ట్రంప్ ప్రకటించిన ఆ గొప్ప దేశం ఏదబ్బా?
ఇప్పుడు అధ్యక్షుడు స్వయంగా 'మెగా డీల్' గురించి పోస్ట్ చేయడంతో, ఆ 'గొప్ప దేశం' ఈ మూడు దేశాల్లో ఏదో ఒకటి అయి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
By: Tupaki Desk | 8 May 2025 2:25 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ఒక ప్రకటన ప్రపంచ వాణిజ్య వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఓ 'గొప్ప దేశం'తో భారీ వాణిజ్య ఒప్పందం కుదరబోతోందని ఆయన ప్రకటించారు. అయితే ఆ దేశం ఏదో మాత్రం వెల్లడించకపోవడం ఈ సస్పెన్స్‌కు కారణమైంది.
ప్రపంచ దేశాలపై భారీగా టారిఫ్‌లు విధించి వార్తల్లో నిలిచిన ట్రంప్, ఆ తర్వాత వాణిజ్య ఒప్పందాలకు సిద్ధపడ్డారు. సుంకాల భారం తగ్గించుకోవాలంటే తమతో ట్రేడ్ డీల్ చేసుకోవాలని అనేక దేశాలకు సూచించారు. ఈ నేపథ్యంలోనే అనేక దేశాలు అమెరికాతో చర్చలు జరిపాయి.
తాజాగా, ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా ఒక ఆసక్తికర ప్రకటన చేస్తూ, "రేపు ఉదయం 10 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) ఓవల్ ఆఫీసులో అతిపెద్ద మీడియా సమావేశం జరగనుంది. ఓ గొప్ప, గౌరవప్రదమైన దేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. ఆ దేశం అందరికంటే ముందుంది" అని పేర్కొన్నారు. కానీ ఆ 'గొప్ప దేశం' పేరును ఆయన ప్రస్తావించలేదు.
గతంలో భారత్, చైనా సహా పలు దేశాలపై ట్రంప్ భారీ ఎత్తున టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చైనా మినహా ఇతర దేశాలకు ఈ సుంకాల నుంచి 90 రోజుల మినహాయింపు కల్పించి, చర్చలకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలోనే భారత్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతో త్వరలో డీల్ కుదరొచ్చని ట్రంప్ యంత్రాంగం గతంలోనే సూచనప్రాయంగా వెల్లడించింది. ఇప్పుడు అధ్యక్షుడు స్వయంగా 'మెగా డీల్' గురించి పోస్ట్ చేయడంతో, ఆ 'గొప్ప దేశం' ఈ మూడు దేశాల్లో ఏదో ఒకటి అయి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాలు చర్చలకు సిద్ధమయ్యాయి. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో చైనా ఉన్నతాధికారులతో అమెరికా ప్రతినిధులు సమావేశం అయ్యే అవకాశం ఉంది. టారిఫ్‌ల ప్రభావంపై అమెరికా విపణిలో ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో ఈ చర్చలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మొత్తం మీద, ట్రంప్ ప్రకటించిన ఆ 'గొప్ప దేశం' ఏది, ఆ భారీ వాణిజ్య ఒప్పందం వివరాలు ఏమిటి అనేది రేపు ఉదయం జరిగే మీడియా సమావేశంలో తేలిపోనుంది. ఈ ప్రకటన ప్రపంచ వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
