Begin typing your search above and press return to search.

అమెరికాతో జాగ్రత్త.. భారత్ కు డేంజర్ బెల్స్!

అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం ప్రవేశపెట్టిన మరో బిల్లు భారత్‌కు మరింత పెద్ద ముప్పుగా మారే అవకాశముంది.

By:  Tupaki Desk   |   3 July 2025 10:42 PM IST
అమెరికాతో జాగ్రత్త.. భారత్ కు డేంజర్ బెల్స్!
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా విధానాలు భారత్‌కు ఆర్థికంగా కలవరం పుట్టిస్తున్నాయి. ఒకవైపు వియత్నాంతో అమెరికా కుదుర్చుకున్న వ్యూహాత్మక వాణిజ్య ఒప్పందం, మరోవైపు రష్యా చమురు కొనుగోలుపై 500 శాతం పన్ను విధించే ప్రతిపాదన.. ఈ రెండు అంశాలూ భారత వాణిజ్య వ్యూహానికి పెద్ద సవాలుగా మారాయి.

-వియత్నాం ఒప్పందం: ఆసియా దేశాలకు హెచ్చరిక

అమెరికా-వియత్నాం మధ్య కొత్తగా కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం.. వియత్నాం నుంచి ఎగుమతి అయ్యే అనేక వస్తువులపై అమెరికా పన్నులు ఏకంగా 20 శాతానికి పెరిగే అవకాశముంది. గతంలో ఈ టారిఫ్‌లు 2-10% మధ్య ఉండేవి. ఈ తాజా ఒప్పందం వియత్నాం వ్యాపార వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా వస్త్రాలు, ఫర్నీచర్‌, ఫుట్‌వేర్‌, సీఫుడ్‌ వంటి రంగాల్లో వియత్నాం కీలక భాగస్వామిగా ఉండగా, ఇప్పుడు చైనా తయారీ వస్తువులు వియత్నాం మార్గంగా అమెరికాకు చేరితే ఏకంగా 40 శాతం అదనపు పన్ను విధించనున్నారు.

గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (GTRI) ఈ పరిణామాన్ని భారత్‌కు ఒక హెచ్చరికగా అభివర్ణించింది. ప్రస్తుతం న్యూఢిల్లీ-వాషింగ్టన్ మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల సమయంలో భారత ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని GTRI సూచించింది. ఇది దీర్ఘకాలిక వ్యాపార స్థిరత్వానికి ఒక పరీక్షగా మారనుంది.

- ‘ఆర్థిక బంకర్ బస్టర్’... 500% పన్ను ముప్పు

అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం ప్రవేశపెట్టిన మరో బిల్లు భారత్‌కు మరింత పెద్ద ముప్పుగా మారే అవకాశముంది. ఈ బిల్లు ప్రకారం, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల నుంచి దిగుమతులపై ఏకంగా 500 శాతం పన్ను విధించనున్నారు. ఇందులో భారత్‌, చైనా ప్రధాన లక్ష్యాలుగా పేర్కొనబడ్డాయి. ఈ బిల్లుకు ట్రంప్ మద్దతు ఇవ్వడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే, భారత్‌కు ఇంధన భద్రతపై తీవ్ర ప్రభావం పడనుంది. అదేవిధంగా ఔషధాలు, వస్త్రాలు వంటి ముఖ్యమైన భారతీయ ఎగుమతులపై అమెరికా మార్కెట్లో ప్రతికూల ప్రభావం కనిపించే ప్రమాదం ఉంది.

-భారత దౌత్యశాఖ స్పందన

ప్రస్తుతం వాషింగ్టన్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ పరిణామాలపై స్పందించారు. ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ‘‘ఆ బిల్లు వాస్తవరూపం దాలిస్తే దాని ప్రభావాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. లిండ్సే గ్రాహంతో మా అధికారులు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. మేము మా ఆందోళనలు వ్యక్తం చేశాం’’ అని పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో భారత్-అమెరికా మధ్య మినీ ట్రేడ్ డీల్ కుదిరే అవకాశమున్న నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు ఎంతో కీలకంగా మారాయి. ఇలాంటి సంక్లిష్ట సమయంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆర్థిక, వాణిజ్య విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తన వాణిజ్య వ్యూహాలను పునరాలోచించాల్సిన అవసరం ఉంది. నిర్దిష్ట చర్యలు తీసుకోకపోతే, దీర్ఘకాలికంగా భారత వాణిజ్య ప్రయోజనాలు భారీ నష్టాలను చవిచూడవచ్చు.