14 దేశాలకు లేఖలు పంపిన ట్రంప్... మోత మోగేది ఎప్పుడంటే..!
ఇందులో భాగంగా.. ప్రపంచదేశాలపై సుంకాల మోత మోగించారు. ఈ సందర్భంగా.. 14 దేశాలకు టారిఫ్ లేఖలు పంపించారు. అనంతరం భారత్ తో పాటు పలు దేశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 8 July 2025 11:12 AM ISTరెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ ప్రపంచ దేశాలను పలు రకాలుగా ఇబ్బందిపెడుతున్న ట్రంప్.. తాజాగా అనుకున్నపని చేశారు. ఇందులో భాగంగా.. ప్రపంచదేశాలపై సుంకాల మోత మోగించారు. ఈ సందర్భంగా.. 14 దేశాలకు టారిఫ్ లేఖలు పంపించారు. అనంతరం భారత్ తో పాటు పలు దేశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... 14 దేశాలకు ట్రంప్ టారిఫ్ లేఖలు రాశారు. ఇవి 25% నుంచి మొదలై 40% వరకూ ఉండటం గమనార్హం. ఇందులో భాగంగా.. ఆసియాలో తమకు అత్యంత కీలకమైన భాగస్వాములుగా ఉన్న జపాన్, దక్షిణ కొరియాలతో పాటు కజకస్తాన్, మలేషియా, ట్యునీషియాలపై 25% టారిఫ్ విదించిన ట్రంప్... మయన్మార్, లావోస్ లపై అత్యధికంగా 40% విధించారు.
ఇదే సమయంలో... దక్షిణాఫ్రికా, బోస్నియాలపై 30%, ఇండోనేషియాపై 32%.. బంగ్లాదేశ్, సెర్బియాలపై 35%.. కంబోడియా, థాయిలాండ్ లపై 36% సుంకాలు విధించారు. ఈ సందర్భంగా... జపాన్, దక్షిణ కొరియాతో పాటు మిగిలిన దేశాలకూ ప్రతీకార సుంకాల గడువును ఆగస్టు 1 వరకూ పొడిగించారు.
రెండు దేశాల నేతలను ఉద్దేశిస్తూ రాసిన లేఖలను ఆయన 'ట్రూత్' లో ఉంచారు. రెండు దేశాలు ప్రతీకార సుంకాలను పెంచవద్దని, అలా చేస్తే వారి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు దెబ్బతింటాయని.. ఏ కారణాలవల్ల సుంకాలను పెంచినా ఇప్పుడు తాము విధించిన 25శాతానికి అదనంగా ఆ సుంకాలను వేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
ఇదే సమయంలో... సుంకాల ఉపశమనానికి ఇచ్చిన గడువు బుధవారంతో ముగియనుండటంతో దానిని ఆగస్టు 1 వరకూ పొడిగిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఈ నేపథ్యంలో భారత్ కు మరికొంత కాలం గడువు లభించింది. బుధవారంలోగా భారత్, అమెరికాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశముందని తెలుస్తోంది.
భారత్ తో ఒక గొప్ప ఒప్పందం జరగబోతోంది!:
భారత వాణిజ్య ప్రతినిధి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం వాషింగ్టన్ లో చర్చలు జరుపుతోన్న వేళ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... భారత్ తో ఒక గొప్ప ఒప్పందం జరగబోతోందని.. ఇది చాలా ప్రత్యేకమైన డీల్ అవుతుందని అన్నారు. ఇప్పటికే యూకే, చైనాతో ఒప్పందాలు కుదిరాయని.. ఇతర దేశాలు అమెరికా షరతులకు అంగీకరించకపోతే సుంకాల మోత తప్పదని హెచ్చరించారు.
బ్రిక్స్ కు మద్దతిచ్చే దేశాలపై 10% అదనం!
ఇదే సమయంలో... బ్రిక్స్ అనుసరిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే దేశాలపై 10% అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవని స్పష్టం చేశారు. ఏకపక్ష సుంకాల పెంపుపై బ్రిక్స్ కూటమి ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ మేరకు స్పందించారు.
ట్రంప్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బ్రెజిల్!:
ఇలా బ్రిక్స్ దేశాలకు 10% అదనపు సుంకాలు అనే ప్రకటన అనంతరం... బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వా స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇందులో భాగంగా... ప్రపంచం గతంలోలా లేదని.. చాలా మారిపోయిందని.. అందువల్ల మనకు చక్రవర్తి అవసరం లేదని అన్నారు.
బ్రెజిల్ లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... మన దేశాలు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాయని.. ట్రంప్ సుంకాలను జారీ చేస్తే.. ఇతర దేశాలకు అదే చేసే హక్కు ఉందని స్పష్టం చేశారు. ట్రంప్ సుంకాల గురించి సోషల్ మీడియాలో ప్రపంచ దేశాలను బెదిరించడం బాధ్యతారాహిత్యంగా భావిస్తున్నామని తెలిపారు.
