‘నాడు కోవిడ్ - నేడు డొనాల్డ్’... యురోపియన్ దేశాలకు ట్రంప్ కొత్త షాక్!
అవును... ఇటీవల 14 దేశాలకు సుంకాల లేఖలు రాసి, బ్రిక్స్ దేశాలకు పది శాతం బోనస్ సుంకం ప్రకటించిన ట్రంప్.. ఆ నిర్ణయాన్ని తప్పు బట్టిన బ్రెజిల్ కు 50% సుంకాలు విధించారు.
By: Tupaki Desk | 13 July 2025 10:00 PM ISTప్రపంచ దేశాలకు మొన్నటి వరకూ కరోనా భయం ఉంటే.. 2025 నుంచి మాత్రం కొత్త రకం భయం పట్టుకుందని.. దాని పేరు ట్రంప్ అనే మాటలు వినిపిస్తున్నాయి. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచీ ప్రపంచ దేశాలపై సుంకాల దండయాత్ర మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా మెక్సికో, యురోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలకు షాకిచ్చారు.
అవును... ఇటీవల 14 దేశాలకు సుంకాల లేఖలు రాసి, బ్రిక్స్ దేశాలకు పది శాతం బోనస్ సుంకం ప్రకటించిన ట్రంప్.. ఆ నిర్ణయాన్ని తప్పు బట్టిన బ్రెజిల్ కు 50% సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో తాజాగా పలు దేశాలపై మళ్లీ సుంకాల మోత మోగించారు. మెక్సికోతో పాటు ఈయూ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 30 శాతం సుంకాలు విధించారు.
మిగిలిన దేశాలతోపాటు ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయెన్, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్ బామ్ లకు అమెరికా అధ్యక్షుడు లేఖలు రాశారు. దీంతో ఇప్పటివరకూ 24 దేశాలకు, 27 ఈయూ సభ్య దేశాలకు ట్రంప్ సుంకాలను ఖరారు చేసినట్లయ్యింది.
వాస్తవానికి... ఈయూ నుంచి అత్యధికంగా కార్లు, విమానాలు, రసాయనాలు, మద్యం, ఔషధాలు, వైద్య పరికరాలు అమెరికాకు వస్తుంటాయి. అమెరికా కంపెనీలు ఈయూకి క్లౌడ్ కంప్యూటింగ్, న్యాయ, ఆర్థికపరమైన సేవల విక్రయం, ట్రావెల్ బుకింగ్స్ ఇస్తుంటాయి. ఈ క్రమంలో... ఈయూ-యూఎస్ మధ్య 2024లో 2 లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం జరిగింది.
అయితే... ఇందులో ఈయూకు 19,800 కోట్ల డాలర్ల మిగులు ఉందన్నది ట్రంప్ ఆరోపణ. ఈ లోటును తీర్చడానికి ఈయూ నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై అధిక సుంకం విధిస్తానని గత కొన్ని నెలలుగా బెదిరిస్తున్నారు.. వాటిని ఇప్పుడు నిజం చేస్తూ లేఖలు రాశారు. ఈ తాజా పెంపు ఈయూతో వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే.. ఈ పెంపు వెనుక ట్రంప్ మాస్టర్ ప్లాన్ మరొకటి ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా... యురోపియన్ యూనియన్ దేశాల నుంచి వాహన, ఔషధ, వైద్య పరికరాల ఉత్పత్తుల కంపెనీలు అమెరికాకు తిరిగి వచ్చేలా చేయాలన్నది ట్రంప్ ప్రయత్నం అని అంటున్నారు.
