డల్లాస్‌లో పార్లేజీ బిస్కెట్ రూ.370.. భారతీయులపై ట్రంప్ టారిఫ్ దెబ్బ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావం ఇప్పుడు అమెరికా ప్రజలపై బలంగా పడుతోంది.
By: A.N.Kumar | 25 Aug 2025 10:45 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావం ఇప్పుడు అమెరికా ప్రజలపై బలంగా పడుతోంది. ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న భారతీయులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుగా 25 శాతం టారిఫ్‌లు అమల్లోకి వచ్చినా, అప్పటి వరకు స్టోర్లలో పాత స్టాక్ ఉండటంతో ప్రభావం పెద్దగా కనిపించలేదు. అయితే తాజాగా కొత్త సరుకులు మార్కెట్లోకి రావడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజువారీ సరుకుల నుండి కిరాణా వస్తువుల వరకు అన్నీ కష్టతరంగా మారాయి. ఒక్కోసారి సులభంగా అందుబాటులో ఉండే వస్తువులు ఇప్పుడు కుటుంబ బడ్జెట్‌ను దెబ్బతీస్తున్నాయి. ప్రత్యేకంగా సింగిల్ ఇన్‌కమ్ ఫ్యామిలీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నెలవారీ ఖర్చులు భరించలేని స్థాయికి చేరుకుంటుండటంతో జీవన విధానం కఠినతరమవుతోంది. “ఇప్పుడెంత ఆదా చేస్తే అంత బాగుంటుందనే ఆలోచన” ప్రతి కుటుంబంలోనూ అలవాటైపోతోంది.
- డల్లాస్‌లో పార్లే–జీ ధరలపై నెటిజన్ల షాక్
ఇటీవల అమెరికాలోని డల్లాస్‌లో ఓ భారతీయ ప్రవాసి వాల్మార్ట్ స్టోర్‌లో ఇండియన్ ఫుడ్ ప్రొడక్ట్స్ ధరలను వీడియోలో చూపించగా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో రాజత్ అనే ప్రవాసి, షెల్ఫ్‌లలో ఉన్న రాయల్ దాల్, హల్దీరామ్ స్నాక్స్, పార్లే బిస్కెట్లు, మసాలాలు, సాస్‌లను చూపిస్తూ వాటి ధరలను వెల్లడించారు. ఒక కిలో పప్పు (దాల్) $4 (భారత రూపాయల ప్రకారం సుమారు ₹330–₹350), హల్దీరామ్ ఖట్టా మీఠా, ఆలూ భుజియా – $4, పార్లే ‘హైడ్ & సీక్’ బిస్కెట్లు $4.5 (సుమారు ₹370) గా పేర్కొన్నాడు. ఈ ధరలు చూసి భారతీయ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. “భారతదేశంలో ₹20కి దొరికే బిస్కెట్ అక్కడ ₹320? అర్థ కిలో పప్పు దాదాపు ₹400?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కొంతమంది నెటిజన్లు భారతదేశంలో ఉండే అవే ఉత్పత్తులను డల్లాస్‌లో చూసి ఆశ్చర్యపోగా.. మరికొంతమంది భారతదేశంతో పోలిస్తే విదేశాల్లో ఆ వస్తువులు ఎంత ఖరీదైనవో చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “ఓ నో, భారతదేశంతో పోలిస్తే ఇది చాలా ఖరీదు” అని ఒక యూజర్ రాశారు. మరొకరు ఇలా అన్నారు: “4 డాలర్ల హైడ్ అండ్ సీక్ బిస్కెటా? అంటే అది ₹320. ఇండియాలో ₹20కి దొరుకుతుంది. అర కేజీ పప్పు దాదాపు ₹400? వామ్మో, చాలా ఖరీదు.” అంటూ ఆశ్చర్యపోయారు.
ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో విదేశాల్లో స్థిరపడాలనుకునే భారతీయులకు ఈ వీడియో ఒక కనువిప్పు కావాలి. అక్కడ ఆదాయం ఎక్కువ ఉన్నట్లే, ఖర్చులు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో జీవితం బయటికి నాగరికంగా, విలాసవంతంగా అనిపించినప్పటికీ, ప్రతిదానికీ ఒక ధర ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి.
ట్రంప్ ప్రభుత్వం సమయంలో పన్నులు పెరగడం, రవాణా ఖర్చుల వల్ల భారతదేశంతో పోలిస్తే అమెరికాలో భారతీయ ఉత్పత్తులు చాలా ఖరీదైనవి. విదేశాలకు వెళ్లలేక బాధపడేవారు కొంచెం ఆలోచిస్తే ఈ వాస్తవం అర్థమవుతుంది.
- వాస్తవం ఏమిటి?
వీడియోలో కనిపించే ఈ ధరలు ప్రవాస జీవన వాస్తవాన్ని గుర్తుచేస్తున్నాయి. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో జీతాలు ఎక్కువైనా ఖర్చులు కూడా అంతే ఎక్కువ. పైగా టారిఫ్‌లు, రవాణా ఖర్చులు, దిగుమతి పన్నులు ఇవన్నీ కలసి వస్తువులను మరింత ఖరీదైనవిగా మారుస్తాయి. మన దేశంలోనూ సులభంగా దొరికే వస్తువులు, అక్కడ లగ్జరీగా మారిపోతాయి. కాబట్టి “విదేశాల్లో జీవితం వెలుగులు మాత్రమే కాదు, వెనుక భారం కూడా ఎక్కువే” అనే విషయం ఈ సంఘటన మరొకసారి నిరూపించింది.
