ట్రంప్ టారిఫ్ దెబ్బకు భారత్ లో ఈ రంగాలు కుదేలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు షాకిచ్చారు. న్యూదిల్లీ తమకు వాణిజ్య భాగస్వామి అని చెబుతూనే, ఊహించని విధంగా దిగుమతి సుంకాలను పెంచారు.
By: Tupaki Desk | 3 April 2025 1:39 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు షాకిచ్చారు. న్యూదిల్లీ తమకు వాణిజ్య భాగస్వామి అని చెబుతూనే, ఊహించని విధంగా దిగుమతి సుంకాలను పెంచారు. అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్‌లతో పోలిస్తే తాము సగం మాత్రమే వసూలు చేస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. భారత్ తమ ఉత్పత్తులపై సగటున 52% సుంకం విధిస్తుండగా.., తాము కేవలం 26% మాత్రమే విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ ఆర్థిక వ్యవస్థలోని కొన్ని కీలక రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఫార్మా ఉత్పత్తులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ రంగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం:
-వ్యవసాయం, డెయిరీ, సీఫుడ్
గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) విశ్లేషణ ప్రకారం..., ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం వ్యవసాయ రంగంపై ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా రొయ్యలు, ఇతర సీఫుడ్ ఉత్పత్తుల ఎగుమతులు బాగా దెబ్బతినే అవకాశం ఉంది. 2024లో భారత్ నుంచి అమెరికాకు 2.58 బిలియన్ డాలర్ల విలువైన చేపలు, ప్రాసెస్డ్ సీఫుడ్ ఎగుమతులు జరిగాయి. తాజా సుంకల పెంపుతో అమెరికా మార్కెట్‌లో వీటి ధరలు పెరిగి, డిమాండ్ తగ్గే అవకాశం ఉంది.
ఇక డెయిరీ రంగం విషయానికొస్తే.., కొత్త టారిఫ్‌లతో సుంకం 38.23 శాతానికి చేరుతుంది. దీనివల్ల వెన్న, నెయ్యి, పాలపొడి వంటి ఉత్పత్తుల ధరలు అమెరికాలో పెరుగుతాయి. ప్రస్తుతం భారత్ నుంచి 181.49 మిలియన్ డాలర్ల విలువైన డెయిరీ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. వీటితో పాటు ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, కోకో ఎగుమతులపై కూడా ప్రభావం ఉండనుంది.
-టెక్స్‌టైల్స్, బంగారం:
భారత్ నుంచి ఏటా 11.88 బిలియన్ డాలర్ల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. తాజా పెంపుతో వీటిపై సుంకం 13.32 శాతానికి చేరుతుంది. దీంతో అమెరికాలో ఆభరణాల ధరలు పెరగనున్నాయి. అలాగే, జౌళి పరిశ్రమ కూడా ఈ ప్రభావానికి గురికానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి 9.6 బిలియన్ డాలర్ల విలువైన దుస్తులు, ఇతర టెక్స్‌టైల్ ఫ్యాబ్రిక్స్ అమెరికాకు ఎగుమతి అయ్యాయి. మన మొత్తం టెక్స్‌టైల్ ఎగుమతుల్లో 28 శాతం అమెరికాకే వెళ్తున్నాయి.
-చెప్పులపైనా ప్రభావం:
పాదరక్షల పరిశ్రమ కూడా ట్రంప్ టారిఫ్‌ల నుంచి తప్పించుకోలేదు. భారత్ నుంచి 457.66 మిలియన్ డాలర్ల విలువైన ఫుట్‌వేర్ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. వీటిపై అమెరికా-భారత్ మధ్య సుంకాల్లో వ్యత్యాసం 15.56 శాతంగా ఉంది. దీంతో అమెరికా మార్కెట్‌లో భారతీయ చెప్పుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది వినియోగదారులు ఇతర దేశాల ఉత్పత్తులను ఎంచుకునేలా చేయవచ్చు.
-ఎలక్ట్రానిక్స్:
ఎలక్ట్రానిక్స్, టెలికాం రంగంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2024లో 14.39 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యాయి. ఇప్పుడు సుంకాల పెంపుతో అమెరికా మార్కెట్‌లో భారతీయ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. దీంతో బాయిలర్లు, టర్బైన్స్, కంప్యూటర్ల వంటి వాటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
మొత్తంగా ట్రంప్ తీసుకున్న ఈ టారిఫ్ నిర్ణయం భారతదేశంలోని అనేక కీలక రంగాలపై గణనీయమైన ప్రభావం చూపనుంది. దీనివల్ల ఎగుమతులు తగ్గి, దేశీయంగా ఆయా రంగాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ పరిణామాలను భారత ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి.
