Begin typing your search above and press return to search.

ట్రంప్ ప్రతీకార సుంకాలతో భారత్ కు నష్టం ఎంత? లాభం ఎంత?

తమ దేశాన్ని ప్రపంచ దేశాలు దోచుకుంటున్నాయని.. అధిక పన్నులు వేస్తున్నాయని.. ఇందుకు మిత్రులు కూడా మినహాయింపు కూడా కాదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 April 2025 1:45 PM IST
Trump Tariff Tsunami Affect In India
X

తమ దేశాన్ని ప్రపంచ దేశాలు దోచుకుంటున్నాయని.. అధిక పన్నులు వేస్తున్నాయని.. ఇందుకు మిత్రులు కూడా మినహాయింపు కూడా కాదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనటం తెలిసిందే. తమ మీద వేసే అధిక సుంకాలకు తగ్గట్లే తాము ప్రతీకార సుంకాలు వేస్తామని చెప్పిన ట్రంప్.. అందుకు తగ్గ సుంకాల జాబితాను విడుదల చేశారు. భారత ఎగుమతులపై 26 శాతం దిగుమతి సుంకాన్ని.. చైనాపై 40 నుంచి 60 శాతం.. కొన్ని ఉత్పత్తులపై వంద శాతం విధించారు. వియత్నాంపై 30-45 శాతం.. థాయ్ లాండ్ పై 35 - 50 శాతం దిగుమతి సుంకాలను అమెరికా విధించింది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటంటే.. అమెరికాపై అధికంగా ఆధారపడే అలవాటును వీలైనంత ఎక్కువగా తగ్గించుకోవాలి. ఆఫ్రికా.. మధ్య ప్రాచ్యం.. ఆగ్రేయాసియా దేశాలతో కొత్త వాణిజ్య భాగస్వామానికి తెర తీయాలి.

అయితే.. మన మీద కంటే కూడా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించటం భారత్ కు కొంత మేలు చేసే వీలుంది. అదే సమయంలో కొన్ని దేశాలపై భారత్ కంటే తక్కువ దిగుమతి సుంకాల్ని విధించింది. ఉదాహరణకు యూరోపియన్ యూనియన్ పై 20 శాతం.. జపాన్ పై 24 శాతం.. దక్షిణ కొరియాపై పాతిక శాతం సుంకాన్ని అమెరికా విధించింది. మిగిలిన దేశాల్ని వదిలేసి.. మన మీద ట్రంప్ సర్కారు విధించిన ప్రతీకార సుంకాల కారణంగా చూపే ప్రభావాన్ని చూద్దాం. దీనికి ముందు అగ్రరాజ్యానికి మనం దేశం నుంచి ఏ మేరకు ఎగుమతులు అవుతాయి? వాటి విలువ ఎంత? లాంటి అంశాల్ని చూస్తే..

- 2024లో అమెరికాకు భారత్ ఎగుమతుల విలువ 91.23 బిలియన్ డాలర్లు

- విదేశాలకు భారత్ చేసే ఎగుమతుల విలువలో అమెరికా వాటా 18 శాతం

- 2024లో అమెరికా ఉత్పత్తుల దిగుమతుల్లో భారత్ వాటా 2.6 శాతం

- అమెరికాకు చెందిన పాసింజర్ వాహనాలపై 70 శాతం.. యాపిల్స్ మీద 50 శాతం.. ఆల్కహాల్ పై 100-150 శాతం దిగుమతి సంకాల్ని భారత్ విధిస్తోంది.

- ఇలాంటి వేళ భారత్ మీద అమెరికా విధించిన 26 శాతం దిగుమతి సుంకం సమంజసమేనన్నది అగ్రరాజ్య వాదన.

ట్రంప్ సర్కారు విధించిన ప్రతీకార సుంకాలతో మన దేశంలో ప్రభావితమయ్యే రంగాలు

- రొయ్యలు

- వస్త్రాలు

- స్టీల్

- ఫార్మా ఉత్పత్తులు

- విలువైన రాళ్లు

- ఎలక్ట్రికల్ .. ఎలక్ట్రానిక్ పరికరాలు

భారత్ మీద ప్రభావం చూపే అంశాల విషయంలోకి వెళితే..

- టైక్స్ టైల్ - అప్పారెల్ రంగాలకు సంబంధించి భారత్ కు పోటీ తగ్గుతుంది

- తాజా సుంకాల కారణంగా భారత్ నుంచి అమెరికాకు రొయ్యల ఎగుమతుల విలువ తగ్గుతుంది

- భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు తగ్గుతాయి

- ఆభరణాల ఎగుమతిపైనా ప్రభావం ఉంటుంది.

- మన దేశంలోని అనేక స్మూక్ష్మ.. చిన్న.. మధ్య తరహా సంస్థలు ప్రభావితమవుతాయి

- హ్యాండి క్రాఫ్ట్ గార్మెంట్స్ ఎగుమతులపై ప్రభావం

నష్టాలు సరే.. లాభాల మాటేమిటి?

- సౌర ఉత్పత్తుల్ని ఇప్పటివరకు చైనా ఎక్కువగా ఎగుమతులు చేస్తుంటుంది. తాజా సుంకాల కారణంగా చైనాపై అమెరికా ఆధారపడటం తగ్గిస్తుంది. ఇది భారత్ కు మేలు చేస్తుంది.

- భారత్ నుంచి సాఫ్ట్ వేర్ సర్వీసులు.. ఫైనాన్షియల్ టెక్నాలజీ.. బిజినెస్ అవుట్ సోర్సింగ్ కు సంబంధించిన ఎగుమతులు పెరిగే వీలుంది.

- భారత్ తో పోలిస్తే చైనా.. యూరోప్ లపై అధిక సుంకాలు విధించిన కారణంగా అమెరికా కొనుగోలుదారులు భారత ఇంజనీరింగ్ ఉత్పత్తులపై ఫోకస్ పెట్టే వీలుంది.

- చైనా ఉత్పత్తులపై అధికంగా ఉన్న దిగుమతి సుంకాల కారణంగా పలు బహుళ జాతి సంస్థలు తమ ఉత్పత్తిని భారత్ లో పెట్టే వీలుంది.

- దీని కారణంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే వీలుంది.

- అదే జరిగితే భారత్ లో ఎలక్ట్ట్రానిక్స్.. బ్యాటరీలు.. సెమీ కండక్టర్ లకు సంబంధించిన సంస్థలు భారత్ లో ఎక్కువగా ఏర్పాటవుతాయి.

- తాజా సుంకాలతో భారత్ నుంచి బియ్యం.. సుగంధ ద్రవ్యాలు.. ప్రాసెస్డ్ ఫుడ్ కు అమెరికా మార్కెట్ లో డిమాండ్ పెరుగుతుంది.