Begin typing your search above and press return to search.

ప్రతీకార సుంకానికి 90 రోజులు బ్రేక్..ట్రంప్ కీలక నిర్ణయం

ప్రతీకార సుంకాల పేరుతో ప్రపంచాన్ని ఆగమాగం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు.

By:  Tupaki Desk   |   10 April 2025 4:32 AM
Trump Hits Pause on Tariff Tsunami
X

ప్రతీకార సుంకాల పేరుతో ప్రపంచాన్ని ఆగమాగం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. అనేక దేశాలపై అమలు కావాల్సిన సుంకాల షాక్ ను 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ట్రంప్ సుంకాల షాక్ తో దారుణంగా దెబ్బ తింటున్న మార్కెట్ సూచీలకు కాస్తంత రిలీఫ్ వచ్చినట్లైంది. గతంలో ఉన్న పది శాతమే 90 రోజుల పాటు అమలు చేస్తామని ప్రకటించారు. చైనా విషయంలో మాత్రం తగ్గేదే లేని స్పష్టం చేశారు. తాజా రిలీఫ్ పొందిన దేశాల్లో భారత్ కూడా ఉంది.

ట్రంప్ ప్రతీకార సుంకాలతో కుప్పకూలుతున్న ప్రపంచ మార్కెట్లకు ట్రంప్ తాజా నిర్ణయం ఉపశమనం కలిగించినట్లైంది. ట్రంప్ నిర్ణయం వెలువడినంతనే అమెరికా మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. గడిచిన కొద్ది రోజులుగా ట్రంప్ ప్రతీకార సుంకాల నిర్ణయం.. అది అమల్లోకి బుధవారం నుంచే రావాల్సి ఉంది. అయితే.. బుధవారం సాయంత్రం ట్రంప్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. చైనా మినహా మిగిలిన దేశాలపై సుంకాలకు 90రోజుల మినహాయింపు ఇస్తున్నట్లుగా ప్రకటించారు.

ఈ సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఒళ్లు మండేలా ఉన్నా.. ప్రతీకార సుంకం కారణంగా ఎదురయ్యే విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తగ్గాల్సిన దుస్థితి. తాము ప్రతీకార సుంకాల్ని విధించిన నేపథ్యంలో 75 దేశాలు అమెరికా ప్రతినిదుల్ని సంప్రదించాయని.. వాణిజ్యం.. వాణిజ్య అడ్డంకులు.. సుంకాలు.. కరెన్సీ విలువల్ని మార్చటం లాంటి వాటిపై చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపరాన.. అందుకే 90 రోజుల విరామాన్ని ప్రకటిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ 90 రోజుల పాటు ఎప్పటి మాదిరే పది శాతం సుంకం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రతీకార సుంకాలపై ప్రపంచ దేశాలు కాళ్ల బేరానికి వస్తున్నాయని.. తమతో ఒప్పందానికి ఏం చేయటానికైనా సిద్ధమవుతున్నట్లుగా ట్రంప్ ఒళ్లు బలుపు వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ కాంగ్రెస్ కమిటీ విందు సమావేశంలో పాల్గొన్న ట్రంప్.. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ప్లీజ్.. ప్లీజ్ సర్.. మాతో ఒప్పందం చేసుకోండని వేడుకుంటున్నాయి’’ అంటూ రాయలేని కొన్ని పదాల్ని ప్రపంచ దేశాలను ఉద్దేశించి చేయటం గమనార్హం.

ట్రంప్ తాజా నిర్ణయంతో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా దూసుకెళ్లాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.30 గంటల వేళలో ఆరు శాతం లాభంతో డోజోన్స్.. 8.5 శాతం లాభంతో నాస్ డాక్.. 6.7 శాతం లాభంతో ఎస్అండ్ పీ సూచీలు రాణించాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. చైనాతో మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ట్రంప్ ప్రకటిస్తే.. అందుకు ధీటుగా చైనా సైతం స్పందించింది. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం రానున్న రోజుల్లో మరెన్ని పరిణామాలకు తావిస్తుందో చూడాలి.