Begin typing your search above and press return to search.

ట్రంప్ ఒత్తిడి... ఆ 49 మంది కోసమైన గాజాపై దయ చూపుతారా?

అక్టోబర్‌ 7 - 2023న ఇజ్రాయెల్ లోని ఓ మ్యూజిక్ ఫెస్ట్ లో సందడిగా ఉన్న పౌరులపైకి హమాస్ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అక్కడున్నవారిని విచక్షణా రహితంగా ఊచకోతకోశారు.

By:  Tupaki Desk   |   30 Jun 2025 9:45 AM IST
ట్రంప్ ఒత్తిడి... ఆ 49 మంది కోసమైన గాజాపై దయ చూపుతారా?
X

అక్టోబర్‌ 7 - 2023న ఇజ్రాయెల్ లోని ఓ మ్యూజిక్ ఫెస్ట్ లో సందడిగా ఉన్న పౌరులపైకి హమాస్ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అక్కడున్నవారిని విచక్షణా రహితంగా ఊచకోతకోశారు. ఈ ఘోర ఘటనలో సుమారు 1200కి పైగా ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. మరో 251 మందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా గాజాకు పట్టుకుపోయారు.

దీంతో.. అక్టోబర్ 8న ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) రంగంలోకి దిగింది. హమాస్ దళాల నిలయంగా ఉన్న గాజాపై దాడులు మొదలుపెట్టింది. ఈ దాడుల్లో హమాస్ అగ్రనేతలంతా హతమయ్యారు. సుమారు 50 వేలకు పైగా హమాస్ ఉగ్రవాదులు, పాలస్థీనా పౌరులు మృతిచెందినట్లు చెబుతున్నారు. నాడు మొదలైన ఇజ్రాయెల్ దండయాత్ర ఇప్పటికీ కొనసాగుతోంది.

ఇప్పటికే గాజా నగరం కాంక్రీట్ శిథిలాల కుప్పగా మారిపోయింది. తినడానికి తిండిలేక అక్కడి పౌరులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఇజ్రాయెల్ పేరు తలచుకుంటేనే వణికిపోతున్న పరిస్థితి. ఇజ్రాయెల్ మాత్రం... చివరి హమాస్ ఉగ్రవాదిని హతమార్చే వరకూ తమ దాడులు ఆగవన్నట్లుగా చెబుతోన్న పరిస్థితి. మరోవైపు హెజ్ బొల్లాను అటాక్ చేస్తోంది.

వారి వద్ద బంధీలుగా ఉన్న తమ పౌరులను అప్పగించాలని ఇజ్రాయెల్ కోరుతోంది. ఈ క్రమంలో... హమాస్ పట్టుకుపోయిన 251 మందిలో ఇప్పటికే కొంతమందిని విడుదల చేయగా, మరికొంతమంది ప్రాణాలు కోల్పోగా, ఇంకా సుమారు 49 మంది ఇప్పటికీ హమాస్ చెరలోనే ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ట్రంప్ ఎంట్రీ ఇచ్చారు.

అవును... ఇప్పటికే భారత్ - పాకిస్థాన్, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధాలు ఆపానని చెప్పుకుంటున్న ట్రంప్... ఇప్పుడు ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధాన్ని కూడా ఆపాలని ఫిక్సయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో మరో వారం రోజుల్లో గాజాలో సీజ్ ఫైర్ ఉండొచ్చంటు పోస్ట్ పెట్టిన ట్రంప్.. తాజాగా మరో పోస్ట్ పెట్టారు.

ఇందులో భాగంగా.. గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని వేగంగా ముగించి, సంధి కుదర్చుకోవాలని కోరారు. 'గాజాలో ఒప్పందం చేసుకోండి.. బందీలను వెనక్కి తీసురండి' అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో... ట్రంప్ గతంలో ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందంతో నెతన్యాహుపై ఒత్తిడి తెచ్చినట్లయ్యిందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే తిండిలేక ఇసుక తింటున్నామన్న స్థాయికి వచ్చేసిన పాలస్తీనా ప్రజలను, వారిని పాలిస్తున్నట్లు చెప్పుకుంటున్న హమాస్ ఉగ్రవాదులను... వారి వద్ద బంధీలుగా ఉన్న 49 మంది ఇజ్రాయెల్ పౌరులే కాపాడాలని పలువురు స్పందిస్తున్నారు. వారికోసమైనా నెతన్యాహు యుద్ధాన్ని ఆపుతారేమో చూడాలని అంటున్నారు.

అదే జరిగి గాజాను ఇజ్రాయెల్ దళాలు గడగడ లాడిస్తున్న కార్యక్రమం ఆగితే... పాలస్తీనా పౌరులు, హమాస్ ఉగ్రవాదులు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు అవుతుందని అంటున్నారు పరిశీలకులు. అలాకానిపక్షంలో.... గాజా పరిస్థితి గురించి ఇంక ఎంత చెప్పుకునే తక్కువే అవుతుందని అంటున్నారు.