి ఇబ్బందికరంగా మరికొందరికి కంటకంగా మారుతోంది. రాజులకు రాజ్యకాంక్ష ఉండేది, అందుకే రక్తపాతం పారించారని గత చరిత్ర చెబుతోంది. అందుకే ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటూ శ్రీశ్రీ పెదవి విరిచాడు. రాజులు పోయారు...రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్యం వచ్చింది...ఇపుడు ప్రజలే ప్రభువులు అంటున్న ఆధునిక యుగంలోనూ ట్రంప్ నిరంకుశంగా పరదేశాలన కబళించేందుకు ప్రయత్నించడాన్ని చాలా మంది తీవ్రంగా నిరసిస్తున్నారు. ఇంత కిరాతంగా వ్యవహరిస్తూ మరో పక్క తాను ప్రపంచ శాంతిదూతనని తనకు శాంతి నోబెల్ బహుమతి రావాల్సిందేనని ప్రకటిస్తుంటాడు. ట్రంప్ కచ్చితంగా అపరచితుడు టైపే అని చెప్పాలి. లేకపోతే శాంతి కోరుకునే వారెవరైనా యుద్ధాలు ప్రకటిస్తారా? దేశాలను చెరబట్టేందుకు దుస్సాహసం చేస్తారా?

ట్రంప్ పైకి కనిపించినంత బోళామనిషి కానేకాదు. అతనిలో రాజ్యకాంక్ష చాలా విపరీతంగా ఉంది. మొన్నటి మొన్న వెనిజులా అధ్యక్షుడు మదురో, అతని భార్యను సిలియాను అత్యంత అమానవీయ ధోరణిలో బేడీలు వేసి మరీ నిర్బంధించడం ప్రపంచదేశాలన్నీ విస్తుపోయి చూశాయి. అనంతరం వెనిజులాకు తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు స్వీకరించారు. వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో మాదక ద్రవ్యాలను అమెరికాకు సరఫరా చేసే ముఠాతో జట్టు కట్టాడని ఆరోపించి మరీ అతణ్ని నిర్బంధించాడు ట్రంప్. ఈ తీరు ట్రంప్ కు బాగా అలవాటై పోయింది. తన దారిలోకి రాని వారిపై అబాండాలు వేయడం, వారి వల్ల అమెరికాకు హాని ఉందని అంటూ దాడులకు దిగడం ఇదే ట్రంప్ శైలి. అందుకే వెనిజులా అధ్యక్షుడిపై ట్రంప్ మోపిన ఆరోపణలు తేలిపోతున్నాయి. అయినా సరే వెనక్కి తగ్గకుండా...అధ్యక్షుణ్ని నిర్బంధించాడు. అంతటితో ఆగకుండా..తాజాగా వెనిజుల తాత్కాలిక అధ్యక్షుణ్ని నేనే అంటూ తన ట్రూత్ సోషల్ మీడియాలో ఓ స్క్రీన్ షాట్ ను షేర్ చేశాడు. పొటో కింద ఈ ఏడాది జనవరి నుంచి వెనిజులాకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నట్లు రాసి ఉంది. ఈ వ్యవహారం ఇపుడు సోషల్ మీడియానే కాదు మెయిన్ మీడియాలో కూడా సంచలనంగా మారుతోంది.

వెనిజులా వ్యవహారం ఇలా ముదురుతుండగానే...ట్రంప్ కన్ను డెన్మార్క్ లోని గ్రీన్ ల్యాండ్ ద్వీపం పై పడింది. ఎలాగైనా ఆ ద్వీపాన్ని హస్తగతం చేసుకోవాలని మరోసారి ఉవ్విళ్ళూరుతున్నాడు. ఉత్తర అమెరికా, యూరప్ మధ్యలో ఉన్న ఈ ద్వీపం సొంతమైతే అమెరికాకు యుద్ధవ్యూహాలు రచించడం మరింత సులువవుతుంది. అమెరికా సైన్యానికి ఇది వ్యూహాత్మక ప్రాంతమవుతుంది. ఇప్పటికే వాయవ్య గ్రీన్ ల్యాండ్ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరముంది. అరుదైన ఖనిజాలకు పుట్టినిల్లుగా ఉన్న గ్రీన్ ల్యాండ్ సొంతమైతే...ఖనిజాల కోసం చైనా పై ఆధారపడే అవస్థ తప్పుతుందని ట్రంప్ దురాలోచన. 2019లో తొలిసారిగా అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంలోనే గ్రీన్ ల్యాండ్ కొనుగోలుకు బేరసారాలాడాడు. అప్పట్లో ప్రభుత్వానికి డబ్బు ఆఫర్ చేస్తే...ఇపుడు ఏకంగా ప్రజల్నే ప్రలోభపెట్టే తతంగానికి తెరలేపాడు. డాలర్లు కుమ్మరించయినా సరే గ్రీన్ ల్యాండ్ ను సొంతం చేసుకోవాలని దుర్బుద్ధితో ఉన్నాడు. ఇది కచ్చితంగా నిరంకుశ ధోరణి కాకపోతే మరేంటి?

ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్ మంటల్లో చలికాచుకోడానికి కూడా ట్రంప్ వెనకాడట్లేదు. ఇరాన్ లో నరమేధం జరుగుతోందని, ప్రజల ప్రాణరక్షణ కరవవుతోందని దొంగఏడ్పులు ఏడుస్తూ....తమ దేశంలో తలదాచుకున్న ఇరాన్ బహిష్కృత యువరాజు రెజీ పహ్లవిని ఎగదోస్తున్నాడు. ఎలాగైనా ఇరాన్ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకోడానికి పన్నాగాలు పన్నుతున్నాడు. ఇరాన్ ఆంతరంగిక వ్యవహారాల్లో తలదూరిస్తే సహించేది లేదని, అలా జరిగితే అమెరికా మిలటరీ స్థావరాలపై దాడులు తప్పవని టెహ్రన్ వర్గం హెచ్చరించినా బ్రహ్మచెముడు ట్రంప్ కు అది తలకెక్కడం లేదు. పైగా ఇరాన్ పరిణామాలు నిశితంగా గమనిస్తున్నామని, గంటగంటకు నివేదికలు తెప్పించుకుంటున్నామని పరిస్థితులు చేయిదాటితే రంగప్రవేశం కచ్చితంగా చేస్తామని ట్రంప్ అంటున్నాడు. అంటే అశాంతి మీరే రగిల్చి...దేశం ఆందోళనలో ఉందని మీరే చెప్పి...ఇరాన్ అస్థిరపరచి ఆ తర్వాత పబ్బం గడుపుకోవాలనేగా మీ దురాలోచన అని ప్రపంచ దేశాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

ఇక సిరియాపై కూడా ట్రంప్ ది ఇదే దురాలోచన. సిరియాలో ఐసిస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో వైమానిక దాడులు ప్రారంభించినట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల సిరియా ఐసిస్ ఉగ్రదాడుల్లో ఇద్దరు అమెరికన్లు మరణించారు. సిరియాలో ఉగ్రవాదుల్ని నిర్వీర్యం చేయాలన్న నెపంతో అమెరికా ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్ ప్రారంభించింది. గత డిసెంబర్ 13న పాల్మైరా ప్రాంతంలో అమెరికా దళాలపై జరిగిన దాడికి ఇది ప్రతీకార ఆపరేషన్ గా అమెరికా అభివర్ణించుకుంది. అలాగే మెక్సికో, క్యూబా, కొలంబియా డ్రగ్స్‌ తయారు చేస్తూ.. అక్రమంగా అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయని ట్రంప్‌ తాజాగా ఆరోపించారు. అనేక ముఠాలకు కూడా ఈ దేశాలు ఆశ్రయమిస్తున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా.. పద్ధతి మార్చుకోకపోతే.. వెనిజులా పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

పై ఘటనలన్నీ వరసగా గమనిస్తే ట్రంప్ వ్యవహారశైలి మనకు సులువుగానే అర్థమవుతుంది. కుక్కను కొట్టేటపుడు పిచ్చికుక్క అని ముద్ర వేయాలని అన్నట్లు ఓ దేశంపై ఆధిపత్యం చెలాయించాలని ట్రంప్ అనుకుంటే వెంటనే ఆదేశం మాదక ద్రవ్యాలకు స్థావరంగా మారిపోతుంది. అంతేకాదు అమెరికాకు సరఫరా చేసేస్తుంది. ఇలా చెబుతూనే ట్రంప్ రెచ్చిపోతున్నాడు. వివిధ దేశాలను హెచ్చరిస్తున్నాడు. ట్రంప్ శైలి ఇలాగే కొనసాగితే కచ్చితంగా అగ్రారాజ్యం అమెరికాకు ప్రపంచంలోని ఇతర దేశాలకు మధ్య బంధాలు దెబ్బతింటాయి. చాలా వేగంగా అమెరికా ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదముందని, ఇప్పటికైనా ఆ దేశ రాజకీయ నేతలు ఈ విషయాన్ని తెలుసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు.